Share News

our children study at our village school.పిల్లల్ని.. మా ఊరి బడిలోనే చదివిస్తాం

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:04 AM

our children study at our village school. మా పిల్లల్ని మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని నిర్ణయం తీసుకున్నారా గ్రామస్థులు.. వారికి గ్రామ తాజా, మాజీ సర్పంచి అండగా నిలిచారు. రాజాంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరి పిల్లల్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు.

 our children study at our village school.పిల్లల్ని.. మా ఊరి బడిలోనే చదివిస్తాం
సర్కారుబడిలో చేరిన విద్యార్థులు

పిల్లల్ని.. మా ఊరి బడిలోనే చదివిస్తాం

గార్రాజు చీపురుపల్లి గ్రామస్థుల నిర్ణయం

ఉపాధ్యాయుల కృషి

అండగా నిలిచిన గ్రామ తాజా మాజీ సర్పంచి

40 మంది విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు

రాజాంరూరల్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): మా పిల్లల్ని మా ఊరి ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని నిర్ణయం తీసుకున్నారా గ్రామస్థులు.. వారికి గ్రామ తాజా, మాజీ సర్పంచి అండగా నిలిచారు. రాజాంలోని ఓ కార్పొరేట్‌ పాఠశాలలో చదువుతున్న తన ఇద్దరి పిల్లల్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి స్ఫూర్తిగా నిలిచారు. దీంతో తల్లిదండ్రుల్లో ఆలోచన రేకెత్తింది. తమ పిల్లల్ని కూడా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని నిర్ణయించుకున్నారు. ఒక్కొక్కరుగా ఆయా ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలకు విషయాన్ని చేరవేశారు. పాఠశాలల ప్రతినిధులు ఒత్తిడి చేసినా తల్లిదండ్రులు వెనక్కి తగ్గలేదు. ట్రాన్ష్‌ఫర్‌ సర్టిఫికెట్లు (టీసీ) ఇచ్చేయాలని డిమాండ్‌ చేయడంతో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు తల్లిదండ్రుల నిర్ణయాన్ని గౌరవించక తప్పలేదు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరంలో కార్పొరేట్‌, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న 40 మంది విద్యారుఽ్ధలు గ్రామంలోని ప్రభుత్వ బడిలో చేరారు. వారి చేరికతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 110కి చేరింది. వారంతా గురువారం నుంచి పాఠశాలకు రావడం ప్రారంభించారు. గ్రామంలోని తల్లిదండ్రుల నిర్ణయం వెనుక పాఠశాల సిబ్బంది కృషి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన రాజాం మండలం గార్రాజు చీపురుపల్లిలో చోటుచేసుకుంది.

వేసవి సెలవుల్లోనే ప్రణాళిక

గ్రామానికి చెందిన విద్యార్థులు వివిధ వాహనాల్లో ప్రయివేటు పాఠశాలలకు వెళ్తుండడాన్ని రోజూ గమనిస్తున్న హెచ్‌ఎం గురుమూర్తి, ఉపాధ్యాయులు రామారావు, సరోజిని, రాధ, అప్పలరాజు, అప్పలసూరి జీర్ణించుకోలేకపోయారు. వారిని ఎలాగైనా తమ పాఠశాలకు వచ్చేలా చేయాలని నిర్ణయించుకున్నారు. వేసవిసెలవుల్లో గ్రామ తాజా, మాజీ సర్పంచి పొన్నాడ భీమేశ్వర్రావుతో ఈ విషయంపై చర్చించారు. గ్రామ ప్రథమ పౌరుడిగా ‘మీ ఇద్దరి పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పించాలని’ కోరారు. స్పందించిన ఆయన రాజాంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న తన కుమారులు సూర్యమనోహర్‌ నాయుడు, జ్ఞానేంద్రనాయుడిని సర్కారుబడిలో చేర్పించారు. సర్పంచి తమ పిల్లల్ని గ్రామంలోని పాఠశాలలో చేర్పించిన విషయాన్ని ప్రచారం చేస్తూ మరో 38 మంది విద్యార్థులు సర్కార్‌ బడికి వచ్చేలా ఉపాధ్యాయులు కృషి చేశారు. గ్రామానికి చెందిన కొయ్యాన ప్రమీల, పొన్నాడ లక్ష్మునాయుడు రాజాంలోని ఓ కార్పోరేట్‌ పాఠశాలలో చదువుతున్న ఇద్దరేసి పిల్లల్ని పల్లె పాఠశాలలో చేర్పించారు.

ఆ 40 మంది వీరే..

ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలో చేరిన వారిలో ఒకటో తరగతిలో తొమ్మిది మంది, రెండులో నలుగురు, మూడులో ఐదుగురు, నాలుగులో ఐదుగురు, ఐదులో ముగ్గురు, ఏడులో ఐదుగురు, ఎనిమిదిలో ఒక్కరు ఉన్నారు. వీరంతా గడచిన విద్యాసంవత్సరంలో రాజాంలోని ప్రయివేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదివారు.

సర్పంచికి సత్కారం

గ్రామంలోని ప్రభుత్వ బడిని బలోపేతం చేసేందుకు అండగా నిలిచిన గ్రామ తాజా, మాజీ సర్పంచిని మండల విద్యాశాఖాధికారి ప్రవీణ్‌కుమార్‌, ఉపాధ్యాయ సిబ్బంది గురువారం సత్కరించారు. భవిష్యత్తులోనూ అండగా ఉండాలని కోరారు. ఉపాధ్యాయ బృందాన్ని ఎంఈవో అభినందించారు.

Updated Date - Jun 19 , 2026 | 12:04 AM