Share News

only compensation పరిహారంతో సరి

ABN , Publish Date - May 05 , 2026 | 12:22 AM

only compensation

only compensation పరిహారంతో సరి
తారకరామతీర్థసాగర్‌ రిజర్వాయర్‌లో కలిసిపోయిన భూములు

పరిహారంతో సరి

పూర్తిస్థాయి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ ఏదీ?

కానరాని గృహాల నిర్మాణం

ఉపాధి లేక అయోమయం

తారకరామ తీర్థసాగర్‌ నిర్వాసితుల ఆవేదనిది

తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ కోసం భూములు సేకరించిన అధికారులు నిర్వాసిత రైతులకు కేవలం పరిహారం ఇచ్చి మిగతా సమస్యలను గాలికి వదిలేశారు. రీసెటిల్‌మెంట్‌ అండ్‌ రీహేబిలిటేషన్‌ (ఆర్‌అండ్‌ఆర్‌) ప్యాకేజీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదు. వారికి పక్కా ఇళ్ల నిర్మాణం కాని, ఉపాధి కల్పన కానీ లేదు. అలాగే చెట్లు, పశుసంపదకు నష్టపరిహారం తేల్చలేదు. వైసీపీ ప్రభుత్వానికి ఎన్ని విన్నపాలను ఇచ్చినా కనీసం పరిగణనలోకి తీసుకోలేదు. కూటమి ప్రభుత్వ చొరవ కోసం వారు ఆశగా ఎదురుచూస్తున్నారు.

నెల్లిమర్ల, మే 4(ఆంధ్రజ్యోతి):

తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌కు సంబధించి ఏటి.అగ్రహారం, కోరాడపేటను ముంపు గ్రామాలుగా తొలుత ప్రకటించిన అధికారులు వారి కోసం నిర్వాసిత గ్రామం ఏర్పాటుకు ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వారి భూములను స్వాధీనం చేసుకొని ఉపాధి అంశాన్ని వదిలేశారు. ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని వర్తింప చేయలేదు. నిర్వాసిత గ్రామాల గురించి కానీ, వారి ఇళ్లు, చెట్లు, పశుసంపదకు కాని నష్టపరిహారం పంపిణీ చేయలేదు. పదేళ్ల క్రితం రామతీర్థసాగర్‌ రిజర్వాయర్‌ను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. తొలుత దన్నానపేట గ్రామ పంచాయతీ పరిధిలోని కోరాడపేట గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించింది. ఆ తరువాత మరో రెండేళ్లకు పక్కనే ఉన్న అత్మారాముని అగ్రహారం గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే మండలంలోని సారిపల్లి గ్రామ భూములు కూడా రిజర్వాయర్‌లో కలిశాయి. ఈ మూడు గ్రామాలకు సంబంధించి దాదాపు 90 శాతం భూములకు నష్టపరిహారం పంపిణీ చేశారు. మరో 10 శాతం భూములకు కుటుంబ తగాదాలు, రికార్డుల సమస్య, కోర్టు ఉత్తర్వులు తదితర కారణాల వల్ల చెల్లింపులు నిలిచిపోయాయి. ముంపు గ్రామాల్లో పల్లం భూమి ఎకరాకు రూ.1.75 లక్షలు, మెట్ట భూమికి రూ.1.5 లక్షలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. ఇంకా కోట్లాది రూపాయల పరిహారం నిర్వాసితులకు పంపిణీ చేయాల్సి ఉంది. యంత్రాంగంలో చలనం లేక ఐదేళ్లుగా ఎలాంటి మార్పులు లేవు.

నిర్వాసిత గ్రామాలెక్కడ?

ముంపు గ్రామాల అసలు సమస్య నిర్వాసిత గ్రామాల నిర్మాణం. తారకరామతీర్థసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంలో భాగంగా ఎనిమిదేళ్ల క్రితం కోరాడపేట, వీటీ.అగ్రహారం గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రభుత్వం అధికారికంగా ప్రటించినప్పటీకీ ఇంతవరకు వారికి నిర్వాసిత గ్రామాలను ఎక్కడా నిర్మించలేదు. కనీసం దీనిపై అధికారులు ఒక నిర్ణయానికి కూడా రాకపోవడం విచిత్రం. కోరాడపేట గ్రామస్థులకు నెల్లిమర్ల ఫ్లైఓవర్‌ వంతెన సమీపంలో నిర్వాసిత గ్రామం నిర్మాణానికి సర్వే నెంబరు 58లో 16.69 ఎకరాలను కేటాయించారు. ఆ స్థలాన్ని ఇంతవరకు చదును చేయడం కాని, ప్లాట్లుగా వేసి లబ్ధిదారులకు కేటాయించడం కానీ జరగలేదు. ఏటీ.అగ్రహారం గ్రామస్థులకు ఇంతవరకు స్థలం కూడా ఎంపిక చేయలేదు.

ఇవీ సమస్యలు

ప్రధానంగా ముంపు గ్రామాల్లో కోరాడపేటలో 200 ఎకరాలు, ఏటీ.అగ్రహారంలో 450 ఎకరాలు రిజర్వాయర్‌ కింద కలిసిపోయాయి. వీటికి సంబంధించి దాదాపు 90 శాతం నష్టపరిహారం చెల్లింపులు పూర్తయినప్పటికీ గ్రామాల్లో ఇప్పటికే నివసిస్తున్న వారి ఇళ్లకు, భవనాలకు, పశువులశాలలకు, ఫలసాయం ఇస్తున్న చెట్లకు నష్టపరిహారం చెల్లించలేదు. దీనిపై గతంలో నీటిపారుదల శాఖాధికారులు సర్వే చేసినప్పటికీ గ్రామస్థులు సంతృప్తి చెందలేదు. సర్వే సక్రమంగా జరగలేదని పెదవి విరుస్తున్నారు. రోడ్లు, భవనాల శాఖ అధికారులతో రీసర్వే చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. కోరాడపేటలో 184 ఇళ్లు ఉండగా, ఏటీ అగ్రహారంలో 500 ఇళ్లతోపాటు 140 పశువుల శాలలు ఉన్నాయి. వీటితోపాటు నిర్వాసిత కుటుంబాలకు జీవనభృతి కింద ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.1.08 లక్షలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. దీనిపై అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన యువకులకు ప్రత్యేక భృతి చెల్లించాల్సి ఉంది. గ్రామాన్ని వదిలి నిర్వాసిత గ్రామానికి తరలిపోయేందుకు రవాణాభత్యంతోపాటు కొత్త గ్రామం నిర్మాణం, స్థలం కేటాయింపు, ఇళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాల్సి ఉంది.

Updated Date - May 05 , 2026 | 12:22 AM