Over 100 a Day! రోజుకు వందపైనే!
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:15 AM
Over 100 a Day! ఇసుకాసురులు పెట్రేగిపోతున్నారు. ఎటువంటి అను మతుల్లేకుండా జిల్లా నుంచి ఒడిశాకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రధానంగా కొమరాడ మండలం చోళ్లపదం రీచ్ నుంచి రోజూ అనధికారికంగా వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
చోళ్లపదం రీచ్ నుంచి ఒడిశాకు అక్రమ రవాణా
రాత్రి వేళల్లో లారీల ద్వారా తరలింపు
పెట్రేగిపోతున్న ఇసుకాసురులు
పట్టించుకోని అధికారులు
అబ్బే అంతలా విక్రయాలు జరగడం లేదంటూ వివరణ
పార్వతీపురం, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): ఇసుకాసురులు పెట్రేగిపోతున్నారు. ఎటువంటి అను మతుల్లేకుండా జిల్లా నుంచి ఒడిశాకు యథేచ్ఛగా ఇసుకను తరలిస్తున్నారు. ప్రధానంగా కొమరాడ మండలం చోళ్లపదం రీచ్ నుంచి రోజూ అనధికారికంగా వందలాది ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. దీనిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే మొక్కుబడిగా అధికారులు దాడులు చేసి చేతుల దులుపుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో ఈ ఇసుక రీచ్ నుంచి అక్రమ దందా కొనసాగించిన వారే కూటమి హయంలోనూ హవా కొనసాగిస్తున్నారు. మొత్తంగా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపం ఇసుకాసురులకు కాసులు కురిపిస్తోంది. చోళ్లపదం రీచ్ నుంచి రోజుకు వందకు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నా.. అబ్బే.. అదేమిలేదంటూ సంబంధిత అధికారులు చెబుతుండడం గమనార్హం.
ఇదీ పరిస్థితి..
- జిల్లాలో ఆరు ఇసుక రీచ్‌లతో పాటు రెండు స్టాక్ పాయింట్లు ఉన్నాయి. ఆరింటిలో ప్రస్తుతం రెండు రీచ్‌లు పనిచేయడం లేదు. భామినిలో మూడు, పాలకొండ మండలం గోపాల పురంలో ఒకటి ఉండగా... ప్రస్తుతం ఈ నాలుగు రీచ్‌ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొమరాడ మండలం చోళ్లపదం, పాలకొండ మండలంలో జి.మంగళాపురంలో రెండు స్టాక్ పాయింట్లు ఉన్నాయి. కాగా కొమరాడ మండలం నుంచే సరిహద్దు ప్రాంతం ఒడిశాలోని నారాయణపట్నం వరకు భారీస్థాయిలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. అక్కడి డిమాండ్‌ను బట్టి ట్రాక్టర్ ఇసుకను రూ.10 వేలకు విక్రయిస్తున్నారు. అదే లారీ ఇసుక అయితే రూ.30 వేల నుంచి 40 వేల వరకు వసూలు చేస్తున్నారు.
- కొమరాడ మండలం చోళ్లపదం రీచ్ నుంచి రోజుకు వందకు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిపోతుంది. ఇందులో కొన్ని ట్రాక్టర్లనే అధికారికంగా చూపించి.. అనధికారికంగా భారీ స్థాయిలో అమ్మకాలు చేపడుతున్నారు. ఇసుక ట్రాక్టర్లతో పాటు రాత్రి సమయాల్లో లారీల్లో ఇసుకను లోడ్ చేసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
- చోళ్లపదం రీచ్‌లో 18,900 టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతులు మంజూరు చేశారు. అయితే ఇప్పటికే ఆరు వేల టన్నులను స్టాక్ పాయింట్‌కు చేర్చారు. ఇవి కాకుండా రోజుకు కనీసం వందకు పైగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. మొత్తంగా రోజుకు సుమారు 400 టన్నుల ఇసుక ఈ రీచ్‌నుంచి తరలిపోతోంది. మరోవైపు లారీల ద్వారా రవాణా చేస్తున్నా.. లెక్కా, డొక్కా ఏమీ ఉండడం లేదు. కాగా రీచ్‌కు అనుమతులు ఇచ్చిన నాటి నుంచి మూడు నెలల్లో 400 ట్రాక్టర్లు ఇసుక మాత్రమే విక్రయించినట్లు అధికారులు చెప్పుకొస్తుండడం విశేషం. దీనిపై జిల్లా గనులశాఖాధికారి రామును వివరణ కోరగా.. ‘కొమరాడ మండలం చోళ్లపదం రీచ్ నుంచి సుమారు రెండు వేల టన్నులు అంటే సుమారు 400 ట్రాక్టర్ల ఇసుక విక్రయాలే జరిగాయి. ఆరు వేల టన్నుల ఇసుక స్టాక్ పాయింట్‌లో ఉంది. ఒడిశాకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు కొంతమంది చెబుతున్నారు. మా శాఖ ద్వారా ఆయా వాహనాలను పట్టుకుంటే గానీ వాస్తవాలు తెలియవు.’ అని తెలిపారు.