OPS 246 మందికి ఓపీ‘ఎస్’
ABN , Publish Date - Jun 25 , 2026 | 12:29 AM
OPS Provided to 246 Employees జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2003లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై (కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం) సీపీఎ్‌సలోకి వచ్చిన వారికి ఓపీఎస్ విధానం అమలుచేయనుంది.
నాటి సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్
రెండు దశాబ్దాల నిరీక్షణకు తెర
ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల హర్షం
పార్వతీపురం, జూన్24(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూటమి సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. 2003లో పలు నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై (కంట్రీబ్యూటరీ పెన్షన్ స్కీం) సీపీఎ్‌సలోకి వచ్చిన వారికి ఓపీఎస్ విధానం అమలుచేయనుంది. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరించి, అర్హులైన వారికి సీపీఎస్ నుంచి పాత పెన్షన్ విధానం(ఓపీఎ్‌స)లోకి మారేందుకు వన్-టైమ్-ఆప్షన్ కల్పించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో జిల్లాలో 246 మంది లబ్ధి పొందగా.. సర్కారు నిర్ణయంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవంగా వైఎస్ సర్కారు 2004 సెప్టెంబరులో సీపీఎ్‌సను అమలులోకి తీసుకొచ్చింది. అయితే, సీపీఎస్ అమలులోకి రాకముందే, 2003లో అప్పటి చంద్రబాబు సర్కారు హయాంలో డీఎస్సీ సహా పలు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఉద్యోగార్థులు పరీక్షలూ రాశారు. కానీ... నియామకాలు జరిగేసరికి సీపీఎస్ అమలులోకి వచ్చింది. పలు కారణాలతో వీరు విధుల్లో చేర్చుకొనేసరికి 2004 సెప్టెంబరు దాటిపోయింది. ఆయా నోటిఫికేషన్ల ప్రకారం చూస్తే వారందరికీ ఓపీఎస్ వర్తింపజేయాలి. కానీ, సీపీఎ్‌సకే పరిమితమయ్యారు. మొత్తంగా వీరికి ఓపీఎస్ విధానం వర్తించాల్సి ఉన్నప్పటికీ గత కాంగ్రెస్ సర్కారు, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. అయితే గతకొంతకాలంగా సీపీఎస్ రద్దుపై పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉద్యమిస్తున్నారు. అయితే 2004 సెప్టెంబరు ముందు నోటిఫికేషన్లు వచ్చి నియామక పరీక్షలు, ఫలితాలు వస్తే.. అటువంటి వారికి పాత పెన్షన్ విధానాన్నే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం 2020లోనే స్పష్టం చేసింది. కానీ జగన్ సర్కారు పెడచెవిన పెట్టింది. ఆర్థికభారం అని చెప్పి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,700 మంది విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న కూటమి ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది. వారికి ఓపీఎస్ వర్తింపజేస్తున్నట్లు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంతో జిల్లాలోని ఒక్క విద్యా శాఖలోనే 159మంది ఉపాధ్యాయులతో పాటు వివిధ శాఖల్లో 87 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. దీంతో ఆ ఉద్యోగుల హర్షాతి రేకాలు వ్యక్తం చేస్తుండగా.. వారి రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. మరోవైపు ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62కు పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో వేలాది మందికి ప్రయోజనం చేకూరనుంది.
సీఎం చంద్రబాబు రుణం తీర్చుకోలేం
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రుణం తీర్చుకోలేం. ఓపీఎస్ వర్తింపజేస్తున్నట్లు ప్రకటిం చడం ఆనందంగా ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో జిల్లాలో సుమారు 159 మంది ఉపాధ్యాయులకు న్యాయం జరుగుతుంది.
- బి.నిరంజన్, ఉపాధ్యాయుడు, పార్వతీపురం
==============================
శుభపరిణామం..
ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంది. 2003లో నోటిఫికేషన్ల ద్వారా ఎంపికై సీపీఎ్‌సలోకి వచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఓపీఎస్ విధానం అమలుచేసేందుకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం శుభ పరిణామం. ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్, భద్రత, న్యాయమైన డిమాండ్ల పరిష్కారం దిశగా క్యాబినెట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.
- జీవీఆర్ కిషోర్, జిల్లా ఎన్‌జీవో సంఘం అధ్యక్షుడు, పార్వతీపురం