మెడికల్ షాపు యజమానికి ఏడాది జైలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 12:15 AM
డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించిన కేసులో హోల్‌సేల్ మెడికల్ షాపు యజమానికి జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకురాలు(ఏడీ) కె.రజిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయనగరం రింగురోడ్డు, జూన్ 30(ఆంధ్రజ్యోతి): డ్రగ్స్ అండ్ కాస్మోటిక్స్ చట్టం నిబంధనలు ఉల్లంఘించిన కేసులో హోల్‌సేల్ మెడికల్ షాపు యజమానికి జిల్లా కోర్టు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు జిల్లా ఔషధ నియంత్రణ శాఖ సహాయ సంచాలకురాలు(ఏడీ) కె.రజిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని కన్యకాపరమేశ్వరీ ఆలయం సమీపంలో ఉన్న మనోజ్ మెడికల్స్ అనే హోల్‌సేల్ ఫార్మా సంస్థలో 2016లో అప్పటి డ్రగ్ ఇన్‌స్పెక్టరు ఎన్.యుగంధర్ తనిఖీలు చేపట్టారన్నారు. ఈ తనిఖీల్లో ఆ సంస్థలో నిబంధనలకు విరుద్ధంగా ఫిజీషియన్ శాంపిల్స్-నాట్ ఫర్ సేల్ అని ముద్రించిన మందులు స్టాక్ ఉన్నట్టు గుర్తించారు. దీనిపై సదరు సంస్థపై అప్పట్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. కేసు విచారించిన జిల్లా మొదటి అదనపు సెషన్స్ కోర్టు మంగళవారం తీర్పు వెలువరించిందన్నారు. నేరం రుజువు కావడంతో మనోజ్ మెడికల్స్ యాజమాని అయిన డి.పాండురంగకు ఏడాది పాటు సాధారణ జైలు శిక్షతో పాటు రూ.20వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారన్నారు.