రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ABN , Publish Date - Apr 05 , 2026 | 12:13 AM
మండలంలోని వెదుళ్లపాలెం హైవే జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారని ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు.
ఐదుగురికి గాయాలు
నక్కపల్లి, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వెదుళ్లపాలెం హైవే జంక్షన్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురు గాయపడ్డారని ఎస్‌ఐ సన్నిబాబు తెలిపారు. దీనికి సంబంధించి శనివా రం ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం గింజేరి గ్రామానికి చెందిన పది మంది వ్యాన్‌లో ఒంగోలులో జరిగిన ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా, వెదుళ్లపాలెం వద్ద ప్రమాదానికి గురయ్యారు. వెదుళ్లపాలెం హైవే జంక్షన్ సమీపాన రోడ్డుపక్కన ఆగివున్న లారీని వ్యాన్ ఢీకొనడంతో వ్యాన్ ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ పక్కన కూర్చొన్న గింజేరి గ్రామానికి చెందిన రాజాన రామ్మూర్తి (60) అక్కడికక్కడే మృతిచెందారు. వ్యాన్‌లో ఉన్న దండుపాటి శాంతి(25), జుట్టాడ దేవి(45), మంతన దుర్గమ్మ(50), రాపర్తి రామలక్ష్మి(30), నానిపల్లి లక్ష్మి(35) గాయపడ్డారు. అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.