Share News

గ్రామం ఒకటే.. మండలాలు వేరు

ABN , Publish Date - Nov 22 , 2026 | 12:00 AM

One Village, Different Mandals జియ్యమ్మవలస మండలంలో ఆ రెండు గ్రామాల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కో గ్రామం రెండు మండలాల పరిధిలో ఉండడంతో ఆ ప్రాంతవాసులు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక మండలం నుంచి ఆ గ్రామాల ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, మరో మండలంలో ఓట్లు వేయాల్సి వస్తుంది.

 గ్రామం ఒకటే.. మండలాలు వేరు
రెండు మండలాల మధ్య ఉన్న గిరిజన గ్రామం లక్ష్మీపేట

  • ఇదీ లక్ష్మీపేట, పెదబుడ్డిడి గదబవలస గ్రామాల పరిస్థితి

జియ్యమ్మవలస, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలంలో ఆ రెండు గ్రామాల పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది. ఒక్కో గ్రామం రెండు మండలాల పరిధిలో ఉండడంతో ఆ ప్రాంతవాసులు ఇబ్బందులు తప్పడం లేదు. ఒక మండలం నుంచి ఆ గ్రామాల ప్రజలకు సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, మరో మండలంలో ఓట్లు వేయాల్సి వస్తుంది. తమను పూర్తిస్థాయిలో ఒకే మండలానికి పరిమితం చేయాలని మొర పెట్టుకున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదీ లక్ష్మీపేట, పెదబుడ్డిడి గదబవలస గ్రామాల పరిస్థితి.

లక్ష్మీపేట..

జియ్యమ్మవలస మండలం తాళ్లడుమ్మ పంచాయతీలో తాళ్లడుమ్మ, దాసరిపేట, చంద్రశేఖర రాజపురం (పాత్రునివలస), రావాడ గ్రామాలతో పాటు లక్ష్మీపేట గ్రామం ఉంది. లక్ష్మీపేటకు జియ్యమ్మవలస మండలం నుంచే అన్ని సంక్షేమ పథకాలు, రెవెన్యూ సేవలు అందుతున్నాయి. కానీ, లక్ష్మీపేట గ్రామస్థుల ఓట్లు మాత్రం కురుపాం మండలం పొడి పంచాయతీలో ఉన్నాయి. ఆ పంచాయతీకి చేరుకోవాలంటే వారు దాదాపు 18 కిలో మీటర్లు చుట్టూ తిరిగి వెళ్లాల్సిందే. అదే షార్ట్‌ కట్‌ రూట్‌లో అయితే వట్టిగెడ్డ రిజర్వాయర్‌కు వరద నీరు వచ్చే ప్రాంతం దాటి దాదాపు ఏడు కిలో మీటర్లు కాలినడకన వెళ్లాల్సిన దుస్థితి. ఎన్నికల సమయంలో ఓట్లేసేందుకు తాము ఇబ్బందులు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. తమ గ్రామాన్ని జియ్యమ్మవలస మండలంలో పూర్తిస్థాయిలో కలిపేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పెదబుడ్డిడి గదబవలస..

పెదబుడ్డిడి గదబవలస గ్రామం మధ్యలో నీటి పారుదలశాఖ పిల్ల కాలువ ఉంది. దీంతో గ్రామంలోని ఒక భాగం జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడి పంచాయతీలో ఉంటే, ఇంకోభాగం గరుగుబిల్లి మండలం లఖనాపురం పంచాయతీలో ఉంది. ఈ గ్రామ జనాభా 150 వరకు ఉంటారు. ఓట్లు సగం పెదబుడ్డిడి పంచాయతీలో, మిగతా సగం లఖనాపురం పంచాయతీలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోపక్క ఏ సంక్షేమ పథకం అందాలన్నా వీరికి ఇబ్బందే. అధికారులు వచ్చి వీరు ఏ ప్రాంతంలో ఉన్నారో విచారణ చేపట్టిన తరువాతే పథకాలు అందించే పరిస్థితి ఉంది. ఒకే మండలంలో తమను కొనసాగించాలని ఏళ్ల తరబడి మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన చెందుతున్నారు. ఇకనైనా న్యాయం చేయాలని కోరుతున్నారు.

అన్నీ మా పంచాయతీ నుంచే

లక్ష్మీపేట గ్రామస్థులకు పథకాలన్నీ తాళ్లడుమ్మ పంచాయతీ నుంచే అందుతున్నాయి. కేవలం ఓటు వేయడానికి మాత్రం కురుపాం మండలం పొడి పంచాయతీకి వెళ్తున్నారు. అందుకే ఆ గ్రామాన్ని తాళ్లడుమ్మ పంచాయతీలోకి మార్చాలి.

-సింగారపు మాణికేశ్వరరావు, తాళ్లడుమ్మ పంచాయతీ పెద్ద

========================

జియ్యమ్మవలసలో కలపాలి

లక్ష్మీపురం గ్రామాన్ని జియ్యమ్మవలస మండలంలో కలపాలి. కేవలం ఓటు వేయడం కోసం ఐదేళ్లకొకసారి సుదూర ప్రాంతంలో ఉన్న కురుపాం మండలం పొడి పంచాయతీ కేంద్రానికి వెళ్లాల్సి రావడం దారుణం.

-ఆరిక చంద్రశేఖర్‌, జిల్లా అధ్యక్షుడు, గిరిజనాభ్యుదయ సంఘం

Updated Date - Nov 22 , 2026 | 12:00 AM