Share News

Ordeal at the Hospital ఆసుపత్రిలో అవస్థలు

ABN , Publish Date - May 17 , 2026 | 11:49 PM

Ordeal at the Hospital పేరుకే పెద్దాసుపత్రి.. కానీ ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. సౌకర్యాలు అంతంతమాత్రమే. వసతి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నాళ్లుగా పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.

Ordeal at the Hospital ఆసుపత్రిలో అవస్థలు
పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రి

  • పూర్తికాని అదనపు భవన నిర్మాణాలు

  • ఇరుకు గదుల్లో ఇన్‌పేషెంట్లకు వైద్యసేవలు

  • ఐసీయూ ఉన్నా లేనట్టే..

  • స్కానింగ్‌లకు తప్పని ఇక్కట్లు

  • రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య

  • ఆ స్థాయిలో భర్తీకాని వైద్య సిబ్బంది పోస్టులు

  • కూటమి ప్రభుత్వంపైనే ఆశలు

పార్వతీపురం, మే17(ఆంధ్రజ్యోతి): పేరుకే పెద్దాసుపత్రి.. కానీ ఆ స్థాయిలో వైద్య సిబ్బంది లేరు. సౌకర్యాలు అంతంతమాత్రమే. వసతి సమస్య కూడా తీవ్రంగా వేధిస్తోంది. దీంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. కొన్నాళ్లుగా పార్వతీపురం జిల్లాకేంద్రాసుపత్రిలో ఈ పరిస్థితి నెలకొన్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. వాస్తవంగా జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున రోగులకు ఇక్కడకి వస్తుంటారు. ముఖ్యంగా గిరిజనులు వైద్య చిక్సితలకు తరలివస్తుంటారు. మరోవైపు సరిహద్దు ఒడిశా వాసులు కూడా జిల్లా కేంద్రాసుపత్రినే ఆశ్రయిస్తారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే ఆసుపత్రిలో రోగుల సంఖ్యకు తగ్గట్టుగా వైద్య సిబ్బందిని పెంచడం లేదు. మరోవైపు అదనపు గదులు లేక ఇన్‌పేషెంట్లకు ఇక్కట్లు తప్పడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ కాలంలో వంద పడకలతో ఉన్న పార్వతీపురం ఆసుపత్రిని వైసీపీ సర్కారు 150 పడకలతో అప్‌గ్రేడ్‌ చేసింది. అయితే ఆ స్థాయిలో భవన నిర్మాణాలు చేపట్టలేదు. వైద్య సిబ్బందిని కూడా నియమించలేదు. ప్రధానంగా స్టాఫ్‌ నర్సులతో పాటు రేడియాలజిస్ట్‌ తదితర పోస్టులను భర్తీ చేయలేదు.

ఇదీ పరిస్థితి...

- జిల్లా కేంద్రాసుపత్రిలో అదనపు భవనాల నిర్మాణం కొలిక్కి రావడం లేదు. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఆసుపత్రిలో సుమారు 250 మందికి మించి ఇన్‌పేషెంట్లు చికిత్స పొందుతున్నారు. అయితే ఇరుకైన గదుల్లోనే బెడ్లు ఏర్పాటు చేస్తుండడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇన్‌పేషెంట్ల సంఖ్య మరింత పెరిగితే రోగుల సహాయకులు ఆసుపత్రి ప్రాంగణం బయటే ఉండాల్సి వస్తోంది. సీజనల్‌ వ్యాధులు విజృంభించే సమయంలో అటు రోగులు, ఇటు వైద్య సిబ్బందికి ఇక్కట్లు తప్పడం లేదు.

- 150 పడకల ఆసుపత్రికి 35 మంది స్టాఫ్‌ నర్సులు ఉండాలి. కానీ 32 మంది మాత్రమే ఉన్నారు. మరో 20 మంది స్టాఫ్‌నర్సులను ఇక్కడ నియమించాల్సి ఉంది. అయితే పూర్తిస్థాయి సిబ్బంది లేక ఉన్న వారిపై పనిభారం పెరుగుతోంది. పెద్దాసుపత్రిలో రేడియాలజిస్ట్‌ పోస్టు కూడా కొన్నాళ్లుగా ఖాళీగానే ఉంది. గర్భిణులకు ఇబ్బంది లేకుండా ఒక్కోసారి మహిళా వైద్య నిపుణులే ఆ బాధ్యతలు చేపట్టాల్సి వస్తోంది. మూడేళ్లుగా రోగులకు వైద్య పరీక్షలతో పాటు స్కానింగ్‌ పనులను కూడా మహిళా వైద్యులే చూసుకోవాల్సి వస్తోంది.

- జిల్లా కేంద్రాసుపత్రిలో ఐసీయూ ఉన్నా.. ఏ లాభం లేదు. ఆ విభాగంలో పనిచేసేందుకు ప్రత్యేకంగా వైద్యులు , వైద్య సిబ్బంది, స్టాఫ్‌ నర్సులను నియమించలేదు. దీంతో అత్యవసర వేళల్లో రోగులకు ఐసీయూ సేవలు అందడం లేదు. ఉరుకుల పరుగులతో పొరుగు జిల్లాకు చేరుకోవాల్సి వస్తోంది.

- డయాలసిస్‌ కేంద్రంతో పాటు పసిపిల్లలకు అవసరమైన నియోనేటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ వంటివి జిల్లా కేంద్రాసుపత్రిలో ఉన్నాయి. అయితే పూర్తిస్థాయిలో మౌలిక వసతులతో పాటు వైద్యులు, వైద్య సిబ్బంది, స్టాఫ్‌నర్సులను నియమించాలని జిల్లావాసులు కోరుతున్నారు.

భవన నిర్మాణాలు పూర్తయితే..

అదనపు భవన నిర్మాణాలు పూర్తయితే అక్కడ మరో 50 పడకలు ఏర్పాటు చేస్తాం. ప్రస్తుతం 150 పడకల ఆసుపత్రి సామర్థ్యానికి సంబంధించి స్టాఫ్‌నర్సు ఉన్నారు. రేడియాలజిస్ట్‌ పోస్టు ఖాళీగా ఉంది. ఇన్‌పేషెంట్ల రద్దీ ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. వాళ్లకు ఇబ్బంది లేకుండా బెడ్లు ఏర్పాటు చేస్తున్నాం.

- నాగభూషణరావు, డీసీహెచ్‌ఎస్‌, పార్వతీపురం మన్యం

Updated Date - May 17 , 2026 | 11:49 PM