Share News

అనుమానాస్పద మృతి కేసులో ఒకరి అరెస్టు

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:15 AM

తుమ్మికాపల్లి పంచాయతీ జనార్దన నగర్‌లో ఈ ఏడాది జనవరి 28న ఒక వ్యక్తి అనుమానాస్పద మృతికి సంబంధించి కంచరాన అశోక్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్టు సీఐ షణ్ముఖరావు శుక్ర వారం తెలిపారు.

అనుమానాస్పద మృతి కేసులో ఒకరి అరెస్టు

కొత్తవలస, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): తుమ్మికాపల్లి పంచాయతీ జనార్దన నగర్‌లో ఈ ఏడాది జనవరి 28న ఒక వ్యక్తి అనుమానాస్పద మృతికి సంబంధించి కంచరాన అశోక్‌కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్టు సీఐ షణ్ముఖరావు శుక్ర వారం తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తవలస పంచాయతీ రాజపాత్రునిపాలెం గ్రామానికి చెందిన వానపల్లి సోమేశ్వరరావు, తుమ్మికాపల్లి జనార్దననగర్‌లోని అపార్టుమెంట్‌లో నివాసం ఉంటున్న కంచరాన అశోక్‌కుమార్‌ ఇద్దరూ స్నేహితులు. వీరిద్దరూ తరచూ కలుసుకోవడం.. మద్యం తాగడం చేస్తూ ఉండేవారు. సోమేశ్వరరావు ఎప్పుడైనా పనికి వెళ్లి ఆలస్యమైతే ఇంటికి వెళ్లకుండా జనార్దననగర్‌లోని అశోక్‌కుమార్‌ అపార్టుమెంట్‌కు వెళ్లి అక్కడే ఉండిపోయేవాడు. ఈక్రమంలో జనవరి 27వ తేదీన సోమేశ్వరరావు.. అశోక్‌కుమార్‌ ఇంటికి వెళ్లాడు. అయితే అశోక్‌కుమార్‌.. సోమేశ్వరరావును చేతులతో కొట్టి, అపార్టుమెంట్‌ మెట్లపై నుంచి సెల్లార్‌లోకి తోసేశాడు. దీంతో సోమేశ్వరరావు తలకు బలమైన గాయాలయ్యాయి. అలాగే అక్కడ నుంచి గేట్‌ బయటకు బలంగా తోసేయడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. చనిపోయిన సోమేశ్వరరావును అదేరోజు తన ఇంటిలోకి అశోక్‌కుమార్‌ తీసుకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం రాజపాత్రునిపాలెం గ్రామానికి వెళ్లి, సోమేశ్వరరావు మృతిచెందినట్టు అతని సొదరుడు నరసింహమూర్తికి తెలియజేశాడు. అపార్టుమెంట్‌కు వచ్చిన నరసింహమూర్తి.. సోమేశ్వరరావు మృతిపై అనుమానాలు ఉన్నట్టు అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదులో పోలీసులు లోతైన దర్యాప్తు జరిపి అపార్టుమెంట్‌లోనున్న సీసీ కెమెరాలు, మెడికల్‌ రిపోర్టులు ఆధారంగా సోమేశ్వరరావు మృతికి కంచరాన అశోక్‌కుమార్‌ కారణమని నిర్దారణకు వచ్చారు. ఈ మేరకు శుక్రవారం అశోక్‌కుమార్‌ను అరెస్టు చేసి, కొత్తవలస కోర్టులో హాజరు పర్చారు. నిందితునికి 14 రోజుల పాటు జుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు.

Updated Date - Apr 11 , 2026 | 12:15 AM