Overcoming the Accident ప్రమాదాన్ని జయించి..
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:34 PM
Overcoming the Accident పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఆటో మార్గమధ్యంలో బోల్తాపడింది. ఈ ఘటనలో గర్బిణితో పాటు ఏడుగురు గాయపడ్డారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు.
ప్రాణాపాయం నుంచి బయటపడిన గర్భిణి
ఆసుపత్రిలో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
గుమ్మలక్ష్మీపురం, జనవరి30(ఆంధ్రజ్యోతి): పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ నిండు గర్భిణిని ఆసుపత్రికి తీసుకెళ్తున్న ఆటో మార్గమధ్యంలో బోల్తాపడింది. ఈ ఘటనలో గర్బిణితో పాటు ఏడుగురు గాయపడ్డారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చు కున్నారు. మరోవైపు హుటాహుటిన గర్భిణిని ఆసుపత్రికి తరలించగా.. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
గుమ్మలక్ష్మీపురం మండలం పెదరావికోన గ్రామానికి చెందిన తోయక లక్ష్మి(31)కి గురువారం రాత్రి పురిటినొప్పులు ఎక్కువయ్యాయి. ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న రేగిడి పీహెచ్‌సీకి తరలిం చాలని కుటుంబ సభ్యులు భావించారు. దీంతో గ్రామంలోని ఓ ఆటోను బుక్ చేసుకుని గర్భిణితో పాటు కుటుంబ సభ్యులు, బంధువులు ఆసుపత్రికి పయనమయ్యారు. మూడు కిలో మీటర్లు ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా అదుపుతప్పి ఆటో బోల్తాపడింది. దీంతో గర్భిణితో పాటు మిగతా వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. కనురెప్పపాటులో జరిగిన ఈ ప్రమాదంతో వారంతా షాక్‌కు గురయ్యారు. గర్భిణికి ఏమైందోనని ఆందోళన చెందారు. వెంటనే తేరుకుని పురిటినొప్పులతో విలవిల్లాడుతున్న లక్ష్మి వద్దకు వెళ్లి చూడగా.. గాయాలపాలైనట్లు గుర్తించారు. స్థానికుల సాయంతో గర్భిణితో పాటు మరో ఏడుగురు రేగిడి పీహెచ్‌సీకి చేరుకున్నారు. ప్రథమ చికిత్స పొందిన అనంతరం వైద్యుల సూచనల మేరకు గర్భిణితో పాటు మిగతా క్షతగాత్రులు 15 కిలోమీటర్ల దూరంలోని కురుపాం సీహెచ్‌సీకి చేరుకున్నారు. అక్కడి వైద్యులు లక్ష్మిని పరీక్షించి డెలివరీ చేయగా.. శుక్రవారం ఉదయం ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రమాదాన్ని జయించి తల్లీబిడ్డ క్షేమంగా ఉండడంతో కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ ప్రమాద ఘటనపై ఎల్విన్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.