Dream Job కలల కొలువుకు ఏడాది పూర్తి
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:22 PM
One Year Completed in the Dream Job ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ఆశల కొలువుతో కొత్త జీవితం.. విద్యార్థుల మధ్య గురువుగా సరికొత్త బాధ్యతలు.. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా నియమితులైన వారంతా విధుల్లో చేరి ఏడాది ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. కలల కొలువు సాధించామన్న ఆనందం నుంచి తరగతి గదిలో బోధన వరకు ఎన్నో మధురానుభూతులతో వారి తొలి ఏడాది ముగిసింది.
ఉమ్మడి జిల్లాలో 578 మంది పోస్టింగ్
కొత్త అనుభవాలతో మరింత ఉత్సాహంగా విధులు
పాలకొండ/ సీతంపేట, అక్టోబరు 12(ఆంధ్రజ్యోతి): ఏళ్ల నిరీక్షణకు ఫలితం.. ఆశల కొలువుతో కొత్త జీవితం.. విద్యార్థుల మధ్య గురువుగా సరికొత్త బాధ్యతలు.. మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా నియమితులైన వారంతా విధుల్లో చేరి ఏడాది ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. కలల కొలువు సాధించామన్న ఆనందం నుంచి తరగతి గదిలో బోధన వరకు ఎన్నో మధురానుభూతులతో వారి తొలి ఏడాది ముగిసింది. విధుల్లో చేరిన తొలినాళ్లలో ఎదురైన అనుభవాలు, పాఠశాలల్లో బాధ్యతలు, విద్యార్థులతో అనుబంధం.. ఇలా ఎన్నో విషయాలపై పలువురు గురువులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం..
ఆ క్షణం చాలా ప్రత్యేకం..
మెగా డీఎస్సీలో టీచర్‌గా ఎంపికైన తర్వాత అపాయింట్‌మెంట్ ఆర్డర్ తీసుకుని మొదటిరోజు సీతంపేట ఏపీటీడబ్ల్యూఆర్ గురుకుల బాలుర పాఠశాలలో అడుగుపెట్టా. క్లాస్‌రూంలోకి వెళ్లినప్పుడు కొంచెం భయం, టెన్షన్‌తో పాటు చాలా ఆనందంగా అనిపించింది. టీచర్ కావాలన్న కలలు నిజమైన వేళ.. పిల్లల ముందు ఉపాధ్యాయురాలిగా నిలబడిన ఆక్షణం నాకు చాలా ప్రత్యేకం. పిల్లలు నన్ను ఎలా స్వీకరిస్తారో అని అనుకున్నా... వాళ్లతో మాట్లాడిన తరువాత ఆ భయం అంతా పోయింది. మొదటిసారి పిల్లలు మేడమ్ అని పిలిచినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. అది కేవలం ఒక పిలుపుకాదు- టీచర్‌గా నా స్థానాన్ని పొందాననే ఒక భావన. మన మీద పిల్లలు పెట్టుకున్న నమ్మకం, గౌరవం గుర్తొచ్చినప్పుడు బాధ్యత కూడా మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. విద్యార్థులను అన్ని విషయాల్లో ప్రోత్సహిస్తూ.. వారికి అర్థమయ్యే విధంగా పాఠాలు బోధిస్తా. కొంతకాలానికి వాళ్లే నా ముందుకు వచ్చి సమాధానాలు చెప్పడం, యాక్టివిటీస్‌లో పాల్గొనడం .. టీచర్‌గా చాలా పెద్ద విజయంలా అనిపించింది. రోజూ విజయనగరం నుంచి పాఠాశాలకు వస్తుంటా. అందుబాటులో ఉన్న రవాణా సౌకర్యాలను ఉపయోగించుకొని సకాలంలో విధులకు హాజరవుతున్నా. పిల్లల కోసం ఆ ప్రయాణ కష్టాన్ని పెద్దగా పట్టించుకోను.
- బి.యోగ్యశ్రీ, సైన్స్ ఉపాధ్యాయురాలు, ఏపీటీడబ్ల్యూఆర్ గురుకుల బాలుర పాఠశాల, సీతంపేట
==============================================
ఎమోషన్‌కు గురయ్యా..
నేను గతంలో సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్‌గా శ్రీకాకుళంలో పనిచేశా. మెగా డీఎస్సీలో ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యా. సీతంపేట ఏపీఆర్ బాలుర గురుకుల పాఠశాలలో మ్యాథ్స్ టీచర్‌గా పోస్టింగ్ వచ్చింది. ఉపాధ్యాయుడిగా మొదటిరోజు తరగతి గదిలోకి వెళ్లినప్పుడు అంతా కొత్తగా అనిపించింది. భయంతో పాటు పిల్లలను చూసి ఎమోషన్‌కు గురయ్యా. గణితం సబ్జెక్ట్‌లో చాలా వరకు పిల్లలు వెనుకబడి ఉన్నారు. వారిలో ఒక విద్యార్థికి మ్యాథ్స్ అంటే భయమని గుర్తించా. గణితం సబ్జెక్ట్‌పై భయాన్ని దూరం చేసి దానిపై ఇష్టాన్ని పెంచా. తరగతి గదిలో పిల్లలు తనను సార్ అని పిలిస్తే చాలా ఆనందంగా, గొప్పగా అనిపిస్తుంది. అది మాటల్లో చెప్పలేని అనుభూతి. కుటుంబ పరిస్థితుల దృష్ట్యా రోజూ శ్రీకాకుళం నుంచి పాఠశాలకు వెళ్లివస్తున్నా. ఏదేమైనా పిల్లలతో కలిసి ఉండే క్షణాలు ఎంతో ప్రత్యేకం.
