Only if it comes via an IVRS survey..!ఐవీఆర్‌ఎస్ సర్వేలో వస్తేనే..!
ABN , Publish Date - Oct 22 , 2026 | 12:34 AM
Only if it comes via an IVRS survey..! వేపాడ జడ్పీటీసీ అభ్యర్థిగా పాటూరు గ్రామానికి చెందిన కొట్యాడ వెంకటలక్ష్మిని, శృంగవరపుకోట జడ్పీటీసీ అభ్యర్థిగా తలారి గ్రామానికి చెందిన రెడ్డి భవానీని, లక్కవరపుకోట జడ్పీటీసీగా రంగరాయపురం గ్రామానికి చెందిన కొట్యాడ కనకమహాలక్ష్మిలను టీడీపీ నియోజక వర్గ నాయకత్వం ఎంపిక చేసింది.
ఐవీఆర్‌ఎస్ సర్వేలో వస్తేనే..!
జడ్పీటీసీ టికెట్ కేటాయింపునకు ప్రజాభిప్రాయ సేకరణ
ఆయా మండలాల ఓటర్లకు టీడీపీ అధిష్టానం నుంచి ఫోన్ కాల్స్
శృంగవరపుకోట, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి):
- వేపాడ జడ్పీటీసీ అభ్యర్థిగా పాటూరు గ్రామానికి చెందిన కొట్యాడ వెంకటలక్ష్మిని, శృంగవరపుకోట జడ్పీటీసీ అభ్యర్థిగా తలారి గ్రామానికి చెందిన రెడ్డి భవానీని, లక్కవరపుకోట జడ్పీటీసీగా రంగరాయపురం గ్రామానికి చెందిన కొట్యాడ కనకమహాలక్ష్మిలను టీడీపీ నియోజక వర్గ నాయకత్వం ఎంపిక చేసింది. అయితే పార్టీ అధిష్టానం మాత్రం ఆయా మండలాల ఓటర్ల ఫోన్‌లకు సందేశాలను పంపిస్తోంది. మీ మండలానికి జడ్పీటీసీగా వీరు ఉండాలనుకుంటున్నారా.. అవును అయితే ఒకటి, వద్దంటే రెండు నొక్కాలంటూ అడుగుతోంది.
ఈ విధంగా జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఎంపిక చేసిన పేర్లను తెలుగుదేశం పార్టీ అధిష్టానం పూర్తిస్థాయిలో అభ్యర్థిగా ప్రకటించేందుకు ఐవీఆర్‌ఎస్ సర్వేను చేయిస్తోంది. నేరుగా ఓటర్లకు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఆయా మండలాలకు ఎంపిక చేసిన జడ్పీటీసీ అభ్యర్థుల పేర్లను చెబుతున్నారు. ఈ పేర్లు ఇష్టమైతే ఒకటి, ఇష్టం లేకుంటే రెండు నొక్కాలని కోరుతోంది. ఇలా ప్రజల నుంచి వచ్చిన అభిప్రాయాల్ని బట్టి భి.పారాలు ఇవ్వనున్నారు. దీంతో జిల్లాలోనూ, నియోజకవర్గంలోనూ చర్చించి ప్రకటించిన అభ్యర్థికి టికెట్ వచ్చేస్తుందని నమ్మకం అయితే లేదు. ఐవీఆర్‌ఎస్ సర్వే ద్వారానే ఓ అభిప్రాయానికి వచ్చాక టికెట్‌లను కేటాయించనుంది. ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెనకబడతామేమోనన్న భయం ప్రస్తుత అభ్యర్థులకు పట్టుకుంది.
గత సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యేలను ఎంపిక చేసేందుకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇదే విధానాన్ని అవలంభించారు. ఈ పద్ధతి అప్పుడు విజయవంతమైంది. పోటీలో నిలబడ్డ స్థానాల్లో అత్యఽధికంగా టీడీపీ కైవసం చేసుకుంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తి స్థాయిలో టీడీపీ వశం చేసుకొనేందుకు ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. నియోజకవర్గ స్థాయి నేతలు తమ అనుచరులకు ఎంపీటీసీలు, జడ్పీటీసీలుగా పదవులు కట్టబెట్టేందుకు ప్రజాభిమానంతో సంబంధం లేకుండా టిక్కెట్‌లు కేటాయించేందుకు చూస్తున్నారు. ఇలాంటి చోట ప్రతి పక్ష వైసీపీ బలమైన నాయుకుడిని పోటీగా దించితే పరిస్థితులు తారుమారు అయ్యే అవకాశం వుందని భావించిన టీడీపీ అధిష్టానం ఐవీఆర్‌ఎస్ సర్వేను నమ్ముకుంది. నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయి పార్టీ కార్యాలయానికి వెళ్లిన ప్రతి ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థి పేరును ఐవీఆర్‌ఎస్‌లో పెడుతున్నారు. గెలుస్తారన్న స్థాయిలో ప్రజాభిప్రాయం వచ్చిన వారికే పోటీలో దిగేందుకు బి-ఫారాలు అందించనున్నారు.
ఫ శృంగవరపుకోట మండలంలో మొదటిగా జడ్పీటీసీ అభ్యర్థిగా ఎంపిక చేసిన రెడ్డి భవానీ గురించి ఐవీఆర్‌ఎస్ కాల్స్ వస్తుండగానే బుధవారం సీతారాంపురం గ్రామానికి చెందిన డోకుల సునీత పేరు పరిశీలనకు వచ్చింది. ఈమె జడ్పీటీసీ అభ్యర్థినిగా ప్రచారం జరుగుతుండడంతో మొదట ఎంపిక చేసిన రెడ్డి భవానీ భర్త మాజీ ఎంపీపీ రెడ్డివెంకన్న అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
------------------