One and a half kg of gold was stolen కేజీన్నర బంగారం చోరీ
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:11 AM
One and a half kg of gold was stolen రాజాం చరిత్రలో ఆదివారం రాత్రి అతిపెద్ద చోరీ జరిగింది. ఒకే ప్రాంగణంలో రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో రెండు ప్లాట్లలో దొంగలు లూఠీకి పాల్పడ్డారు. ఎంతో చాకచక్యంగా మెయిన్‌డోర్ తలుపు గడియను కట్‌చేసి ఇంట్లోకి చొరబడి బీరువాలను బద్దలుకొట్టి దొరికిన మేర దోచుకున్నారు. బంగారు ఆభరణాల బాక్సులు, వస్ర్తాలను చిందరవందరగా పడవేశారు. ఎక్కడా ఆనవాళ్ళు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు.
కేజీన్నర బంగారం చోరీ
రాజాంలో రెండు చోట్ల భారీ దొంగతనాలు
వైద్యుడి ఇంట్లో 1250 గ్రాముల బంగారం, కిలో వెండి
ప్రొఫెసర్ ఇంట్లో 25 తులాల బంగారం అపహరణ
చోరీ సొత్తు విలువ రూ.3 కోట్లు ఉంటుందని అంచనా
దొంగల్ని పట్టుకుంటాం: ఎస్పీ దామోదర్
రాజాం రూరల్, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): రాజాం చరిత్రలో ఆదివారం రాత్రి అతిపెద్ద చోరీ జరిగింది. ఒకే ప్రాంగణంలో రెండు వేర్వేరు అపార్ట్‌మెంట్లలో రెండు ప్లాట్లలో దొంగలు లూఠీకి పాల్పడ్డారు. ఎంతో చాకచక్యంగా మెయిన్‌డోర్ తలుపు గడియను కట్‌చేసి ఇంట్లోకి చొరబడి బీరువాలను బద్దలుకొట్టి దొరికిన మేర దోచుకున్నారు. బంగారు ఆభరణాల బాక్సులు, వస్ర్తాలను చిందరవందరగా పడవేశారు. ఎక్కడా ఆనవాళ్ళు దొరక్కుండా జాగ్రత్తపడ్డారు. చోరీచేసిన తీరు దాదాపుగా రెండు ప్లాట్లలో ఒకేలా కనిపించింది. ఓ వైద్యుడి ఇంట్లో 1250 గ్రాముల బంగారం, కిలో వెండి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంట్లో 25 తులాల బంగారం (291 గ్రాములు) చోరీకి గురయ్యాయి. బహిరంగమార్కెట్ ధర ప్రకారం చోరీ సొత్తు విలువ సుమారు రూ.3 కోట్లు ఉంటుందని అంచనా. చోరీ జరిగిన సమయంలో రెండు ప్లాట్లకు తాళాలు వేసి ఉన్నాయి. చోరీ విషయం తెలిసిన వెంటనే సోమవారం ఉదయం చీపురుపల్లి డిఎస్పీ రాఘవులు, రాజాం టౌన్, రూరల్ సీఐలు అశోక్‌కుమార్, ఉపేంద్రరావు, సంతకవిటి ఎస్‌ఐ గోపాలరావు ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీం, డాగ్‌స్క్వాడ్ సిఐ మురళీ మోహనరావు ఆధ్వర్యంలో సిబ్బంది చోరీ జరిగిన రెండు ప్లాట్లను పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. ఎస్పీ ఏఆర్ దామోదర్ సోమవారం సాయంత్రం చోరీ జరిగిన ఇళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. వివరాలను తెలుసుకున్నారు. రాజాం రూరల్ సీఐ ఉపేంద్రరావు కేసు నమోదు చేశారు.
వైద్యుడి ఇంట్లో రూ.2.50 కోట్లు
పట్టణంలోని జీఎంఆర్ వరలక్ష్మి కేర్ హాస్పిటల్‌లో చిన్నపిల్లల వైద్యుడిగా పనిచేస్తున్న నగేష్, జిఎంఆర్. ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని రస అపార్ట్‌మెంట్లో మూడో ఫ్లోర్‌లో ఉంటున్నారు. ఇతని కుటుంబం విశాఖలో ఉండడంతో శనివారం సాయంత్రం డా.నగేష్ విశాఖ వెళ్లారు. తిరిగి సోమవారం ఉదయం ఇంటికి చేరుకున్న నగేష్ ఇంటి మెయిన్‌డోర్ కట్‌చేసి ఉండడాన్ని గమనించి అవాక్కయ్యారు. ఇంటి లోపల సైతం బీరువా తలుపులు తెరిచి ఉండడం, బంగారు ఆభరణాలకు సంబంధించిన బాక్సులు, దుస్తులు చిందరవందరగా పడి ఉండడంతో విషయాన్ని పొలీసులకు సమాచారం అందించారు. విషయం తెలసుకున్న చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, సిఐలు అశోక్‌కుమార్, ఉపేంద్రరావు, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని డాక్టర్ ప్లాట్‌ను పరిశీలించారు. వైద్యుడి ఇంటో 1250 గ్రాముల బంగారం, కిలో వెండి పోయినట్లు నిర్ధారించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతని ఫిర్యాదు మేరకు రూరల్ సిఐ ఉపేంద్రరావు కేసు నమోదు చేశారు.