- ఎస్.సుధాకర్‌రావు పీజీటీ (గణితం), ఏపీఆర్ బాలుర గురుకుల పాఠశాల, సీతంపేట
==============================================
ఏదో తెలియని అనుభూతి..
క్లాస్ రూంలో తొలిసారిగా అడుగు పెట్టిన మొదటి రోజు ఎదో తెలియని అనుభూతి. సరిగ్గా ఏడాది కిందట మెగా డీఎస్సీ ద్వారా టీచర్‌గా నియామకమైన తర్వాత బడ్డుమాసంగి జీటీడబ్ల్యూఏజీహెచ్ స్కూల్‌లోని పదో తరగతి గదిలో అడుగుపెట్టా. ఎదురుగా ఉన్న విద్యార్థులను చూసి కొంచెం కంగారుపడ్డా. అయితే ఎంతో ఆనందంగా అనిపించింది. అయితే నేను మేథ్స్ సార్ అయిపోయాననే ఆ ఫీలింగ్‌ను ఎప్పటికీ మరువలేను. పిల్లలందరూ మ్యాథ్స్‌సార్.. గుడ్‌మార్నింగ్ అంటూ వారు చెప్పడం ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి.. యావరేజ్ స్థాయికి తీసుకొచ్చా. ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. బడ్డుమాసంగికి బస్సు సౌకర్యం లేదు. ప్రస్తుతం రోడ్డు సమస్య తీరింది. రాజాం నుంచి రోజూ ఒక వైపు 44 కిలోమీటర్ల దూరం బైక్‌పై వెళ్లి రావడం కాస్త ఇబ్బందిగా ఉన్నా మా విద్యార్థులను చూసేసరికి మళ్లీ నూతన ఉత్సాహం వచ్చేస్తుంది.
- సిరిపురపు గణపతినాయుడు, ఎస్‌ఏ మ్యాథ్స్, జీటీడబ్ల్యూఏజీహెచ్‌ఎస్, బడ్డుమాసంగి, పాలకొండ మండలం
==============================================
వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి
మెగా డీఎస్సీ ద్వారా ఎస్‌ఏ ఇంగ్లిష్ టీచర్‌గా నాకు బడ్డుమాసంగి జీటీడబ్ల్యుఏజీహెచ్ స్కూల్‌లో మొదటి పోస్టింగ్ వచ్చింది. టీచర్‌గా నా తొలి అడుగు పదో తరగతిలో మొదలైంది. ఎదో తెలియని భయం. తరగతిలో అంత మంది పిల్లలను చూడగానే వణుకుపుట్టింది. కానీ వారిని పరిచేయం చేసుకుని.. మేడమ్ రైడ్స్ ద బస్సు అనే పాఠం బోధించా. అందరు పిల్లలు ఒకేలా ఉండరు. రకరకాలుగా ఉంటారు. వారిని ఒక్కసారిగా మార్చలేం. చదువులో వెనుకబడిన పిల్లలపై ప్రత్యేకంగా దృష్టిసారించా. గతంతో పోలిస్తే ఇప్పుడు వారిలో ఎంతో మార్పున వచ్చింది. మా పాఠశాలకు బస్సు సౌకర్యం లేదు. రోడ్డు సమస్య తీరింది. రోజూ పార్వతీపురం నుంచి వెళ్లి రావడం రావడం కాస్త ఇబ్బందిగా ఉన్నా.. పిల్లలను చూశాక.. వారి కోసం ఈ మాత్రం చేయలేనా అనిపిస్తుంది. పాఠశాలలో నేను అడుగు పెట్టిన వెంటనే వారు గుడ్ మార్నింగ్ .. హౌఆర్‌యు మేడమ్ అని అనగానే ఎంతో సంతోషంగా ఉంటుంది.
- పేడాడ గౌతమి, ఎస్‌ఏ ఇంగ్లీష్ , జీటీడబ్ల్యూజీఏజీహెచ్‌ఎస్, బడ్డుమాసంగి, పాలకొండ మడలం
==============================================
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 578 మందికి పోస్టింగ్
వైసీపీ సర్కారు ఐదేళ్ల పాలనలో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొట్టమొదటిసారిగా డీఎస్సీ ఫైల్‌పై సంతకం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 16 వేల ఉపాధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. 150 రోజుల్లో డీఎస్సీ ప్రక్రియ పూర్తి చేసి ఎంపికైన వారికి పోస్టింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని 34 మండలాల్లో అన్ని మేనేజ్ మెంట్‌ల్లో 578 మంది గత ఏడాది అక్టోబరు 13న విధుల్లో చేరారు. ఎన్నో ఏళ్ల శ్రమతో సాధించుకున్న కొలువులో ఆనందంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 266 ఎస్జీటీలు, పాఠశాల సహాయకుల విభాగంలో సోషల్ స్టడీస్ 67, ఫిజిక్స్ 56, బయాలజీ 36, గణితం 33, తెలుగు 14, హిందీ 14, ఆంగ్లం 30, ఫిజికల్ డైరెక్టర్ 62 పోస్టులకు సంబంధించి అప్పట్లో కొత్త గురువులకు పాఠశాలలను కేటాయించారు. మన్యంలో జిల్లాలో గతేడాది కొత్తగా 200 మంది ఉపాధ్యాయులు విధుల్లో చేరారు.