Share News

One step at a timeఒక్కో అడుగు ముందుకు

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:12 AM

One step at a time కూటమి పాలనపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో సంతృప్తి భావన కనిపిస్తోంది. అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పాత ప్రాజెక్టులకు కదలిక వస్తోంది. కొత్త పరిశ్రమల రాక మొదలైంది. అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి రెండేళ్లు అవుతోంది.

One step at a timeఒక్కో అడుగు ముందుకు

ఒక్కో అడుగు ముందుకు

జిల్లాలో గాడిన పడుతున్న ప్రాజెక్టులు

రహదారులకు మోక్షం

కొత్త పరిశ్రమలకు ఆహ్వానం

సంక్షేమ పథకాలకూ ప్రాధాన్యం

చివరిదశకు భోగాపురం ఎయిర్‌పోర్టు పనులు

కూటమి పాలనపై ఇప్పుడిప్పుడే ప్రజల్లో సంతృప్తి భావన కనిపిస్తోంది. అభివృద్ధి పనులు వేగవంతం అవుతున్నాయి. సంక్షేమ పథకాలు అందుతున్నాయి. పాత ప్రాజెక్టులకు కదలిక వస్తోంది. కొత్త పరిశ్రమల రాక మొదలైంది. అధికారంలోకి వచ్చి శుక్రవారం నాటికి రెండేళ్లు అవుతోంది. తొలి అడుగు పింఛన్ల పెంపుతో మొదలై అందరినీ ఆకట్టుకుంది. ఆ నిర్ణయంతో భరోసాగా నిలుస్తుందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగింది. ఆపై ఒక్కో ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. పారిశ్రామిక పార్కులకు శంకుస్థాపనలు జరుగుతుండడంతో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. పారాది వద్ద వేగావతి నదిపై చేపట్టిన వంతెన నిర్మాణం చివరి దశకు చేరింది. కీలకమైన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు పూర్తి కావొస్తుండడం శుభ పరిణామం. విజయనగరంలో గురజాడ స్వగృహం అభివృద్ధికి రూ 1.20 కోట్లు నిధులు మంజూరు కావడం కొసమెరుపు.

విజయనగరం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా ఇప్పుడిప్పుడే ఒక్కో అడుగు పడుతోంది. అన్ని వర్గాల మదిలో కొత్త ఆశలు రేకెత్తుతున్నాయి. 2024 జూన్‌ 4న వచ్చిన ఫలితాల్లో కూటమి ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఏకపక్ష విజయం సొంతం చేసుకుంది. 175 స్థానాలకుగాను 164 చోట్ల విజయకేతనం ఎగురవేసింది. అదే నెల 12న ప్రభుత్వం కొలువుదీరింది. ఈ రెండేళ్లలో జిల్లాలో అభివృద్ధి పనులు మొదలయ్యాయి. అవి ఇప్పుడే పుంజుకుంటున్నాయి. అదే స్థాయిలో సంక్షేమ పథకాలకు సైతం ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత పింఛన్‌ మొత్తాన్ని పెంచి మూడు నెలల బకాయితో అందించింది. గత ఏడాది జూలైలో స్పౌజ్‌ కోటా కింద 3523 మందికి పింఛన్లు మంజూరు చేసింది. 2023 డిసెంబరు తరువాత చనిపోయిన వారందరికీ అందిస్తూ వచ్చింది. గత ఏడాది జూన్‌ 12న తల్లికి వందనం పథకం అమలుచేశారు. జిల్లాలో 1820 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన 1,94,921 మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద రూ.13 వేలు చొప్పున అందించారు. ఈ ఏడాది కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 2024 దీపావళి నుంచి మూడు ఉచిత గ్యాస్‌ సిలెండర్లు అందిస్తోంది. రెండో ఏడాది కూడా మూడు సిలిండర్లు (4,36,690 కుటుంబాలకు) చొప్పున ఉచితంగా అందించారు. ఇందుకుగాను రూ.65.24 కోట్ల సబ్సిడీ జమ చేశారు. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2,27,700 మంది రైతుల ఖాతాల్లో రూ.14 వేలు చొప్పున రూ.152 కోట్లు అందించారు. గత ఏడాది ఆగస్టు 15న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైంది. ఏడాది కాలంలో 10 లక్షల మంది మహిళలు ఉచిత ప్రయాణ పథకాన్ని వినియోగించుకున్నారు. వివాదాస్పదమైన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టును మార్చింది. రోడ్ల మరమ్మతులకు పూనుకుంది. గోతులను పూడ్చింది. కొత్త రహదారులకు ప్రతిపాదనలు వేసింది. సాగునీటి వనరులపై దృష్టిపెట్టింది. ఐదేళ్ల పాటు నిర్లక్ష్యానికి గురై సాగునీటిరంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేసింది. ఇలా అన్నిరంగాలపై దృష్టిపెట్టింది. అందుకే కూటమి రెండేళ్ల పాలనపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది.

