Share News

Paidimamba sirimanu pungal పైడిమాంబకు నీరాజనం

ABN , Publish Date - Oct 28 , 2026 | 12:20 AM

Paidimamba sirimanu pungal సిరిమానుపై వస్తున్న అమ్మవారిని కనులారా చూసేందుకు ఎదురుచూసిన ఉత్తరాంధ్ర భక్తజనం జోరుగా వర్షం కురుస్తున్నా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తడుస్తూనే అమ్మకు నీరాజనం పలికారు. జై పైడిమాంబ అంటూ బిగ్గరగా నినదించారు. పూలు, పండ్లు విసురుతూ భక్తిప్రపత్తులను చాటారు. తనివితీరా అమ్మవారిని చూస్తూ ఉండిపోయారు. సిరిమానుపై పైడిమాంబ ప్రతిరూపంగా ఆశీనులైన పూజారి వెంకటరావు భక్తులపై అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు. ఈ కమనీయ దృశ్యాలను వీక్షించిన భక్తులంతా పులకించిపోయారు.

Paidimamba sirimanu pungal పైడిమాంబకు నీరాజనం
వర్షంలో సిరిమాను ఊరేగింపును వీక్షిస్తున్న భక్తులు

పైడిమాంబకు నీరాజనం

జోరువానలో అంబరాన్నంటిన సిరిమాను సంబరం

వర్షాన్ని లెక్కచేయకుండా సిరిమానును వీక్షించిన భక్తులు

గంటన్నర వ్యవధిలోనే ఊరేగింపు పూర్తి

ఆద్యంతం పర్యవేక్షించిన కలెక్టర్‌, ఎస్పీ

సిరిమానుపై వస్తున్న అమ్మవారిని కనులారా చూసేందుకు ఎదురుచూసిన ఉత్తరాంధ్ర భక్తజనం జోరుగా వర్షం కురుస్తున్నా ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. తడుస్తూనే అమ్మకు నీరాజనం పలికారు. జై పైడిమాంబ అంటూ బిగ్గరగా నినదించారు. పూలు, పండ్లు విసురుతూ భక్తిప్రపత్తులను చాటారు. తనివితీరా అమ్మవారిని చూస్తూ ఉండిపోయారు. సిరిమానుపై పైడిమాంబ ప్రతిరూపంగా ఆశీనులైన పూజారి వెంకటరావు భక్తులపై అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు. ఈ కమనీయ దృశ్యాలను వీక్షించిన భక్తులంతా పులకించిపోయారు. ఊరేగింపు పూర్తయ్యే వరకూ ఎక్కడివారక్కడే ఉండిపోయారు. తుఫాన్‌ నేపథ్యంలో అధికారులు అనుకున్నట్టే మధ్యాహ్నం 3 గంటలకే సిరిమాను కదిలింది. చదురుగుడి నుంచి కోట వరకూ గంటన్నర వ్యవధిలో మూడు పర్యాయాలు తిరిగింది. 4 గంటల 37 నిమిషాలకు మూడోసారి చదురుగుడికి చేరుకుంది.

