Now Like a Mirror! నాడు రాళ్లుతేలి.. నేడు అద్దంలా!
ABN , Publish Date - Apr 01 , 2026 | 12:16 AM
“Once Full of Rocks… Now Like a Mirror!” కూటమి ప్రభుత్వం చొరవతో సీతంపేట ఏజెన్సీ లోని పలు గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రాళ్లు తేలి.. అధ్వానంగా దర్శనమిచ్చిన రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తుండడంతో గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
సీతంపేట రూరల్, మార్చి31(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం చొరవతో సీతంపేట ఏజెన్సీ లోని పలు గిరిజన గ్రామాల్లో రహదారుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గతంలో రాళ్లు తేలి.. అధ్వానంగా దర్శనమిచ్చిన రోడ్లు.. నేడు అద్దంలా మెరుస్తుండడంతో గిరిపుత్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పెదరామ పంచాయతీ పరిధిలో గిరిశిఖర గ్రామాలైన మొగదార, రుక్మిణిగూడకు పక్కా రహదారి లేదు. రాళ్లు తేలిన ఆ రోడ్డుపై కనీసం నడిచి వెళ్లలేని దుస్థితి. ఈ విషయాన్ని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. ఈ మేరకు సర్కారు ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు మంజూరు చేసింది. మొత్తంగా రూ.3.2కోట్లతో దోనుబాయి, రుక్మిణిగూడ మీదుగా జగతిపల్లి రోడ్డు వరకు 3.2కిలోమీటర్ల మేర సీసీ రహదారి, కొండవాగు నీరు మళ్లించేందుకు పైపు కల్వర్టులు, రక్షణ గోడలు, సిమెంట్ డ్రైన్‌ల నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మొగదార, మొగదారగూడ, మధ్య మొగదారగూడ, రుక్మిణిగూడ, రామన్నగూడ గ్రామాలకు చెందిన గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.