Share News

Parishad Battle Today నేడే పరిషత్‌ పోరు

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:04 AM

Parishad Battle Today పరిషత్‌ పోరకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,43,874 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Parishad Battle Today నేడే పరిషత్‌ పోరు
పోలింగ్‌ బూత్‌ల వారీగా సామగ్రిని సరిచూసుకుంటున్న సిబ్బంది

  • ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు

  • ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లిన సిబ్బంది

  • 15 జడ్పీటీసీ స్థానాలకు 52 మంది.. 226 ఎంపీటీసీ స్థానాలకు 534 మంది అభ్యర్థుల పోటీ

పార్వతీపురం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పోరకు సర్వం సిద్ధమైంది. జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఎన్నికల సామగ్రితో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 6,43,874 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వారిలో 3,14,899 మంది పురుషులు, 3,28,910 మంది మహిళలు, 65 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. జిల్లాలో 15 జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 52 మంది, 226 ఎంపీటీసీ స్థానాలకు గాను 534 మంది బరిలో ఉన్నారు. 7న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని, ఎన్నికల సిబ్బందికి విధులు, బాధ్యతలపై ఇప్పటికే స్పష్టమైన సూచనలు అందించామని తెలిపారు. మండల కేంద్రాల్లోని డిస్ర్టిబ్యూషన్‌ సెంటర్లలో ఎన్నికల సామగ్రి పంపిణీ పూర్తిచేశామన్నారు. బ్యాలెట్‌ బాక్సులు, రవాణా తదితర ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశా మని వెల్లడించారు. పోలింగ్‌ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని సూచించామన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియో గించుకోవాలని పిలుపునిచ్చారు. ఓటరు కార్డుతో పాటు ఆధార్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు వంటి గుర్తింపు పత్రాలతో ఓటు వేయొచ్చని తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్నారు.

799 పోలింగ్‌ కేంద్రాలు..

జిల్లాలో 799 పోలింగ్‌ కేంద్రాలు అన్ని ఏర్పాటు చేయగా.. ఎన్నికల సామగ్రి, సిబ్బంది తరలింపు కోసం 108 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. అతి సమస్యాత్మక గ్రామాలు 279 , సమస్యాత్మక గ్రామాలు 179, సాధారణ పోలింగ్‌ కేంద్రాలు 341 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో పార్వతీపురం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఉల్లిభద్ర ఉద్యాన కళాశాల, సాలూరు , పాలకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో కౌంటింగ్‌ ఏర్పాట్లు చేశారు.

ఏర్పాట్లను పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌

పాలకొండ: నగర పంచాయతీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డి స్ర్టిబ్యూషన్‌ సెంటర్‌ను సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో పీవో, ఏపీవో, ముగ్గురు ఓపీవోలను నియమించామన్నారు.

- పార్వతీపురం రూరల్‌: పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో పకబ్బందీగా పోలింగ్‌ ఏర్పాట్లు చేశామని డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి తెలిపారు. పోలింగ్‌ సిబ్బందికి అసర మైన మెటీరియల్‌ అందించామని, భోజన వసతి కల్పించామన్నారు. అన్ని కేంద్రాల్లో వీడియోగ్రఫీ ద్వారా నిఘా కొనసాగుతుందన్నారు. సున్నిత, అతి సున్నిత పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టిసారించామని తెలిపారు.

సారా, మద్యం రవాణాపై నిఘా

పాలకొండ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మద్యం, నాటుసారా రవాణాపై నిఘా పెట్టామని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి కె.సహదేవ్‌ తెలిపారు. ఎవరైనా అమ్రంగా సారా, మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బుధవారం పాలకొండ ఎక్సైజ్‌ స్టేషన్‌ను ఆయన సందర్శించారు. పెండింగ్‌ కేసులపై అధికారులతో సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పాలకొండ, వీరఘట్టం, సీతంపేట, భామిని నాలుగు మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. అక్రమ మద్యం, సారా నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

900 మందితో బందోబస్తు : ఎస్పీ

బెలగాం, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గురువారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు బందోబస్తు ఏర్పాట్లు పూర్తిచేశామని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ... ప్రశాంత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ మేరకు 900 మంది పోలీస్‌ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బృందాలను నియమించామని వెల్లడించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టామన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందన్నారు. బ్యాలెట్‌ బాక్సులు స్ర్టాంగ్‌ రూమ్‌లకు వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించామన్నారు.

Updated Date - Nov 05 , 2026 | 12:04 AM