- జిల్లాలో పోలీసుల పనితీరు మెరుగుపడింది. గంజాయి, పశుమాంసం, మాగజీవాల అక్రమ రవణాకు అడ్డకట్టవేశారు. రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్‌ ప్రయోగించి జైలుకు పంపారు. జిల్లాలో 28మంది ప్రమాదకరమైన వ్యక్తులను గుర్తించి వారిపై షీట్లు ఓపెన్‌చేశారు. డ్రోన్‌ కెమెరాలతో గస్తీ నిర్వహించి నేరస్తులను పట్టుకుంటున్నారు. అయితే పోలీస్‌ శాఖకు కొంతమంది అవినీతి అధికారులతో మచ్చవాటిల్లుతోంది.

- రాజాం నియోజకవర్గంలోని దాదాపు రూ.200 కోట్లతో అన్ని గ్రామాలకు పూర్తిస్థాయిలో తాగునీరు సదుపాయం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. రేగిడి మండలం ఉంగరాడ మెట్టవద్ద 15 ఏకరాల విస్తీర్ణంలో రూ 4.20 కోట్లతో ఎంఎస్‌ఎంఈ పార్కుకు శంకుస్థాపన జరిగింది. నారాయణపురం ఆనకట్టు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. పనులు చేపడ్తే సుమారు 5000 ఎకరాలకు పైగా సాగునీరు అందుతుంది.

- ఎస్‌.కోట నియోజకవర్గంలో రూ.956 కోట్లతో పెందుర్తి నుంచి బొడ్డవర వరకూ 516బి కింద జాతీయ రహదారి విస్తరణ పనులు జరగాల్సి ఉంది. నియోజకవర్గంలో రూ.300 కోట్లతో సిసి రోడ్లు, కాలువలు, బ్రిడ్జిలు వంటి అభివృద్ది పనులు చేపట్టారు. ఎస్‌.కోట ప్రాంతీయ ఆసుపత్రిలో 10 బెడ్లతో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ పాఠశాలను ఈ ఏడాదినుంచి కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేసింది. దేవదాయ ధర్మాదయ శాఖ నుంచి రెండు రామాలయాలకు రూ.కోటి మంజూరు చేసింది. ఎస్‌.కోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాలికల వసతిగృహానికి రూ.6 కోట్లతో పనులు జరుగుతున్నాయి. తాటిపూడి ఫైలట్‌ ప్రాజెక్టు విస్తరణకు రూ.90 కోట్లతో పనులు జరగనున్నాయి.

