తెరుచుకో.. తరలించుకో!
ABN , Publish Date - Jul 26 , 2026 | 12:51 AM
పెదమానాపురం సంతలో పశువుల అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్‌కు గోసంరక్షణ సంఘాలు ఇటీవల ఫిర్యాదు చేశాయి.
రెండు రోజులకే రీ ఓపెన్
గో సంరక్షణ సంఘాల ఫిర్యాదుతో జిల్లా పంచాయతీ అధికారి సంతను తాత్కాలింగా నిలిపివేశారు. ఈ అనుమతులు ఇచ్చిన 48 గంటల్లోనే మళ్లీ తెరుచుకోవచ్చంటూ ఆదేశాలు ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది.
జాతీయ రహదారిని వదిలి..
జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు ఉండడంతో ఆక్రమణదారులు ఇంగిలాపల్లి, కొంపల్లి, బొండపల్లి రహదారుల మీదుగా అర్ధరాత్రి వేళ పశువులను వాహనాల్లో విశాఖపట్నం వైపు తరలిస్తున్నారు.
పైలెట్ వాహనం కాపలా
రూట్ క్లియర్ చేయడానికి ముందే ఒక వ్యక్తిని పంపి పోలీసుల కదలికలను పర్యవేక్షిస్తున్నారు. ఇందుకోసం ఆక్రమణ రవాణాదారులు ఆ వ్యక్తికి ఒక్కో వాహనానికి రూ.1000 ఇస్తున్నారు.
వాహనాల్లో కుక్కి తరలింపు
సంత నుంచి పశువుల తరలింపులో ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. వాహనాల్లో పరిమితికి మించి కుక్కి ఊపిరాడకుండా చేస్తున్నారు. పట్టుబడినప్పుడు మాత్రమే ఇవి వెలుగు చూస్తున్నాయి.
పెదమానాపురం సంత విషయంలో ఎన్నో అనుమానాలు
తొలుత తాత్కాలింగా మూసివేయాలని డీపీవో ఆదేశాలు
ఆతర్వాత 48 గంటలకే తెరుచుకోవచ్చంటూ ఆదేశాలు
కొందరు నాయకుల ఒత్తిళ్లే కారణమని ఆరోపణలు
మళ్లీ ఊపందుకున్న పశువుల అక్రమ రవాణా
అధికారయంత్రాంగం తీసుకున్న ఒక మంచి నిర్ణయం.. రాజకీయ ఒత్తిళ్ల ముందు కొన్ని గంటలు కూడా నిలబడలేకపోయింది. అక్రమ రవాణాకు నిలయంగా మారిన పశువుల సంతను కలెక్టర్ ఆదేశాలతో రద్దు చేసిన అధికారులు.. కేవలం 48 గంటల్లోనే తిరిగి తలుపులు బార్లా తెరిచారు. తెరుచుకోండంటూ ఆదేశాలు ఇచ్చారు. దీనివెనుక రాజకీయ ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు స్థానిక నాయకులు ఒక కీలక ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆయన ఆదేశాలతో అధికారులు ‘నిలిపివేత’ ఉత్తర్వులను వెనక్కి తీసుకునట్లు చర్చికుంటున్నారు. సంత మళ్లీ తెరిచారు సరే.. అక్రమ రవాణాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోయారు.
గజపతినగరం, జూలై 25(ఆంధ్రజ్యోతి): పెదమానాపురం సంతలో పశువుల అక్రమ రవాణాపై జిల్లా కలెక్టర్‌కు గోసంరక్షణ సంఘాలు ఇటీవల ఫిర్యాదు చేశాయి. దీనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి ఆదేశించగా.. ఆయన జూలై 7 నుంచి సంతను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించారు. అనంతరం ఎంపీడీవో, గ్రామకార్యదర్శకి కూడా సంత నిర్వహించకూడదని ఆదేశాలు వెళ్లాయి. అయితే రెండు రోజుల వ్యవధిలోనే పై అధికారుల నుంచి అనుమతి రావడంతో సంతను మళ్లీ ప్రారంభించారు. దీనివెనుక బలమైన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక నాయకులు కొందరు ఒక కీలకమైన ప్రజాప్రతినిధిపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. ఆ ప్రజాప్రతినిధి ఒత్తిడితో అధికారులు సంత మళ్లీ తెరిచేందుకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. సంత నిర్వహించుకోవచ్చు కానీ, ఇక్కడి నుంచి పశువుల అక్రమ రవాణా గురించి ఎందుకు పట్టించుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీనిపై అధికారులు అస్సలు దృష్టి పెట్టడంలేదన్న ఆరోపణలు ఉన్నాయి.
