Share News

Nominations Completed పరిషత్‌ పోరులో... నామినేషన్ల పరిశీలన పూర్తి

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:17 AM

Parishad Polls: Scrutiny of Nominations Completed జిల్లాలో ప్రాదేశిక పోరుకు సంబంధించి శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పార దర్శకంగా చేపట్టారు. మన్యంలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 127 మంది, 226 ఎంపీటీసీ స్థానాలకు 1267 మంది నామినేషన్లు వేశారు. జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ అభ్యర్థుల సమక్షంలోనే సీఈవో సుధాకరరావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించారు.

  Nominations Completed పరిషత్‌ పోరులో...  నామినేషన్ల పరిశీలన పూర్తి

పార్వతీపురం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రాదేశిక పోరుకు సంబంధించి శనివారం నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను పార దర్శకంగా చేపట్టారు. మన్యంలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 127 మంది, 226 ఎంపీటీసీ స్థానాలకు 1267 మంది నామినేషన్లు వేశారు. జడ్పీ కార్యాలయంలో జడ్పీటీసీ అభ్యర్థుల సమక్షంలోనే సీఈవో సుధాకరరావు ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులు నామినేషన్లను పరిశీలించారు. మండలాల్లో ఎన్నికల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోల పర్యవేక్షణలో ఎంపీ టీసీ అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం చేపట్టారు. కాగా ఈ నెల 25న తిరస్కరించిన నామినేషన్లపై అప్పీల్‌ చేసుకోవచ్చు. 26న ఎన్నికల అధికారి నామినేషన్ల తిరస్కరణపై తుది నిర్ణయం తీసుకుంటారు. ఈనెల 27న నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రచురిస్తారు.

- జిల్లాలో 86 ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో 46 నామినేషన్లు డబుల్‌ సెట్లు కాగా వివిధ కారణాలతో మిగతా నామినేషన్లను తిరస్కరించారు. డబుల్‌ సెట్ల నేపథ్యంలో పార్వతీపురం మండలంలో ఒకటి, జియ్యమ్మవలస- ఐదు, వీరఘట్టం- 13, భామిని-27 , వివిధ కారణాలతో పార్వతీపురం, బలిజిపేట, సాలూరు ,పాచిపెంట, వీరఘట్టం, భామిని మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున, సీతానగరం మండలంలో మూడు నామినేషన్లను తిరస్కరించారు. ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల సంఖ్య తేలనుంది. 1181 మంది నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

- జడ్పీటీసీ స్థానాలకు 127 నామినేషన్లు రాగా 111ను ఆమోదించారు. 16 నామినేషన్లను తిరస్కరించారు. ఇందులో డబుల్‌ ఎంట్రీలు అధికంగా ఉన్నట్లు తెలిసింది.

నేడు పురాల్లో అభ్యర్థుల జాబితా ప్రకటన

పార్వతీపురం, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీలో బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేయనున్నారు. చైర్‌పర్సన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. పట్టణాల్లో ఈ నెల 16న నామినేషన్లు స్వీకరించారు. 18వ తేదీతో ఈ ప్రక్రియను ముగించారు. 21న నామినేషన్ల ఉపసంహరణ కూడా సాఫీగా పూర్తయింది. అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రకటించాల్సి ఉండగా.. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేశారు. ఈ నెల 25న ప్రకటించాలని ఎన్నికల సంఘం ఆదేశించడంతో పురాల్లో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఏ పార్టీకి ఎన్ని?

పార్వతీపురం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి కూటమిలో సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు కేటాయిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరోవైపు అధిష్ఠానాల ప్రకటన కోసం అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు టీడీపీతో పాటు జనసేన, బీజేపీ పార్టీల తరపున అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. ప్రధానంగా 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి టీడీపీ నుంచి 43 , వైసీపీ41 , బీజేపీ నాలుగు, జనసేన 23 నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే అధికారికంగా బీఫారాలు అందించలేదు. సీట్ల సర్దుబాటు అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీంతో నామినేషన్‌ వేసిన అభ్యర్థులందరూ అధిష్ఠానాల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు.

జడ్పీ పీఠం ఎవరికో...

జిల్లాలో నూతనంగా ఏర్పాటైన జడ్పీని టీడీపీకి కేటాయించే అవకాశం ఉంది. జడ్పీ పీఠం ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో చైర్మన్‌ అభ్యర్థిగా కూటమి పార్టీ నుంచి వీరేష్‌ చంద్రదేవ్‌ పేరు దాదాపు ఖరారైనట్టు సమాచారం. కానీ దీనిపై కూటమి పార్టీల అధిష్ఠానాలు అధికారికంగా ప్రకటించలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కురపాం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు వీరేష్‌ ప్రయత్నించారు. అయితే అధిష్ఠానం టికెట్‌ ఖరారు చేయలేదు. అయినప్పటికీ అప్పట్లో పార్టీ విజయం కోసం తనవంతు కృషి చేశారు. ఈ నేపథ్యంలో వీరేష్‌ను జడ్పీ చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పార్వతీపురం జడ్పీటీసీ స్థానం ఎవరికి కేటాయిస్తారనేది చర్చనీయాంశమవుతోంది. ఈ స్థానం నుంచి బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు, టీడీపీ సీనియర్‌ నాయకులు గొట్టాపు వెంకటనాయుడు పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ నామినేషన్లు దాఖలు చేయగా.. కూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని ఎవరికి కేటాయిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Updated Date - Oct 25 , 2026 | 12:17 AM