ఒకరి అవయవదానం.. నలుగురికి పునర్జన్మ: పల్లవి కుటుంబం గొప్ప నిర్ణయం
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:43 PM
One person's donation... saves four lives. గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ, దేవి దంపతులు తన చిన్న కుమార్తె పల్లవి(13)తో కలిసి ఏడాదిన్నర క్రితం ప్రయాణం చేస్తుండగా వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. పల్లవి ఆవయవాలను దానం చేస్తే మరో నలుగురికి జీవితాన్ని ఇచ్చినవారవుతారని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు.
ఒకరి దానం.. నలుగురికి ప్రాణం
అపోహలు వీడి అవయవదానం చేయాలంటున్న వైద్య నిపుణులు
ఇప్పుడిప్పుడే పెరుగుతున్న అవగాహన
జీవన్‌దాన్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచిస్తున్న వైద్యులు
నేడు అవయవదాన దినోత్సవం
విజయనగరం కలెక్టరేట్/ రింగురోడ్డు, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి):
- గంట్యాడ మండలం మురపాక గ్రామానికి చెందిన గండి వెంకటరమణ, దేవి దంపతులు తన చిన్న కుమార్తె పల్లవి(13)తో కలిసి ఏడాదిన్నర క్రితం ప్రయాణం చేస్తుండగా వారి ద్విచక్ర వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. పాప బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గుర్తించారు. పల్లవి ఆవయవాలను దానం చేస్తే మరో నలుగురికి జీవితాన్ని ఇచ్చినవారవుతారని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. పల్లవి కిడ్నీలు, నేత్రాలు అంబులెన్స్‌లో విశాఖపట్నం ఆసుపత్రులకు తరలించారు.
- నగరంలోని కేఎల్‌పురం ఎస్సీ, ఎస్టీ కాలనీకి చెందిన సిగడం అదినారాయణ (56) గత నెల తీవ్రమైన హెమరేజ్ స్ర్టోక్ గురికావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు అవదాయదానంపై ఆదినారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించడంతో వారు అంగీకారం తెలిపారు. దీంతో వైద్యులు గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి అదినారాయణ కిడ్నీలు, కార్నియాలను అంబులెన్స్ ద్వారా విశాఖపట్నానికి తరలించారు.
- పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండలం కొత్తవలస గ్రామానికి చెందిన లంకేన సాయికుమార్ రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయలయ్యాయి. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. వైద్యులు అవయవదానంపై మృతుడి తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి అంగీకారంతో గ్రీన్ చానల్ ఏర్పాటు చేసి సాయికుమార్ కాలేయం, మూత్ర పిండాలు, ఊపిరితిత్తులను పొరుగున ఉన్న విశాఖ జిల్లాకు తరలించారు.
వీరే కాదు జిల్లాలోని అవయవదానంపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తోంది. గతం కంటే మెరుగ్గా అవయవదానం చేసేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు వివిధ కారణాలతో అవయవాలు కోల్పోయిన వారి సంఖ్య కూడా పెరుగుతోంది. బాధితులు తమ పేర్లను జీవన్‌దాన్ పోర్టల్‌లో నమోదు చేసుకుంటున్నారు. అయితే అవయవ మార్పిడి కోసం ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్నారు. దాతలు ముందుకు రాకపోవడంతో సమాయానికి అవయవాలు అందక అనేక మంది ప్రాణాలు విడుస్తున్నారు. అపోహలు, మూఢనమ్మకాలు, పునర్జన్మ భావనలు ఇతర కారణాలతో చాలా మంది అవయవదానికి ముందుకు రావడానికి సంకోచిస్తున్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
అవయవదానంతో జీవదాతలుగా నిలిచిన వారి పార్థివ దేహాలకు గౌరవ ప్రథమైన వీడ్కోలు తెలిపాలని, వారి అంతిమ యాత్రను రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవయవదానం చేసిన కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనున్నారు. కుటుంబ సభ్యులను గౌరవిస్తూ వారికి ప్రశంసాపత్రం, పుష్పగుచ్చాలతో ప్రభుత్వం సత్కరిస్తుంది. ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించే అంతిమ సంస్కాలకు కలెక్టరు, లేదా జిల్లా స్థాయి సీనియర్ అధికారి వెళ్లాల్సి ఉంటుంది.
సమయమే కీలకం
అవయవ సేకరణ జరిగిన తర్వాత అత్యంత వేగంగా బాధితులకు అమర్చడంపైనే ప్రాణాలు ఆధారపడి ఉంటాయి. దేహంలో నుంచి తీసిన గుండె, ఊపిరితిత్తులు 4 నుంచి 6 గంటల వ్యవధిలో శస్త్రచికిత్స ద్వారా మరొకరికి అమర్చాల్సి ఉంటుంది. కాలేయానికి 12 నుంచి 15 గంటలు, క్లోమానికి 12 నుంచి 18 గంటలు సమయం లభిస్తుంది. కిడ్నీలను 24 నుంచి 36 గంటల వరకూ భద్రపరిచి మార్పిడి చేసే వీలుంది. ఇక సేకరించిన కళ్లను ప్రత్యేక నిల్వ ద్రవంలో భద్రపరిచి 14 రోజుల వ్యవధిలో బాఽధితులకు అమర్చి దృష్టిని ప్రసాదించవచ్చు,
జీవన్‌దాన్‌లో నమోదు చేసుకోవాలి
పునర్జన్మ అనేది అవయవదానంతోనే సాధ్యం. మనహృదయ స్పందన ఇంకొకరి గుండెల్లో కొట్టుకుంటుంది. మన నేత్రాలు వేరొకరికి కళ్లల్లో వెలుగు నింపి ప్రపంచాన్ని చూపిస్తాయి. అవయవదానంపై ప్రస్తుత సమాజంలో ఎన్నో అపోహలు నెలకొన్నాయి. వాటిని వీడాలి. జీవన్‌దాన్ కార్యక్రమం 2014లో ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అవయవదానానికి ముందుకు వచ్చే వారు జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో తమ పేర్లును నమోదు చేసుకోవచ్చు.
- డాక్టరు జీవనరాణి, జిల్లా వైద్యాధికారి
స్వచ్ఛందంగా ముందుకు రావాలి
దేహాన్ని మట్టిలో కలపడమో, బూడిద చేయడమో కాదు. మరొకరి శరీరంలో సజీవంగా నిలపడమే అసలైన మానవత్వం. బ్రెయిన్ డెడ్ సమయంలో అవయవదానానికి ముందుకొచ్చే ప్రతి కుటుంబం సమాజానికి ఆదర్శమే. మరణాన్ని సైతం జయించి ఇంకొకరికి పునర్జన్మనిచ్చే ఈ పవిత్ర కార్యక్రమంపై ప్రజల్లో ఉన్న అపోహలు, మూఢ నమ్మకాలు తొలగాలి.
గెద్ద చిరంజీవి, అధ్యక్షుడు, అఖిల భారత శరీర అవయవ దాతల సంఘం, విజయనగరం
అవయవదానంతో గుర్తింపు వచ్చింది
మా కుమార్తె అవయవదానం చేయడంతో తల్లిదండ్రులుగా మాకు గుర్తింపు వచ్చింది. కుమార్తె తమ మధ్య లేకపోయినా నలుగురికి ప్రాణం పోసి సజీవంగా ఉంది. అవయవదానంపై ప్రజలంతా అపోహలను వీడాలి.
గండి వెంకటరమణ, పల్లవి తండ్రి
--------------------------