- బొబ్బిలి నియోజకవర్గంలోని రూ 10 కోట్లతో పారాది వద్ద వేగావతి నదిపై వంతన నిర్మాణం చివరి దశకు వచ్చింది. ఈ వంతెన పూర్తి అయితే విజయనగరం -బొబ్బిలి , పార్వతీపురం , ఒడిషా, చత్వీస్‌ఘఢ్‌ తదితర ప్రాంతాలకు ప్రయాణించేందుకు వీలుగా ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వారధి పనులు వేగవంతం అయ్యాయి. బొబ్బిలి వీణ తయారీ దారులకు పనసకలప మంజూరు అయ్యింది. బొబ్బిలి సీహెచ్‌సీ వందపడకల ఆసుపత్రిగా ఆప్‌గ్రేడ్‌ కావాల్సి ఉంది.లోచర్ల , శివడవలస ఎత్తిపోతల పథకం ప్రారంభం కావాల్సిఉంది ఈపోజక్టు త్వరితగతిన పూర్తిచెయ్యాలని స్థానిక రైతులు కోరుతున్నారు. ముఖ్యంగా బొబ్బిలి పట్టణంలో రోడ్లు అస్థవ్యస్థంగా మారాయి. త్వరితగతిన పూర్తిచెయ్యాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

- గజపతినగరం నియోజకవర్గం బొండపల్లి మండలం కనిమెరక వద్ద ప్లైఒవర్‌ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. ఇందుకు సంబందించి రూ.46 కోట్లు మంజూరయ్యాయి. గత టీడీపీ హయాంలో మినీ రిజర్వాయర్‌ వెదురు వాడ వద్ద నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు. నేటికీ పనులు చేపట్టలేదు. మరుపల్లి గ్రామంలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసినా పనులు ప్రారంభం కాలేదు. పట్రువాడ గ్రామం వద్ద మినీ వంతెన ఏర్పాటుకు రూ.5కోట్లు మంజూరైనా పనులుకాలేదు. దత్తిరాజేరు మండలంలోని సారవగెడ్డ పనులకు సంబంధించి 27 కోట్లు నిధులు మంజూరుకు గత ఏడాది అక్డోబర్‌లో సిఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇంకా పనులు చేపట్టలేదు. గంట్యాడ మండలంలోని గింజేరు వద్ద కొండపల్లి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి గత టీడీపీ హయంలో శంకుస్థాపన చేశారు. వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విడిచి పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

- విజయనగరం నియెజకవర్గానికి సంబంధించి గురజాడ స్వగృహం అభివృద్ధికి రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. ఆనందగజపతి ఆడిటోరియం ఆధునికీకరణకు విఎంఆర్‌డిఎ ద్వారా కృషి చేస్తున్నారు. నగరాభివృద్ధికి ఈ మధ్యకాలంలో విఎంఆర్‌డీఎ రూ.10 కోట్లు కేటాయించింది. కాగా కెఎల్‌ పురం వంటి ప్రాంతాలకు మంచినీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో అక్రమ నిర్మాణాలను అరికట్టటంలో అధికారులు విఫలమవుతున్నారు.

- నెల్లిమర్ల నియోజవర్గంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారనుంది. ఇది మినహా భోగపురం మండలంలో ఇతర రంగాల్లో అభివృద్ధి లేదు. తారకరామ తీర్ధసాగర్‌ నిర్మాణం ఇంకా సాగుతునే ఉంది. రామతీర్ధం గిరి ప్రదర్శనకు ఇబ్బందులు లేకుండా రూ.4 కోట్లతో బోడికొండ చుట్టూ రోడ్డును నిర్మించడంతో భక్తులు ఊరట చెందారు. నెల్లిమర్ల మండల కేంద్రంలో రూ.2 కోట్లతో తాగునీటిని అందించేందుకు పనులు జరుగుతున్నాయి. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో సగం పనులే కొలిక్కి వచ్చాయి.

- చీపురుపల్లి నియోజవర్గంలో చీపురుపల్లి - శ్రీకాకుళం రైల్వేవంతెన ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఈ నియోజక వర్గంలో ప్రతీ మారుమూల గ్రామాలకు కూటమి ప్రభుత్వం రహదారి సౌకర్యం కల్పించింది. చీపురుపల్లిలో గతంలో సేవలందించిన ఆర్‌ఈసీఎస్‌ సంస్థ పునరుద్ధరణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ఇంకా నెరవేరలేదు. తోటపల్లి కుడి ప్రధాన కాలువలో పూడిక తీత, లైనింగ్‌ పనులు వంటి సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి.

--------------------------

Updated Date - Jun 12 , 2026 | 12:12 AM