Share News

Orders are fine... but what about implementation?ఆదేశాలు సరే.. ఆచరణో!

ABN , Publish Date - Aug 31 , 2026 | 12:14 AM

Orders are fine... but what about implementation? పీజీ వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని డైరెక్టరు ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) తాజాగా కొన్ని మార్గనిర్దేశాలు ఇచ్చారు. వారికి వారంలో 74 గంటలకు మించి విధులు కేటాయించవద్దని, వరుసుగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని, వారికి మౌలిక వసతులు కల్పించాలని పేర్కొంటూ వైద్య కళాశాల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు ఇచ్చారు.

Orders are fine... but what about implementation?ఆదేశాలు సరే.. ఆచరణో!
మహారాజా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి

ఆదేశాలు సరే.. ఆచరణో!

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పీజీల కష్టాలు తీరేనా?

74 గంటలు దాటి విఽధులు

ఆసుపత్రుల్లో మౌలిక వసతుల లేమి

డీఎంఈ ఆదేశాలు అమలు జరిగేనా!

పీజీ వైద్య విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని డైరెక్టరు ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) తాజాగా కొన్ని మార్గనిర్దేశాలు ఇచ్చారు. వారికి వారంలో 74 గంటలకు మించి విధులు కేటాయించవద్దని, వరుసుగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని, వారికి మౌలిక వసతులు కల్పించాలని పేర్కొంటూ వైద్య కళాశాల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌లకు ఆదేశాలు ఇచ్చారు. కానీ ఆచరణ సాధ్యమేనా అన్న అనుమానం అందరిలో నెలకొంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సెలవు లేదు.. విశ్రాంతి ఉండడం లేదంటున్నారు. బోధనాస్పత్రుల్లో సీనియర్‌ రెసిడెంట్లు, ఫ్యాకల్టీ కొరత కారణంగా పీజీ విద్యార్థులపైనే భారం పడుతోంది. అత్యవసర విభాగాలు, ఐసీయూ విభాగాల్లో పనిభారం రెట్టింపు ఉంటోందని.. నిద్ర లేక వేళకు ఆహారం లేక అనారోగ్యం పాలవుతున్నామని పేరు చెప్పడానికి ఇష్టపడని కొందరు పీజీ విద్యార్థులు వాపోయారు.

విజయనగరం రింగురోడ్డు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి):

పీజీ వైద్య విద్యార్థులతో వరుసుగా 24 గంటలకు మించి డ్యూటీ చేయించవద్దని డైరెక్టరు ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) డాక్టరు విష్ణువర్థన్‌ తాజాగా ఆదేశించారు. ఈ మేరకు వైద్య కళాశాల ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రి సూపరింటెండెంట్‌లకు మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ విద్యార్థులకు విధులు, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో ఇప్పటికే అమల్లో వున్న ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. పీజీ విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించవద్దని తెలిపారు. ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక రోజు పూర్తిస్థాయి సెలవు ఇవ్వాలన్నారు. జూనియర్‌ వైద్యులకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని సూచించారు. ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని...నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్‌లు, హెచ్‌ఓడీలపై చర్యలు తీసుకుంటామని డీఎంఈ హెచ్చరించారు. అయితే ఈ ఆదేశాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతవరకు అమలవుతాయో చూడాలి.

జిల్లాలో ఇలా..

జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న పీజీ వైద్యుల పరిస్థితి నిరాశాజనకంగా ఉంది. నిరంతరం రోగుల సేవల్లో గడుపుతున్న ఈ జూనియర్‌ వైద్యులు, ప్రాథమిక వసతులు లేక పరిమితికి మించిన డ్యూటీ గంటలతో తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. వీరి పనివేళలు, సౌకర్యాలపై డీఎంఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ విజయనగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్‌), ఘోషాసుపత్రిలో ఏ మేరకు అమలవుతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రిలో మొత్తంగా 20 మంది పీజీ విద్యార్థులు సేవలు అందిస్తున్నారు. పీడీయాట్రిక్‌, ఆనస్థీషియా, జనరల్‌ మెడిసిన్‌, గైనిక్‌, జనరల్‌ సర్జరీ తదితర విభాగాల్లో వీరు సేవలు అందిస్తున్నారు. అయితే, ఆసుపత్రిలో విధులు నిర్వహించే వీరికి కనీస సౌకర్యాలు కరువయ్యాయి. సుదీర్ఘ సమయం డ్యూటీ చేశాక విశ్రాంతి తీసుకునేందుకు సరైన రూంలు లేవు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా లేక మహిళా పీజీ వైద్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర విభాగాలు, వార్డుల్లో విధులు నిర్వహించే చోట కనీసం తాగేందుకు సురక్షితమైన నీరు కూడా అందుబాటులో ఉండడం లేదు.

సెలవు లేదు.. విశ్రాంతి లేదు.

వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించకూడదని, 24 గంటలు దాటి డ్యూటీలు వేయొద్దని నిబంధనలు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సీనియర్‌ రెసిడెంట్లు, ఫ్యాకల్టీ కొరత కారణంగా పీజీలపైనే భారం పడుతోంది. రోజుకు 24 గంటలు కంటే ఎక్కువ సమయం నిరంతరాయంగా రోగులను పర్యవేక్షించాల్సి వస్తోంది. అత్యవసర విభాగాలు, ఐసీయూ విభాగాల్లో పనిభారం రెట్టింపు కావడంతో నిద్ర లేక సరైన వేళకు ఆహారం లేక అనారోగ్యం పాలవుతున్నామని పీజీల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. వారానికి ఒక రోజు పూర్తిస్థాయి సెలవు ఇవ్వాలన్న ఆదేశాలు కాగితాలకే పరిమితమౌతున్నాయని చెబుతున్నారు.

అమలుకు నోచుకోని డ్యూటీ రోస్టర్లు

డీఎంఈ ఆదేశాల ప్రకారం హెచ్‌ఓడీ, పీజీ రిజిస్టార్‌, ఫ్యాకల్టీ సమన్వయంతో పారదర్శకంగా డ్యూటీ రోస్టర్లు తయారు చేయాల్సి వుంటుంది. కాని సమన్వయం లోపంతో, నోడల్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పీజీ విద్యార్థుల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడం లేదు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు రాత్రింబవళ్లూ శ్రమిస్తున్నా రెస్ట్‌రూంలు, తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు, వసతి కల్పించడం లేదంటున్నారు.

పనిభారం తగ్గిస్తాం.. సౌకర్యాలు కల్పిస్తాం

డాక్టరు దేవి మాధవి, ప్రిన్సిపాల్‌, ప్రభుత్వ వైద్య కళాశాల

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, ఘోషాసుపత్రిలో సేవలు అందిస్తున్న పీజీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తాం. వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించకుండా, వరుసుగా 24 గంటలు దాటి డ్యూటీ లేకుండా చూస్తాం. వారానికి ఒక రోజు తప్పనిసరిగా సెలవు ఇచ్చేలా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. పీజీ వైద్యులకు మెరుగైన రెస్ట్‌రూంలు, శుభ్రమైన మరుగుదొడ్ల నిర్వహణతో పాటు వార్డులు, అత్యవసర విభాగాల్లో సురక్షితమైన తాగునీటిని అందిస్తాం. డీఎంఈ ఆదేశాల ప్రకారం పీజీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం.

Updated Date - Aug 31 , 2026 | 12:14 AM