ఇక 9 రోజులే Only 9 days left.
ABN , Publish Date - Jul 05 , 2026 | 12:01 AM
Only 9 days left. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ఇంటింటి సర్వేకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ 99.8శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది కేవలం 44.8శాతం మాత్రమే. ఈనెల 14వ తేదీలోగా డిజిలైజేషన్ చేయించుకోకపోతే ఓట్లు గల్లంతేనని నిపుణులు చెబుతున్నారు.
ఇక 9 రోజులే
సర్‌కు సమీపిస్తున్న గడువు
జిల్లాలో 15.7లక్షల ఓటర్లు
99.8శాతం మందికి ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చామంటున్న అధికారులు
తిరిగి బీఎల్‌ఓల చేతికి వచ్చినవి44.8శాతమే
14వ తేదీతో ముగియనున్న గడువు
ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)ఇంటింటి సర్వేకు మరో 9 రోజులు మాత్రమే గడువుంది. జిల్లాలోని ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారం(ఈఎఫ్)ల పంపిణీ 99.8శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ జరిగింది కేవలం 44.8శాతం మాత్రమే. ఈనెల 14వ తేదీలోగా డిజిలైజేషన్ చేయించుకోకపోతే ఓట్లు గల్లంతేనని నిపుణులు చెబుతున్నారు.
గజపతినగరం/ కలెక్టరేట్, జూలై4(ఆంధ్రజ్యోతి):
జూన్ 15 నుంచి ఓటరు సమగ్ర సర్వే మొదలైంది. ఈనెల 14వరకు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్‌ఓ)ఇంటింటికి వచ్చి ప్రతీ ఓటరుకు ఈఎఫ్ అందజేయాలి. 2002 జాబితా ప్రకారం ప్రస్తుతం ఆ నివాసంలో ఓటరు ఉన్నారా?లేదా?అనేది పరిశీలించాలి. కొన్ని చోట్ల బిఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లకుండా ఒక చోటుకు పిలిచి ఫాంలు అందజేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని 1484 పోలింగ్ కేంద్రాల్లో 15,78,949 మంది ఓటర్లు ఉండగా 7,07355 ఓట్లు మ్యాపింగ్ అయ్యాయి. ఇంకా 8,71,594 ఓట్లు మ్యాపింగ్ కావాల్సి ఉంది.
నత్తనడకన డిజిలైజేషన్
జిల్లాలో శనివారం నాటికి 15,76607మంది ఓటర్లకు ఈఎఫ్‌లు అందజేయడం ద్వారా 99.8శాతం లక్ష్యం చేరుకున్నట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాల్లో ఓటర్లు ఇచ్చిన వివరాలను బీఎల్‌ఓలు డిజిటలైజ్ చేయాలి. ఇంతవరకు కేవలం 7,07,355ఓట్ల ద్వారా 44.8శాతం మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. అత్యధికంగా రాజాంలో 50.46శాతం ఓట్లు డిజిటలైజ్ చేయగా బొబ్బిలిలో 45.54శాతం, చీపురుపల్లిలో 47.40శాతం, గజపతినగరంలో 47.38శాతం, నెలిమర్లలో 39.40శాతం, విజయనగరంలో 34.09శాతం, ఎస్.కోటలో 51.05శాతం ఓట్లు ఆన్‌లైన్ చేశారు. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజ్‌కు ఈనెల 14వ తేదీ వరకే గడువు ఉంది. రానున్న 9 రోజుల్లో మిగిలిన 45.20శాతం ఓట్లను డిజిటైజ్ చేయాల్సి ఉంది. ఇంటింటి సర్వే అనంతరం బిఎల్‌ఓలు తొలగించిన ఓట్లు, కొత్తగా నమోదైన ఓట్లు, మార్పులు, చేర్పుల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారులు ప్రచురిస్తారు. ఆ తరువాత క్లైయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరించి వాటిని సెప్టెంబర్ 18 లోగా పరిష్కరిస్తారు. అనంతరం సెప్టెంబర్ 22న తుది జాబితా ప్రచురిస్తారు.
అయోమయంలో ఓటర్లు, బీఎల్‌ఓలు
లక్షల ఓట్లు, వేలాది ఇళ్లు ప్రతీ ఇంటికీ వెళ్లాలి. 2002 ఆధారిత ఓటర్ల జాబితా వివరాల అధారంగా సర్ కార్యాక్రమానికి సంబంధించిన పత్రాలను పంపిణీ చేయాలి. మండల స్థాయిలో తహసీల్దార్‌లు, మున్సిపాల్టీ స్థాయిలో కమిషనర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ సాఫీగా సాగాలి. 2002 సంవత్సరంలో మీరు ఎక్కడ ఉన్నారు అన్న ప్రశ్నకు ఓటర్లు అయోమయంలో పడుతున్నారు. సొంత ఇళ్లు ఉన్నవారికి పెద్దగా ఇబ్బందులు లేక పోయినా అద్దె ఇళ్లు మారే ఓటర్ల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతోంది. సర్ కార్యక్రమంలో భాగంగా అధికారులు పట్టణ ప్రాంతాల్లో ఓటర్లను తెలుసుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. అపార్ట్‌మెంట్‌లు ఎక్కి దిగ లేక ఇబ్బందులు పడుతున్నారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఓటర్ల జాబితాలో ప్రతీ పౌరుడి పేరు ఉండాలనే ఉద్దేశంతో పాటు అనర్హులను, డూప్లికేట్ నమోదులను తొలగించి ఓటర్ల జాబితాను ఖచ్చితంగా పారదర్శకంగా రూపొందించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
4వ తేదీ నాటికి డిజిటలైజ్ చేసిన ఓటర్ల వివరాలు
నియోజకవర్గం ఓట్లు ఈఎఫ్‌లు డిజిటలైజ్
ఇచ్చినవి అయినవి
రాజాం 2,29,880 2,29,837 50.46
బొబ్బిలి 2,33,621 2,33,621 45.54
చీపురుపల్లి 2,07,471 2,07,470 47.40
గజపతినగరం 2,07,402 2,07,402 47.38
నెలిమర్ల 2,14,418 2,14,091 39.40
విజయనగరం 2,61,300 2,59,654 34.09
ఎస్.కోట 2,24,857 2,24,532 51.05
==============