over raining ‘అల’ జడి
ABN , Publish Date - Sep 21 , 2026 | 11:40 PM
over raining బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా మారింది. ముక్కాం తీరంలో కెరటాలు పెద్దగా శబ్ధం చేస్తూ ఉవ్వెత్తున తీరాన్ని తాకుతున్నాయి. వాతావరణం మారడంతో మత్స్యకారులు తీరానికే పరిమితమయ్యారు.
‘అల’ జడి
- ముక్కాం తీరంలో ఉవ్వెత్తున కెరటాలు
- జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వాన
- నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం
- అప్రమత్తమైన అధికారులు
- కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం
భోగాపురం, సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం అలజడిగా మారింది. ముక్కాం తీరంలో కెరటాలు పెద్దగా శబ్ధం చేస్తూ ఉవ్వెత్తున తీరాన్ని తాకుతున్నాయి. వాతావరణం మారడంతో మత్స్యకారులు తీరానికే పరిమితమయ్యారు. వేట సామగ్రిని భద్రపర్చుకున్నారు. అల్పపీడనం రెండు రోజల్లో తీవ్ర వాయుగుండంగా మారనుందని... ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరానికి చేరువయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణం కేంద్రం చెబుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నెల 24వ తేదీ వరకు అధిక వర్షం పడే అవకాశం ఉందంటున్నారు. తీర ప్రాంత మండలాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీవో సుధాసాగర్ సూచించారు. ముక్కాం తీరాన్ని ఆయన సోమవారం రాత్రి సందర్శించారు. మత్స్యకారులు ఎవరిని సముద్రంపైకి వేటకు వెళ్లనీయకుండా చూడాలని, ప్రమాదకర భవనాల్లో ఉన్నవారంతా సురక్షిత ప్రాంతాల్లో ఉండేలా చూడాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ జి.హేమంత్‌కుమార్, ఎంపీడీవో డీడీ స్వరూపరాణి, సీఐ కె.దుర్గాప్రసాదరావు తదితరులు ఉన్నారు.
తుఫాన్‌పై అప్రమత్తం
విజయనగరం టౌన్, సెప్టెంబరు21(ఆంధ్రజ్యోతి): తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. రైతులు, పశువుల కాపర్లు పొలాలకు వెళ్లిన సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరమైతేనే ప్రయాణాలు సాగించాలన్నారు. కలెక్టర్ కార్యాలయంలో టోల్‌ఫ్రీ నెంబర్ 08922-236947 ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు
ప్రత్యేక కంట్రోలు రూం ఏర్పాటు
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, సెప్టెంబరు 21 ( ఆంధ్రజ్యోతి): అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడనున్నాయని కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. అల్పపీడనం వాయుగుండంగా మారి విజయనగరం,శ్రీకాకుళం జిల్లాల మధ్య తీరం దాటే అవకాశం ఉండడంతో అఽధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. సోమవారం నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవచ్చునని, గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. లోతట్టు ప్రాంతాల్లో వాగులు, చెరువులు, గెడ్డలు పొంగిపొర్లుతాయని, ముంపు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఎటుంటి పరిస్థితుల్లో పశు, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని కోరారు. ఈ మూడు రోజులు అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేసినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది లోతట్టు, ముంపు ప్రాంతాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. బలహీనంగా వున్న భవనాలు, ప్రమాదకర నిర్మాణాలు, విద్యుత్ స్తంభాలు తదితర ప్రాంతాలను ముందుగా గుర్తించి అవసరమైనచర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం అందుబాటులో వుంచాలన్నారు. ప్రజల నుంచి వచ్చిన సమాచారం మేరకు వెంటనే స్పందించాలన్నారు. డివిజన్, మండల, నగరపాలక సంస్థ కార్యాలయాల్లో సిబ్బంది వుండి, 24 గంటలూ వర్షాలను పర్యవేక్షించాలన్నారు. రోడ్లు దెబ్బతిన్నా, ఎవరికి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించాలన్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకుండా చూడాలన్నారు. ఇప్పటికే సముద్రంలో వున్న మత్స్యకారుల పడవల వివరాలు తెలుసుకుని అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు.