Share News

పంచాయతీ ఓటర్లు 12,83,475

ABN , Publish Date - Apr 17 , 2026 | 11:42 PM

పంచాయతీ ఎన్నికల డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా పరిధిలోని 776 పంచాయతీల్లో 12,83,475 మంది ఓటర్లు ఉన్నట్లు డ్రాఫ్ట్‌ జాబితాను అధికారులు విడుదల చేశారు.

పంచాయతీ ఓటర్లు 12,83,475
విజయనగరం మండలం సుంకరిపేట పంచాయతీ డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్న అఽధికారులు

- డ్రాఫ్ట్‌ జాబితా ప్రదర్శన

- ఈ నెలాఖరు వరకు అభ్యంతరాల స్వీకరణ

- వచ్చే నెలలో తుదిజాబితా

విజయనగరం, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా సిద్ధమైంది. జిల్లా పరిధిలోని 776 పంచాయతీల్లో 12,83,475 మంది ఓటర్లు ఉన్నట్లు డ్రాఫ్ట్‌ జాబితాను అధికారులు విడుదల చేశారు. విజయనగరం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 12 మండలాలు, 327 గ్రామ పంచాయతీలు, 3,124 వార్డులు ఉన్నాయి. చీపురుపల్లి రెవెన్యూ డివిజన్‌లో 8 మండలాలు, 243 గ్రామ పంచాయతీలు, 2,288 వార్డులు, బొబ్బిలి డివిజన్‌లో 7 మండలాలు, 206 పంచాయతీలు, 1,916 వార్డులు ఉన్నాయి. మొత్త మూడు డివిజన్ల పరిధిలోని 776 పంచాయతీల్లో 12,83,475 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 6,34,935, మహిళా ఓటర్లు 6,48,506 మంది, ఇతరులు 34 మంది ఉన్నారు. వాస్తవానికి ఈ జాబితాను మార్చి నెలఖరు నాటికే సిద్ధం చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ, ప్రభుత్వ పరంగా పలు కార్యక్రమాలు, పథకాల అమల్లో అధికారులు బిజీగా ఉండడంతో జాబితా సిద్ధం చేయలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల 15 నాటికి జాబితా ఉండాలని ఎన్నికల సంఘం గడువిచ్చింది. ప్రభుత్వం కూడా తగిన ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 15న సాయంత్రం పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాను అధికారులు తయారు చేసి, 16న ఎన్నికల సంఘానికి పంపించారు. జాబితాలను పంచాయతీ కార్యాలయాలతో పాటు సచివాలయాల వద్ద ఉంచాలని ఈసీ ఆదేశించింది. ప్రస్తుతం డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితాను ప్రదర్శిస్తున్నారు. దీనిపై ఏమైనా సందేహాలు, అభిప్రాయాలు, మార్పులు, చేర్పులు ఉంటే ఈ నెలాఖరు వరకూ స్వీకరించి, వెంటనే తుది జాబితాను విడుదల చేస్తారు. ఇదే జాబితాతో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - Apr 17 , 2026 | 11:42 PM