Share News

Out of Control అదుపు తప్పి.. రక్షణ గోడను ఢీకొట్టి

ABN , Publish Date - Jan 19 , 2026 | 12:23 AM

Out of Control, Crashes into the Safety Wall సీతంపేట ఏజెన్సీలో పర్యాటకంగా అభివృద్థి చెందు తున్న ఆడలి వ్యూపాయింట్‌ రెండో మలుపు వద్ద ఓ ఆటో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతిచెందాడు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

Out of Control అదుపు తప్పి.. రక్షణ గోడను ఢీకొట్టి
ఆటో ప్రమాదాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ అమ్మనరావు

  • డ్రైవర్‌ మృతి.. ఆరుగురికి తీవ్రగాయాలు

సీతంపేట రూరల్‌, జనవరి18(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో పర్యాటకంగా అభివృద్థి చెందు తున్న ఆడలి వ్యూపాయింట్‌ రెండో మలుపు వద్ద ఓ ఆటో అదుపుతప్పి రక్షణగోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతిచెందాడు. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సీతంపేట ఎస్‌ఐ అమ్మనరావు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం వసుందర గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు బోయిన సురేష్‌కుమార్‌, బి.శ్రీజ, లాస్య, మౌనిక, రాజేష్‌, సందీప్‌లు ఆదివారం కొసమాలకి చెందిన ముళ్లి చందర్రావు ఆటోను బుక్‌ చేసుకొని ఆడలి వ్యూపాయింట్‌కు వచ్చారు. అక్కడి ప్రకృతి అందాలను తిలకించి కాసేపు సరదాగా గడిపారు. సాయంత్రం వ్యూపాయింట్‌ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఘాట్‌రోడ్డు దిగుతుండగా బిడిందిగూడ మలుపు వద్ద ఆటో అదుపుతప్పి రక్షణగోడను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన క్షతగాత్రులను స్థానికుల సహాయంతో 108 వాహనంలో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వారిని పరిశీలించగా అప్పటికే ఆటోడ్రైవర్‌ చందర్రావు(39) మృతి చెందినట్లు నిర్ధారించారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం సురేష్‌కుమార్‌, శ్రీజ, లాస్య, మౌనిక, సందీప్‌లను శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు రాజేష్‌ పరిస్థితి నిలకడగా ఉండడంతో సీతంపేట ఏరియా ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తమ సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఆడలి వ్యూపాయింట్‌ను ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు ఆ మార్గంలో ప్రయాణించిన వారిలో నలుగురు మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో పర్యాటకులు తీవ్రగాయాల పాలయ్యారు. ఈ మార్గంలో అత్యధికంగా మలుపుల వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించిన ఐటీడీఏ అధికారులు ఐదు చోట్ల సుమారు రూ.1.20కోట్లతో రక్షణ గోడలు నిర్మించారు.

Updated Date - Jan 19 , 2026 | 12:23 AM