మూడు చోరీ కేసుల్లో ఒకరి అరెస్టు
ABN , Publish Date - Apr 08 , 2026 | 12:13 AM
కొత్తవలస కుమ్మరి వీధితోపాటు మరో రెండు దేవాలయాల్లో బంగారం, వెండి వస్తువుల చోరీకి సంబంధించి ఒక నిందితుడను అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు తెలిపారు.
రూ.17లక్షల విలువైన సొత్తు స్వాధీనం
పరారీలో మరో ఇద్దరు
కొత్తవలస, ఏప్రిల్ 7(ఆంధ్రజ్యోతి): కొత్తవలస కుమ్మరి వీధితోపాటు మరో రెండు దేవాలయాల్లో బంగారం, వెండి వస్తువుల చోరీకి సంబంధించి ఒక నిందితుడను అరెస్టు చేసి, చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నామని కొత్తవలస సీఐ షణ్ముఖరావు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం కొత్తవలస పోలీస్‌స్టేషన్‌లో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస కుమ్మరి వీధిలో నివాసం ఉంటున్న శ్రీకాకుళం శ్రీను అనే వ్యక్తి ఇంట్లో గత నెల 31న ఏడున్నర తులాల బంగారంతో పాటు 15 తులాల వెండి వస్తువులు చోరీకి గురైనట్టు శ్రీను కుమారుడు శేషు ఫిర్యాదు చేశారు. అలాగే గత సంవత్సరం డిసెంబర్ నెలలో మంగళపాలెం గ్రామానికి చెందిన శివాలయంతో పాటు జనవరి నెలలో కొత్తవలస దుర్గాదేవి ఆలయంలోనూ చోరీలు జరిగాయి. ఈచోరీలకు సంబంధించి కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేయగా.. ఈ దొంగతనాలకు పాల్పడింది కొత్తవలస ఎస్పీ కాలనీకి చెందిన మైలపల్లి సంతోష్‌కుమార్ అలియాస్ ఎర్నిబాబు అలియాస్ చేపలోడు అనే వ్యక్తిగా గుర్తించి, పోలీసులు పట్టుకున్నారు. అతడిని ప్రశ్నించగా తనతో పాటు మరో ఇద్దరు కలిసి ఈ చోరీలు చేసినట్టు నేరం అంగీకరించాడు. ఈ కుమ్మరి వీధిలో జరిగిన చోరీకి సంబంధించి ఏడున్నర తులాల బంగారు ఆభరణాలు, 15 తులాల వెండితో పాటు, ఆలయాల్లో చోరీకి సంబంధించి 90 గ్రాముల వెండి వస్తువులు, మరో రెండు తులాల బంగారు ఆభరణాలను నిందితుల నుంచి పోలీసులు రికవరీ చేశారు. ఈ చోరీ సొత్తు విలువ సుమారు రూ.17లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. అలాగే కొత్తవలస -సబ్బవరం రోడ్డులోని వైద్యుడు తెన్నేటి సుబ్బారావు ఇంట్లో జరిగిన దొంగతనంపై దర్యాప్తు ముమ్మరం చేశామని సీఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు జోగారావు, ప్రసాదరావు సిబ్బంది పాల్గొన్నారు.