Share News

over raining వాయు‘గండం’

ABN , Publish Date - Sep 22 , 2026 | 11:51 PM

over raining జిల్లా అంతటా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాగులు, నదుల్లో ప్రవాహం పెరిగింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. పంట పొలాలు కూడా చెరువుల్లా మారాయి. తీరంలో కెరటాలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి.

over raining వాయు‘గండం’
నారాయణపురం ఆనకట్ట వద్ద నాగావళి ప్రవాహం

వాయు‘గండం’

జిల్లాకు భారీ వర్షసూచన

ఇప్పటికే భారీ వర్షాలు

ఈరోజు, రేపు తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం హెచ్చరిక

జిల్లా యంత్రాంగం అప్రమత్తం

అన్ని శాఖలను అలెర్ట్‌ చేసిన కలెక్టర్‌

ఈరోజు విద్యాసంస్థలకు సెలవు

నిండుగా ప్రాజెక్టులు

జిల్లా అంతటా వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. వాగులు, నదుల్లో ప్రవాహం పెరిగింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. పంట పొలాలు కూడా చెరువుల్లా మారాయి. తీరంలో కెరటాలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. మరోవైపు గాలులు కూడా పెరిగాయి. బుధ, గురువారాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ రామసుందర్‌రెడ్డి విద్యా సంస్థలకు బుధవారం సెలవు ప్రకటించారు. అల్పపీడనం వాయుగుండంగా మారనుండడంతో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు.

విజయనగరం, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి):

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారుతోంది. ఉత్తరాంధ్ర తీరం వైపు దూసుకొస్తోంది. దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం వేకువజాము నుంచే ఎడతెరిపిలేకుండా వాన పడుతూ ఉంది. బుధ, గురువారాల్లో వర్షం తీవ్రత అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం 18 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొస్తోంది. శ్రీకాకుళంలోని కళింగపట్నం తీరానికి ఆగ్నేయంగా 200 కిలోమీటర్లు, విశాఖకు తూర్పుగా 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత కానీ.. తెల్లవారుజామున కానీ విశాఖ-గోపాల్‌పూర్‌ మధ్య తుఫాన్‌ తీరం దాటే అవకాశం ఉంది. దీంతో ఈ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రెడ్‌జోన్‌ ప్రకటించింది. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.

జిల్లాలో సగటున 43.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. డెంకాడలో 60 మిల్లీమీటర్ల వాన పడింది. వంగరలో 35.2, రేగిడిలో 31.1, సంతకవిటిలో 38.7, రాజాంలో 43, బొబ్బిలిలో 42.6, రామభద్రపురంలో 43.7, బాడంగిలో 36.2, తెర్లాంలో 32.8, మెరకముడిదాంలో 37.4, దత్తిరాజేరు 35.1, మెంటాడలో 38.6, గజపతినగరంలో 39.8, గరివిడిలో 45.3, చీపురుపల్లిలో 39.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. తీర ప్రాంతంలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. 55-65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

- వర్షాలకు రైతు ఊరట చెందుతున్నాడు. గత మూడు నెలల్లో 36 శాతం లోటువర్షపాతం కొనసాగింది. జూన్‌లో 22.02 శాతం, జూలైలో 65.98 శాతం, ఆగస్టులో 18.46 శాతం వర్షపాతం లోటుగా నమోదైంది. సెప్టెంబరు నెలకు సంబంధించి తొలి 20 రోజులు వర్షాలు పడలేదు. వాయుగుండం ప్రభావంతో వర్షాలు పడుతుండడంతో రైతులకు కొంతవరకూ ఉపశమనం లభించినట్లయింది.

- భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ అప్రమత్తం చేశారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకూడదని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించారు.

- కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే..శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మంగళవారం ఉదయం కలెక్టర్‌ పలు మండలాల్లో ఆకస్మికంగా పర్యటించారు. బొండపల్లి, గజపతినగరం, రామభద్రపురం తహసీల్దారు కార్యాలయాలను పరిశీలించారు. తుఫాను, సన్నద్ధత ఏర్పాట్లు, కంట్రోల్‌రూంల విషయమై ఆరాతీశారు.