అడ్డదారుల్లో అక్రమ రవాణా
పెదమానాపురం సంత నుంచి పశువులను భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జాతీయ రహదారిపై పోలీసుల తనిఖీలు ఉండడంతో అక్రమ రవాణాదారులు గ్రామీణ మార్గాలను ఎంచుకుంటున్నారు. ముందుకు పైలెట్ వాహనాలు పంపించి, పోలీసుల కదలికలను గమనించి అనంతరం పశువులను తరలిస్తున్నట్లు తెలుస్తోంది. .పార్వతీపురం, ఒడిశా నుంచి పశువులను గురువారం పెదమానాపురం చేరుకుంటాయి. శనివారం సంత కావడంతో వ్యాపారులు శుక్రవారమే ఇక్కడకు వచ్చి పశువులను కోనుగోలు చేస్తున్నారు. భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. జాతీయ రహదారిపై పోలీసుల నిఘా ఉండడంతో గ్రామీణ రోడ్లను ఎంచుకుంటున్నారు. మానాపురం సంతనుంచి నేరుగా ఇంగిలాపల్లి, కొంపంగి రోడ్డు నుంచి గజపతినగరం మీదుగా బొండపల్లి మండలందాటి హైవేపైకి చేరుకుంటున్నారు. అక్కడి నుంచి అర్ధరాత్రి విశాఖవైపు తరలిస్తున్నారు. పెదమానాపురం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వాహనాల కన్నా ముందుగా వెళ్లి పోలీసులు నిఘా పరిశీలించి అనువైన సమయంలో వాహనాలను బొండపల్లి మండలం గొట్లాం వద్ద హైవేకి చేరుస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ప్రతీ వాహనానికి వెయ్యి రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సౌకర్యాలలేమి
సంతలో ఇప్పటికీ మౌలిక సదుపాయాలు కల్పించడంలేదు. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండడం లేదు.
సీసీ కెమెరాలు ఏర్పాటు కాలేదు.
పశువులు నీటితొట్టెలు, గడ్డి వంటి సదుపాయాలు లేవు.
పశువైద్యుల పర్యవేక్షణ తగినస్థాయిలో లేదన్న విమర్శలు ఉన్నాయి.
ఇతర ప్రాంతాలకు పశువుల తరలింపులో నిబంధనలు పాటించడం లేదు.
ఒక్కో వాహనంలో ఊపిరాడకుండా కుక్కి తరలిస్తున్నారు.
అక్రమరవాణాపై ప్రత్యేక నిఘా
పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశాము. ఇప్పటికే మే, జూన్, జూలై నెలల్లో 9 కేసులు నమోదు చేశాము. వాహనాలు సీజ్ చేసి ఆవులను గోసంరక్షణశాలలకు తరలిస్తున్నాం.
ఎస్.సన్యాసినాయుడు, గజపతినగరం సీఐ
అనుమతులు వచ్చాకే సంత నిర్వహణ
జిల్లా అధికారుల నుంచి అనుమతులు వచ్చాకే సంత నిర్వహిస్తున్నాము. ఈనెల 7న సంత తాత్కాలికంగా నిలిపివేయాలని డీపీవో నుంచి ఆదేశాలు వచ్చాయి. రెండు రోజుల తరువాత సంత నిర్వహించుకోవచ్చన్న ఆదేశాలు వచ్చాయి.
ఎస్.తాత, దత్తిరాజేరు ఎంపీడీవో
కంటైనర్‌లో రెండు అంతస్తులు చేసి..
ఒడిశా నుంచి కేరళకు తరలిస్తుండగా..
42 పశువులను పట్టుకున్న పోలీసులు
దత్తిరాజేరు, జూలై 25(ఆంధ్రజ్యోతి): స్థానిక జాతీయ రహదారిపై శనివారం అక్రమంగా పశువులను తరలిస్తున్న కంటైనర్‌ను పట్టుకున్నామని పెదమానాపురం ఎస్‌ఐ కళాధర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం రాయఘడ నుంచి కేరళకు గోవులను తరలిస్తున్నట్టు సమాచారం రావడంతో ఎస్‌ఐ, సిబ్బంది వాహనాల తనిఖీ చేపట్టారు. కంటైనర్ వాహనం ఆపి తనిఖీలు చేయగా అందులో 42 పశువులు ఉన్నట్టు గుర్తించారు. వాహన డ్రైవర్ తంగం శశికుమార్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ కేసులో అయ్యప్ప, శంకర్, భరత్ రాఘవ అనే నలుగురిని గుర్తించామని, త్వరలో వారిని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.