విజయనగరం కల్చరల్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడిమాంబ సిరిమాను సంబరం అంబరాన్ని తాకింది. జోరువానలోనూ సిరిమాను చదురుగుడి నుంచి కోట వరకూ విజయవంతంగా మూడు పర్యాయాలు తిరిగింది. ఊరేగింపును వీక్షించేందుకు వేలాదిగా వచ్చిన భక్తులు వర్షంలోనూ ఏమాత్రం నిరాశ పడకుండా అమ్మవారిని దర్శించుకున్నారు. వర్షం వల్ల భక్తులు తాకిడి తగ్గినప్పటికీ ఎప్పటిలాగే పోలీసు బందోబస్తు యథావిధిగా సాగింది. మూడంచెల బారికేడ్‌ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటుచేసి సిరిమానోత్సవాన్ని విజయవంతంగా జిల్లా యంత్రాంగం నిర్వహించింది. అధికారులు అనుకున్నట్టే మధ్యాహ్నం 3 గంటలకు సిరిమాను ముందుకు కదిలింది. చదురుగుడి నుంచి మూడు పర్యాయాలు కోట వరకూ సాగిన ఊరేగింపు గంటన్నర వ్యవధిలో ముగిసింది. 4 గంటల 37 నిమిషాలకు సిరిమాను మూడోసారి చదురుగుడికి చేరుకుంది. కలెక్టర్‌ ఎస్‌.రామసుందర్‌రెడ్డి చదురుగుడి వద్దే ఉండి పర్యవేక్షించారు. తొలుత పూజారి బంటుపల్లి వెంకటరావు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పదోసారి సిరిమాను అధిరోహించారు. అమ్మవారి పరివారంగా భావించే పాలధార ముందుకు సాగింది. తలయారీ రామవరపు చినపైడిరాజు వారి పరివారం కూడా పైడిమాంబ నామస్మరణతో ముందుకు పయనమైంది. ఆ వెంట తెల్లఏనుగు, అంజలి రథం, సిరిమాను మూడు పర్యాయాలు కోట బురుజు వరకూ వెళ్లి తిరిగి చదురుగుడికి చేరుకున్నాయి. ఈ సమయంలో జోరువాన కురుస్తున్నప్పటికీ భక్తులు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. అమ్మవారిని చూస్తూ ఎక్కడివారక్కడే ఉండిపోయారు. సిరిమానును అధిరోహించిన పూజారి వెంకటరావు భక్తులపై అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.

- తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో సిరిమానోత్సవ నిర్వహణపై అధికారులు టెన్షన్‌ పడ్డారు. వర్షంతో పాటు గాలులు వీయడంతో సిరిమానోత్సవాన్ని తొందరంగా చేపట్టాలని నిర్ణయించి త్వరత్వరగా ఏర్పాట్లు చేశారు. చివరకు సంబరాన్ని ప్రశాంతంగా నిర్వహించారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సిరిమాను వెంటే ఉండి పర్యవేక్షించారు. ఉన్నతాధికారుల నుంచి సిబ్బంది వరకు అందరూ వర్షంలోనే విధులు నిర్వర్తించి పైడిమాంబ సిరిమాను జాతరను విజయవంతం చేయగలిగారు.

- కోట బురుజుపై పూసపాటి వంశీయులు ఆశీనులయ్యారు. వర్షం భారీగా పడడంతో ఒక దఫా సిరిమానోత్సవాన్ని తిలకించి తిరిగి ప్రయాణమయ్యారు. అదే చోట మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో పాటు పలువురు ప్రముఖులు గొడుగులు వేసుకుని సిరిమానోత్సవాన్ని ఆద్యంతం వీక్షించారు. శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఉదయం కుటుంబ సభ్యులతో పైడిమాంబను దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షం కారణంగా సిరిమానోత్సవాన్ని ఒక దఫా తిలకించి వెళ్లిపోయారు.

పైడిమాంబ అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించాలి

గోవా గవర్నర్‌ అశోక్‌గజపతిరాజు

విజయనగరం కల్చరల్‌/విజయనగరం రూరల్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): పైడిమాంబ అందరికీ మరింత జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకున్నట్లు గోవా గవర్నర్‌ అశోక్‌ గజపతిరాజు చెప్పారు. పైడిమాంబను దర్శించుకున్న అనంతరం ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అజ్ఞానంతో ముందుకు వెళితే, సమాజానికి నష్టం జరుగుతుందన్నారు. పైడిమాంబ ఆలయ విస్తరణపై మాట్లాడుతూ, ఆలయం విస్తరించే ప్రక్రియ సకాలంలో పూర్తి కావడం ఆనందాన్నిస్తోందన్నారు. పైడిమాంబ చల్లని ఆశీస్సులు భక్తులందరిపై వుండాలన్నారు. ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ, నిర్దేశించిన సమయంలోగా పైడిమాంబ ఆలయ విస్తరణ ప్రక్రియ సకాలంలో పూర్తికావడం అమ్మవారి చలువేనన్నారు.

Updated Date - Oct 28 , 2026 | 12:20 AM