ఒకరు సరెండర్.. మరొకరు బదిలీ!
ABN , Publish Date - Sep 25 , 2026 | 12:01 AM
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులను ఉద్యాన, లాభదాయక పంటల వైపు ప్రోత్సహించాల్సిన కీలక అధికారులు కరువయ్యారు.
పార్వతీపురం ఐటీడీఏలో ఆ రెండు పోస్టులు ఖాళీ
ఖాళీగా పీఏవో, పీహెచ్‌వో అధికారుల కుర్చీలు
ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్న వైనం
పార్వతీపురం, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో గిరిజన రైతులను ఉద్యాన, లాభదాయక పంటల వైపు ప్రోత్సహించాల్సిన కీలక అధికారులు కరువయ్యారు. అగ్రికల్చర్ , హార్టికల్చర్ అధికారుల పోస్టులు ఖాళీగానే ఉన్నా.. వాటి భర్తీకి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. మరోవైపు ఇన్‌చార్జి అధికారులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్లారో తెలియని పరిస్థితి నెలకొంది. ఐటీడీఏ ఉద్యాన శాఖ అధికారిగా పనిచేసిన మణిభూషణ్‌ను ఇటీవల మాతృశాఖకు సరెండర్ చేశారు. దీంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇప్పటివరకు ఎవరినీ నియమిం చలేదు. ప్రస్తుతం జిల్లా ఉద్యాన శాఖాధికారి సత్యనారాయణరెడ్డి, ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తు న్నారు. ఇక పార్వతీపురం ఐటీడీఏలో అగ్రికల్చర్ అధికారి బదిలీపై వెళ్లిపోయి చాలాకాలం అవుతుంది. కానీ ఇంతవరకు ఆ పోస్టును భర్తీ చేయలేదు. ఇన్‌చార్జిగా గుమ్మలక్ష్మీపురం మండల వ్యవసాయాధికారి శంకరరావు విధులు నిర్వహి స్తున్నారు. ఏవోగా ఉన్న ఆయన ఐటీడీఏకు వచ్చేందుకు వీలు లేని పరిస్థితి ఏర్పడింది. మొత్తంగా గిరిజన ప్రాంతాల్లో రైతులకు పంటల సాగుపై సలహా, సూచనలు ఇచ్చే అధికారులు కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.