- వాగులు, వంకలు, నదులు, సాగునీటి ప్రాజక్టులు కళకళలాడుతున్నాయి. మడ్డువలస జలశయం నిండుకుండాల మారింది. పూర్తిస్తాయిలో నీరు చేరుకోవటంతో మంగళవారం రాత్రి నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఆండ్ర, తాటిపూడి జలశయాలకు భారీగా వర్షపు నీరుచేరుకుంటోంది.

నేడు పాఠశాలలకు సెలవు

విజయనగరం, కలెక్టరేట్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి) వాయగండం కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో బుధవారం అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్‌ సెలవు ప్రకటించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని మండలాల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించి విద్యార్థులెవరూ బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండేలా సమాచారం అందించాలని సూచించారు.

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

విజయనగరం, కలెక్టరేట్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి):

రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నేపధ్యంలో జిల్లా ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావొద్దని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి కోరారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన తుఫాన్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఆయన మంగళవారం సాయంత్రం సందర్శించారు. మంగళవారం నాలుగు గంటల్లో 5.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయిందని, రానున్న మూడు రోజుల్లో మరింతగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నదులు పొంగి ప్రవహిస్తున్న చోట బైక్‌లు, వాహనాలు స్కిడ్‌ అయి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్నందున అటువైపు వెళ్లకూడదని చెప్పారు.

తీరంలో కెరటాల హోరు

భోగాపురం, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): ముక్కాం, కొండ్రాజుపాలెం, చేపలకంచేరు, ఎర్రముసలయ్యపాలెం పరిధిలో సముద్ర కెరటాలు భీకర శబ్దంతో తీరాన్ని తాకుతున్నాయి. సముద్రం ఉధృతంగా మారడం, గాలులు వీయడంతో మత్స్యకారులు గృహాలకే పరిమితమయ్యారు. వేట సామాగ్రికి నష్టం వాటిళ్లకుండా పడవలను తీరంలో ఉంచి వాటిని తాళ్లతో కట్టి, వేట సామగ్రిని భద్ర పరుచుకొన్నారు. మండల ప్రత్యేక అధికారి, స్వర్ణగ్రామ సిబ్బంది తీరంలో పర్యటించి మత్స్యకారులతో మాట్లాడి సూచనలు ఇచ్చారు.

నారాయణపురానికి జల కళ

సంతకవిటి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): తుఫాన్‌ ప్రభావంతో నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. నారాయణపురం ఆనకట్ట జలకళను సంతరించుకుంది. ప్రవాహం భారీగా పెరగడంతో రంగారాయిపురం, వాసుదేవపట్నం, జావాం, కొత్తూరు రామచంద్రపురం తదితర లోతట్టు గ్రామాల్లో అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. మంగళవారం నారాయణపురం ఆనకట్టలోకి సుమారు 3,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరినట్లు ఇరిగేషన్‌ ఏఈ రాంబాబు తెలిపారు.

- వాల్తేరు గ్రామంలో ఓ భారీ చెట్టు మంగళవారం రోడ్డుపై కూలిపోయింది. దీంతో కొద్దిసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ శాఖ ఏఈ వినయ్‌కుమార్‌ వెంటనే స్పందించి చెట్టును తొలగించి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు.

అధికారులతో కలెక్టర్‌ సమీక్ష

విజయనగరం కలెక్టరేట్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లా యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండి అందుబాటులో ఉండాలని కలెక్టరు రామసుందర్‌ రెడ్డి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశంఉందని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అధికారులు తమకు కేటాయించిన హెడ్‌ క్వార్డర్స్‌లోనే తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, అత్యవసర సమాచారం, వర్షాలు, వరదలకు సంబంధించిన సమస్యలపై వెంటనే స్పందించి అధికారులకు సమాచారం అందేలా సమన్వయం చేసుకోవాలన్నారు.

Updated Date - Sep 22 , 2026 | 11:51 PM