Share News

over heat నిప్పుల కొలిమి

ABN , Publish Date - May 21 , 2026 | 11:45 PM

over heat జిల్లా నిప్పుల కొలిమిలా మారిందా.. అగ్ని వర్షం కురుస్తోందా.. అన్నట్లు వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రత గురువారం ఏకంగా 44 డిగ్రీలు నమోదైంది. గుర్లలో 45 డిగ్రీలకు చేరింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. ఒక్కసారిగా పెరిగిన ఎండలకు జనం బెంబేలెత్తిపోయారు. గురువారం ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రాలేదు. పలు మండలాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

over heat నిప్పుల కొలిమి
విజయనగరం: నిర్మానుష్యంగా ఎన్టీఆర్‌ సర్కిల్‌

నిప్పుల కొలిమి

44 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రత

గుర్లలో అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్‌

బయటకు రాని జనం

నిర్మానుష్యంగా జంక్షన్లు, ప్రధాన రహదారులు

జిల్లా నిప్పుల కొలిమిలా మారిందా.. అగ్ని వర్షం కురుస్తోందా.. అన్నట్లు వాతావరణం మారిపోయింది. ఉష్ణోగ్రత గురువారం ఏకంగా 44 డిగ్రీలు నమోదైంది. గుర్లలో 45 డిగ్రీలకు చేరింది. ఈ ఏడాది ఇదే అత్యధికం. ఒక్కసారిగా పెరిగిన ఎండలకు జనం బెంబేలెత్తిపోయారు. గురువారం ఉదయం 10 గంటల తర్వాత ఎవరూ బయటకు రాలేదు. పలు మండలాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడదెబ్బతో జిల్లాలో వేర్వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.

విజయనగరం, మే 21 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలో గురువారం ఒక్కసారిగా పెరిగిన వేడిని చూసి జనం భయాందోళన చెందారు. పని ఉంటే తప్ప బయటకు రావడానికి ప్రయత్నించలేదు. ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత బాగా పెరిగింది. విజయనగరంలో ఎప్పుడూ రద్దీగా ఉండే కూడళ్లు బోసిపోయాయి. ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. ప్రతి ఇంటా ఫ్యాన్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏసీలు సైతం ఆపలేదు. ఇంకోవైపు గాలి వేడెక్కి ఇంట్లో ఉన్న వారు కూడా ఉక్కబోతతో విలవిల్లాడారు. ఏసీలు, కూలర్లు లేనివారు గోనె సంచులు, దుప్పట్లను తడిపి ఇంటికి అడ్డుగా పెట్టుకోవడం కనిపించింది. మరో నాలుగైదు రోజులు ఇదే విధంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ బయటకు రావద్దని పేర్కొన్నారు.

ఉష్ణోగ్రతలు ఇలా..

మండలం ఉష్ణోగ్రత

గుర్ల 45 డిగ్రీలు

మెంటాడ 44 డిగ్రీలు

రాజాం 44 డిగ్రీలు

బొబ్బిలి 43 డిగ్రీలు

దత్తిరాజేరు 44 డిగ్రీలు

కొత్తవలస 44 డిగ్రీలు

వడదెబ్బతో ఇద్దరి మృతి

తెర్లాం/ చీపురుపల్లి, మే 21(ఆంధ్రజ్యోతి): ఎండలకు తీవ్రతకు తాళలేక వడదెబ్బకు గురై జిల్లాలో వేర్వురు చోట్ల ఇద్దరు మృతిచెందారు. తెర్లాం మండలం నందిగాం గ్రామంలో గురువారం ఉపాధిహామీ పనులు చేస్తున్న గులిపల్లి తవుడమ్మ (62) ఎండ తీవ్రతకు కళ్లు తిరిగి పడిపోయింది. తోటి కూలీలు అప్రమత్తమై చెరువులో ఏర్పాటు చేసిన టెంటు వద్దకు ఆమెను తీసుకువెళ్లి సపర్యలు చేసి మంచినీరు అందించారు. ఆ వెంటనే ఆమెకు వాంతులు మొదలవ్వడంతో తెర్లాంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందినట్లు తహసీల్దార్‌ జి.సత్యనారాయణ తెలిపారు. ఈమె భర్త సత్యం కొన్నేళ్ల క్రితం మరణించగా వివాహితులైన కుమారుడు, కుమార్తె ఉన్నారు. చీపురుపల్లి అంబేడ్కర్‌ కాలనీకి చెందిన లక్కిడాపు రఘు (30) కూడా వడదెబ్బతో మృతి చెందాడు. గాంధీబొమ్మ సమీపంలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగించే రఘు గురువారం రోజులాగే చెప్పులు కుడుతుండగా కళ్లు తిరిగి పడిపోయాడు. స్థానికులు అసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. రఘుకు భార్య పద్మ ఉన్నారు.

వడగాడ్పులపై అప్రమత్తం

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతుమాధవన్‌

విజయనగరం కలెక్టరేట్‌, మే 21(ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్రలో రానున్న వారం రోజులూ వడగాడ్పులు వీచే ప్రమాదం ఉందని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతుమాధవన్‌ తెలిపారు. వేసవి తీవ్రతపై తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో గురువారం టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉపాధి హామీ పనులు జరుగుతున్న చోట, ఎక్కువ మంది కార్మికులు పనిచేస్తున్న చోట నీడ ఏర్పాటు చేయాలన్నారు. అదే విధంగా సురక్షితమైన తాగునీరు కూడా ఏర్పాటు చేయాలన్నారు. ప్రధానంగా బస్సు స్టాండ్లు, మార్కెట్‌ కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలల్లో, వృద్ధులకు, పారిశుధ్యం కార్మికులకు తాగునీరు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు సరఫరా చేయాలన్నారు. అన్ని సచివాలయాల్లో వీటిని సిద్ధంగా ఉంచాలన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ 08922-236947 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉపాధి హామీ కార్మికులు , అధికారులు కూడా 11 గంటల తర్వాత బయటకు రావద్దని సూచించారు. రాపిడ్‌ రెస్పాన్స్‌ టీములను సిద్ధం చేయాలని జిల్లా వైద్యా ఆరోగ్య ఆరోగ్య శాఖ అధికారికి సూచించారు.

నేటి నుంచి ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర మహాయజ్ఞంలో భాగంగా జిల్లాలోని అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఈనెల 22 నుంచి జూన్‌ 20 వరకూ నాలుగు వారాలపాటు ముమ్మరంగా పారిశుధ్య డ్రైవ్‌ (ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌) నిర్వహించనున్నట్లు ఇన్‌చార్జి కలెక్టర్‌ సేతు మాధవన్‌ తెలిపారు. గురువారం తన చాంబర్‌లో మున్సిపల్‌ కమిషనర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలీటీల్లో ఏకకాలంలో నిర్వహించే అతిపెద్ద క్లీన్‌ స్వీప్‌ డ్రైవ్‌గా దీనిని నిలిపి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించేందుకు అవకాశం ఉందని, దీనిపై ప్రత్యేక బృందాలు డాక్యుమెంటేషన్‌ సిద్ధం చేస్తున్నాయని, ఇందులో విజయనగరం జిల్లా ముందుండాలని సూచించారు.

Updated Date - May 21 , 2026 | 11:45 PM