Share News

‘జిందాల్‌’ లాకౌట్‌కు ఏడాది

ABN , Publish Date - Mar 15 , 2026 | 12:07 AM

మండలంలోని అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్‌ (జిందాల్‌ స్టయిన్‌లైస్‌ లిమిటెడ్‌) కర్మాగారానికి లాకౌట్‌ విధించి ఈ నెల 16కు (సోమవారం) సంవత్సరం పూర్తికానుంది.

‘జిందాల్‌’ లాకౌట్‌కు ఏడాది
జిందాల్‌ కర్మాగారం

- ఇంతవరకు కాంట్రాక్టు కార్మికులకు జరగని న్యాయం

- ఎటూ తేల్చని యాజమాన్యం

-మనుగడ కోల్పోతున్న కార్మిక సంఘాలు

కొత్తవలస, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని అప్పన్నపాలెం పంచాయతీ జిందాల్‌నగర్‌లో ఉన్న జేఎస్‌ఎల్‌ (జిందాల్‌ స్టయిన్‌లైస్‌ లిమిటెడ్‌) కర్మాగారానికి లాకౌట్‌ విధించి ఈ నెల 16కు (సోమవారం) సంవత్సరం పూర్తికానుంది. గతేడాది మార్చి 16న లాకౌట్‌ ప్రకటించిన యాజమాన్యం అందులో పనిచేసిన కాంట్రాక్టు కార్మికులకు న్యాయం చేసే విషయమై ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కర్మాగారంలో సుమారు 300 మంది వరకు కాంట్రాక్టు కార్మికులు, 60 మంది వరకు రెగ్యులర్‌ కార్మికులు పని చేసేవారు. లాకౌట్‌ విధించిన తరువాత కొన్ని నెలల పాటు కార్మికులు కర్మాగారం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్మిక శాఖాధికారుల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగారు. అయినా ఫలితం శూన్యం. రెగ్యులర్‌ కార్మికులను ఒడిశాలో ఉన్న జిందాల్‌ కర్మాగారానికి యాజమాన్యం బదిలీ చేసి వారికి పని కల్పించింది. దీంతో రెగ్యులర్‌ కార్మికుల సమస్య సమసిపోయింది. కాంట్రాక్టు కార్మికులే ఎటూ చెందకుండా మిగిలిపోయారు. తమకు కూడా న్యాయం చేయాలని ఏసీఎల్‌, డీసీఎల్‌, జేసీఎల్‌ ఇలా కార్మిక శాఖాధికారుల వద్దకు వెళ్లి వేడుకున్నారు. యాజమాన్య ప్రతినిధుల నుంచి ఎటువంటి సమాధానం లేకపోవడంతో లేబర్‌ కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యారు. కోర్టుకు వెళితే మరికొన్ని సంవత్సరాలు వరకు సమస్య తేలదని భావించి ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. అధికారులతో పని జరగదని భావించి ప్రజాప్రతినిధులు, కేంద్ర మంత్రులు, రాష్ట్రమంత్రులు వద్దకు తిరిగారు. అక్కడ కూడా ఎటువంటి న్యాయం జరగలేదు. పోరాటం చేస్తున్న కాంట్రాక్టు కార్మికుల్లో ప్రస్తుతం చాలామందికి పదవీ విరమణ వయసు దాటిపోయింది. దీంతో కనీసం తమకు రిటైర్మెంట్‌ ప్రయోజనాలైనా కల్పించాలని కోరినా యాజమాన్యం పట్టించుకోవడం లేదు. ఫైనల్‌ సెటిల్మెంట్‌ చేస్తే తీసుకోవడానికి సిద్ధమని కొందరు కార్మికులు ప్రకటించినా యాజమాన్యం నుంచి స్పందన లేదు. లాకౌట్‌ విధించి సంవత్సరం పూర్తికావడంతో కార్మిక సంఘాలు కూడా నిర్వీర్యం అయ్యే దశకు చేరుకున్నాయి. గతంలో కర్మాగారంలో టీఎన్‌టీయూసీ, సీఐటీయూ, వైసీపీ కార్మిక సంఘాలు ఉండగా, ప్రస్తుతం ఇందులో రెండు కార్మిక సంఘాలు మనుగడలో లేకుండా పోయాయి.

Updated Date - Mar 15 , 2026 | 12:07 AM