ఒక్కో పనికి ఒక్కోరేటు!
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:44 PM
జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి జాఢ్యం ఎక్కువైందనే విమర్శలు ఉన్నాయి.
- ఉద్యోగోన్నతి కావాలంటే రూ.50వేలు..?
- మెడికల్ లీవు కోసం రూ.20వేలు?
- చక్కబెడుతున్న కొందరు సిబ్బంది
- ఇదీ జిల్లా వైద్యఆరోగ్యశాఖలో పరిస్థితి
విజయనగరం రింగురోడ్డు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో అవినీతి జాఢ్యం ఎక్కువైందనే విమర్శలు ఉన్నాయి. ఇక్కడ పోస్టింగు ఇవ్వాలన్నా.. సెలవు కావాలన్నా.. దస్త్రం కదలాలన్నా.. ముట్టజెప్పాల్సిందేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదంతా బయట వ్యక్తులకు అనుకుంటే పొరబడినట్లే. సొంతశాఖలోని ఉద్యోగులే బాధితులు. బేరం కుదిర్చేది.. మాట్లాడేదీ.. అంతా ఓ ముఖ్య అధికారి వద్ద పీఏలు మాదిరిగా వ్యవహరించే ఇద్దరు సిబ్బంది అన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి పనికీ ఒక రేటు.. పనిని అనుసరించి కరెన్సీ బరువు పెంచాల్సిందే.
- వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లకు మంచి డిమాండ్ ఉంటుంది. కొందరు ఉద్యోగులు జిల్లా శాఖ కార్యాలయంలో ఉండిపోవాలనుకుంటారు. మరికొందరు పరిస్థితులను అనుసరించి పీహెచ్‌సీలకు బదిలీ ఆశిస్తారు. దీనికోసం అధికారులకు ముట్టచెబితే చాలు.. నచ్చిన చోటకు పోస్టింగ్ ఇప్పించుకోవచ్చుననే విమర్శలు ఉన్నాయి. ఎస్‌ఆర్ ఎంట్రీ, పెన్షన్, మెటర్నటీ లీవ్, మెడికల్ లీవ్, పే సర్టిఫికెట్, ఏసీఆర్.. ఇలా ఒక్కొక్క పనికి ఒక ధర ఉంటుంది. డబ్బులిస్తేనే ఆ దస్త్రం ముందుకు కదులుతుంది. లేకుంటే ఎన్నాళ్లైనా అక్కడే మగ్గిపోతుందని సొంత శాఖలోనే ఉద్యోగులే వాపోతున్నారు. ఇటీవల పబ్లిక్ హెల్త్ నర్సు (పీహెచ్‌ఎన్)లకు టీహెచ్‌వోలుగా ఉద్యోగోన్నతికి సంబంధించి ఏసీఆర్ పంపించాలని ఆ శాఖ ఉన్నతాధికారులు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖను కోరారు. ఈ విభాగంలో ఉద్యోగోన్నతి జాబితాలో 12 మంది వరకూ ఉన్నారు. వీరికి ఏసీఆర్ పంపించడంలో అంతులేని జాప్యం జరిగింది. దీనికి కారణం ఆ శాఖలోని ఓ ఉద్యోగి పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడమే అని సమాచారం. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న వైద్యులు పీజీలో చేరేందుకు లాస్ట్ పే సర్టిఫికెట్ కోసం కార్యాలయాన్ని సంప్రదిస్తున్నారు. ఆ సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా ఓ రేటు కట్టేసి వేధిస్తున్నట్టు పలువురు వైద్యులు వాపోతున్నారు. ఈ శాఖలో ఏదైనా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగు ఉద్యోగం పడితే రూ 3 లక్షల నుంచి 5 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు, సిఫారసు లేఖలు తెచ్చిన వారికి పోస్టింగులు ఇచ్చేందుకు మెరిట్ జాబితాను సైతం తారుమారు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.
- ఉద్యోగోన్నతి కావాలంటే రూ.20 వేల నుంచి 50 వేలు, డిప్యూటేషన్ కోసం రూ.30 వేలు, ఎస్‌ఆర్ ఎంట్రీకి రూ.5 వేలు, మెడికల్ లీవుకి రూ.20 వేలు, మెటర్నటీ లీవుకు రూ.10 వేలు, ఏసీఆర్‌కు రూ.10 వేలు, కారుణ్య నియామకాలకు రూ.50 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.
- కొత్తగా ఆసుపత్రులు, స్కానింగ్, మెడికల్ షాపులు ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకున్న వారి నుంచి కూడా రూ.వేలల్లో గుంజేస్తున్నారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 50 పీహెచ్‌సీలు ఉన్నాయి. వీటి పరిధిలో 100 మంది వరకూ వైద్యులు పనిచేస్తున్నారు. సుమారు 500 మంది ఏఎన్‌ఎంలు, 100 స్టాఫ్ నర్సులు, ఎఫ్‌ఎన్‌ఓలు 50 మంది ఇతర సిబ్బంది 300 మంది వరకూ పనిచేస్తున్నారు. అయితే, కొంతమంది అధికారుల నుంచి సిబ్బంది వరకూ మామూళ్ల మత్తుకు అలవాటు పడ్డారన్న విమర్శలు ఉన్నాయి.
నా దృష్టికి రాలేదు
పని కోసం సిబ్బంది డబ్బులు అడుగుతున్నారన్న విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై ఆరా తీస్తాం. విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఏ పనికి కూడా నిబంధనలకు వ్యతిరేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒక వేళ ఎవరైనా డబ్బులు అడిగితే, నా దృష్టికి తీసుకురండి.
-డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌వో, విజయనగరం