వైద్యుడి ఇంటి వెనుకనే..
జిఎంఆర్. ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో డా.నగేష్ అపార్ట్‌మెంట్‌ను ఆనుకుని ఉన్న లయ అపార్ట్‌మెంట్‌లో మూడోఫ్లోర్‌లో ఉంటున్న మాధవకృష్ణారెడ్డి ఇంట్లో సైతం ఆదివారం రాత్రి చోరీ జరిగింది. జి.ఎం.ఆర్. ఇంజినీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న ఈయన ఆదివారం సెలవు కావడంతో శనివారం (జనవరి 31)న సాయంత్రం కుటుంబంతో కలిసి పాలకొండ వెళ్లారు. సోమవారం తిరిగి ఇంటికి చేరుకున్న ఆయన సైతం తనింటి తలుపులు కట్‌చేసి ఉండడంతో ఖంగుతిన్నారు. ఇంటి బెడ్‌రూంలోకి చేరుకున్న ఆయన బీరువా తెరిచి ఉండడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తనింట్లో 25 తులాల బంగారం (291 గ్రాములు) చోరీ జరిగినట్లు నిర్ధారించారు. ఇతని ఫిర్యాదు మేరకు రాజాం రూరల్ సీఐ ఉపేంద్రరావు కేసు నమోదు చేశారు.
అంతలోనే బయటపడ్డ రెండో చోరీ..
వాస్తవానికి మాధవకృష్ణారెడ్డి ఇంట్లోనే ఆదివారం రాత్రి తొలుత దొంగతనం జరిగింది. అక్కడ లూఠీ చేసిన అగంతకులు క్షణాల తేడాలో డా.నగేష్ ఇంట్లో చొరబడ్డారు. అయితే డా.నగేష్ తనింట్లో చోరీ జరిగిందని ముందుగా గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం చేరుకుని వేలిముద్రలు సేకరించారు. అతనిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ తతంగం అంతా మధ్యాహ్నం మూడు గంటల వరకూ కొనసాగింది. పోలీసులు మినహా అంతా ఎవరిళ్లకు వారు చేరుకున్నారు. సరిగ్గా నాలుగు గంటల సమయంలో ఆలస్యంగా తెలుసుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ మాధవ కృష్ణారెడ్డి కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెనుతిరిగిన క్లూస్‌టీం మరోసారి రాజాం రావాల్సి వచ్చింది.
ఉలిక్కిపడ్డ రాజాం..
రాజాం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న జి.ఎం.ఆర్.ఐ.టి. క్యాంపస్‌లో రెండు అపార్ట్‌మెంట్లలో ఒకేరోజు రాత్రి చోరీ జరగడంతో పట్టణ ప్రముఖులు, వ్యాపారవర్గాలు ఉలిక్కిపడ్డాయి. అడుగడుగునా సీసీ కెమెరాలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణ వలయంలో చోరీ జరిగితే మన పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ప్రతిఒక్కరిలోనూ తలెత్తింది. కాగా చోరీ జరిగిన రెండు అపార్ట్‌మెంట్ల సమీపంలో లభ్యమైన సీసీ ఫుటేజీలలో ఆదివారం రాత్రి ముగ్గురు వ్యక్తుల కదలికలను పోలీసులు గుర్తించి సీసీ ఫుటేజిల్ని స్వాధీనం చేసుకున్నారు. వీరంతా ఎంతో పకడ్బందీగా కేవలం కల్లు మాత్రమే కనిపించేలా ముసుగులేసుకుని, చేతులకు ఊలుతో తయారుచేసిన గ్లౌజులు వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే నిర్మాణాలలో పనిచేస్తున్న సుమారు రెండువందల మంది వివరాలను కూడా పోలీసులు సేకరించారు.
దొంగల్ని పట్టుకుంటాం
ఏఆర్ దామోదర్, ఎస్పీ, విజయనగరం
చోరీకి పాల్పడిన వారిని పట్టుకుంటాం. ఇప్పటికే పది టీంలను నియమించాం. డీఎస్పీ ఆధ్వర్యంలో ఈ టీమ్‌లు పనిచేస్తాయి. సిసి ఫుటేజీల్లో లభ్యమైన ప్రాథమిక సమాచారం ప్రకారం ఈచోరీలో ముగ్గురు పాల్గొన్నట్లు గుర్తించాం. ఇక్కడ కూడా వందలాది మంది బయటవ్యక్తులు పనిచేస్తున్నారు. వీళ్లలో ఎవరైనా రెక్కీ నిర్వహించి ఇతర ప్రాంతాల నుంచి గ్యాంగ్‌ను తెప్పించారేమోనన్న అంశాలపై దృష్టి పెడతాం. క్లూస్ డెవలప్ చేసి పూర్తి ఆధారాలతో కేసు పురోగతి సాధిస్తాం. ఇళ్లల్లో నిత్యం అవసరమైన బంగారు ఆభరణాలు తప్ప పెద్దమొత్తంలో బంగారం, వెండి, నగదు ఉంచుకోవద్దు. ఇతర ప్రాంతాలకు వెళ్లేటపుడు ఇరువైపులా ఉన్నవారికి సమాచారం ఇవ్వాలి.