Share News

Our college, our choice. మా కాలేజీ మా ఇష్టం

ABN , Publish Date - Oct 05 , 2026 | 11:44 PM

Our college, our choice. నాలుగేళ్ల క్రితం వైసీపీ హయాంలో అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో నలుగురు వ్యక్తులు కలిసి జిల్లా కేంద్రంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీని ఓ అద్దెభవనంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ భవనానికి అన్ని అనుమతులూ తీసుకున్నారు.

Our college, our choice. మా కాలేజీ మా ఇష్టం

మా కాలేజీ మా ఇష్టం

అనుమతి లేకుండా కొత్త భవనాల్లోకి మార్పు

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు జూనియర్‌ కాలేజీల షిఫ్టింగ్‌

ఇంటర్‌ విద్యా అధికారి నోటీసులు ఇచ్చినా పట్టించుకోని వైనం

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి):

- నాలుగేళ్ల క్రితం వైసీపీ హయాంలో అప్పటి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సహకారంతో నలుగురు వ్యక్తులు కలిసి జిల్లా కేంద్రంలో ప్రైవేటు జూనియర్‌ కాలేజీని ఓ అద్దెభవనంలో ఏర్పాటు చేశారు. అప్పట్లో ఆ భవనానికి అన్ని అనుమతులూ తీసుకున్నారు. ఇటీవల వరకూ అందులోనే తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. గత నెల ఆ భవనం నుంచి వేరే భవనంలోకి అనధికారికంగా కాలేజీని మార్పు చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి కొత్త భవనంలోకి కాలేజీని షిఫ్టింగ్‌ చేయాలంటే ఆ భవనానికి అగ్నిమాపక శాఖ నుంచి (ఫైర్‌ సర్టిఫికెట్‌), పోలీసు శాఖ నుంచి ఎన్‌వోసి, శానిటేషన్‌, సౌండ్‌నెస్‌ వంటి ధ్రువపత్రాలు తీసుకోవాలి. భవనం యజమాని నుంచి లీజ్‌ తీసుకున్నట్లు రిజిస్ట్రర్డ్‌ డాక్యుమెంట్‌ ఉండాలి. రెండు ఎకరాల్లో ఆట స్థలం కూడా ఉండాలి. ఈ నిబంధనలు పాటించకుండా కాలేజీ నిర్వాహకులు కొత్త భవనంలో తరగతులు నిర్వహిస్తున్నారు.

- జామి మండల కేంద్రంలో ఉన్న ఓ ప్రైవేటు కాలేజీని ఆ మధ్య జిల్లా కేంద్రానికి మార్పు చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. ఆ కాలేజీకి బోర్డు ఆప్‌ ఇంటర్మీడియట్‌ నుంచి అనుమతి ఇంకా రాకపోయినా జిల్లా కేంద్రంలో తరగతులు నిర్వహిస్తున్నారు. దీనిపై కొన్ని నెలలు క్రితం కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు కూడా అందింది.

- బొబ్బిలి పురపాలక కేంద్రంలో రెండు ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు, కొత్తవలస మండల కేంద్రంలో ఓ జూనియర్‌ కాలేజీని నిబంధనలకు విరుద్ధంగా ఉన్నత అధికారుల అనుమతి లేకుండా ఒక చోటు నుంచి వేరే చోటుకు మార్పు చేసుకుని తరగతులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి షిఫ్టింగ్‌ చేసుకున్న భవనంలో నిబంధనల మేరకు అన్ని రకాల ధ్రువ పత్రాలు పొందాల్సిన అవసరం కూడా ఉంది. కాని ఏమీ లేకుండానే కాలేజీని మార్పు చేశారు.

ఇవే కాకుకుండా జిల్లాలో ఇటువంటి అనధికారికంగా మార్పులు చేసుకున్న కాలేజీలు చాలా ఉన్నాయి. ఆ యాజమాన్యాలకు జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి నోటీసులు కూడా జారీ చేశారు. అయినా సంబంధిత యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు.

జిల్లాలో 18 ప్రభుత్వ, 117 ప్రైవేటు జూనియర్‌ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 40 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. సాధారణంగా ఎవరైనా కొత్త కాలేజీ ఏర్పాటు చేసుకోవాలంటే ముందుగా ఇంటర్‌ బోర్డు ఇచ్చిన నోటిఫికేషన్‌ ప్రకారం ఆయా ప్రాంతంలో ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. ఏర్పాటు చేసుకునే భవనం 8 వేల అడుగులు విస్తీర్ణంలో ఉండాలి. ఒక వేళ అద్దె భవనం తీసుకుంటే సంబంధిత యజమాని నుంచి రిజిస్టర్డ్‌ లీజ్‌ డీడ్‌ తప్పనిసరిగా తీసుకోవాలి. అదే కాకుండా జిల్లా ఆగ్నిమాపక శాఖ అధికారి నుంచి ఫైర్‌ స్టేపీ ధ్రువ పత్రం పొందాలి. పోలీసు శాఖ నుంచి ఎన్‌వోసి, సౌండ్‌నెస్‌, శానిటేషన్‌ సర్టిఫికెట్‌ కూడా సంబంధించిన అధికారుల నుంచి తీసుకోవాల్సి ఉంది. ఇవి ఉన్న తరువాతే జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారికి దరఖాస్తు చేసుకుంటే ఆయన బోర్డుకు పంపిస్తారు. అనంతరం త్రీమెన్‌ కమిటీ వచ్చి కాలేజీ ఏర్పాటు చేయనున్న భవనాన్ని క్షుణంగా పరిశీలించి నిబంధనల మేరకు అన్ని దృవపత్రాలు ఉన్నాయా? లేవా అనేది చూస్తారు. అంతా పక్కాగా ఉంటే బోర్డుకు సిఫార్సు చేస్తారు. నిబంధనల మేరకు కాలేజీ ఏర్పాటుకు అనుమతులను మంజూరు చేస్తారు. అలాగే వేరే భవనంలోకి మార్పు చేయాలన్నా? ఈ ధ్రువపత్రాలన్నీ పొందాక అధికారులకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ప్రక్రియ లేకుండా జిల్లాలో నాలుగు జూనియర్‌ కాలేజీలు భవనాలను అనధికారికంగా వేరే చోటుకు మార్పు చేయడంతో జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి నోటీసులు జారీ చేశారు. అయినా సంబంధిత యాజమాన్యాలు ఇప్పటికీ స్పందించలేదు.

నోటీసులు ఇచ్చాం

అనుమతి లేకుండా జిల్లాలోని నాలుగు కాలేజీలు అనధికారికంగా భవనాలు మార్పు చేసుకున్నాయి. ఆ యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చాం. ఒకరు మాత్రమే వివరణ ఇచ్చారు. ఈ విషయాన్ని బోర్డు ఆఫ్‌ ఇంటర్‌ అధికారులకు తెలియజేశాం. కళాశాలను మరొక చోటుకు మార్పు చేయాలంటే నిబంధనల ప్రకారం మాత్రమే చేయాలి.

- ఎస్‌.తవిటినాయుడు, జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి

-----------------

Updated Date - Oct 05 , 2026 | 11:44 PM