Once Again in Just Three Months! మూడు నెలల్లో మరోసారి!
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:17 AM
Once Again in Just Three Months! గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. రూ.29 మేర చమురు కంపెనీలు పెంచాయి. ఈ పెంపు ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది.
మార్చిలో రూ.60 వడ్డింపు
తాజాగా రూ.29 మేర ధర పెంపు
ఆందోళనలో జిల్లావాసులు
పార్వతీపురం, జూన్7(ఆంధ్రజ్యోతి): గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర మరోసారి పెరిగింది. రూ.29 మేర చమురు కంపెనీలు పెంచాయి. ఈ పెంపు ఆదివారం నుంచి అమలులోకి వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ఎల్‌పీజీ దిగుమతులు క్షీణించిన నేపథ్యంలో మార్చి 7న చమురు సంస్థలు సిలిండర్ మీద రూ.60 మేర పెంచాయి. తాజాగా రెండోసారి ధర పెంచడంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.రూ.937 నుంచి రూ.966కు పెరిగింది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్‌తో పాటు వాణిజ్య సిలిండర్ ధరలు పెరగ్గా.. ఆ ప్రభావం అన్ని రంగాలపై పడింది. నిత్యావసర ధరలన్నీ భగ్గుమంటున్నాయి. అయితే వంట గ్యాస్ సిలిండర్ ధరను మూడు నెలల వ్యవధిలో మళ్లీ పెంచడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తామెలా బతకాలని ప్రశ్నిస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 15 మండలాలతో పాటు పార్వతీపురం, సాలూరు మున్సిపాల్టీలు, పాలకొండ నగర పంచాయతీలో మొత్తంగా 3.16 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో దీపం కనెక్షన్లు లక్షకు పైబడి ఉన్నాయి. గిరిజనులకు ప్రత్యేక ప్యాకేజీ కింద ఇచ్చినఐదు కేజీల సిలిండర్లు 19,084, జనరల్ కనెక్షన్లు 1.45 లక్ష , సీఎస్‌ఆర్ కనెక్షన్లు 9,235 వరకూ ఉన్నాయి. మొత్తంగా తాజా సిలిండర్ ధర పెంపుతో జిల్లా వాసులపై సుమారు రూ.కోటిపైగా అదనపు భారం పడుతోంది. కాగా పెంపు ఆదేశాలు ఇంకా తమకు రాలేదని డీఎస్‌వో అశోక్ తెలిపారు.
చాలా దారుణం..
మూడు నెలల కిందటే గ్యాస్ సిలిండర్ ధర రూ. 60 పెంచారు. తాజాగా మరో రూ.29 పెంచడం చాలా దారుణం. మాలాంటి సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా బతకాలి. దీనిపై ప్రభుత్వాలు స్పందించాలి.
- అప్పలనాయుడు, పార్వతీపురం
=====================================
వెంటనే తగ్గించాలి..
మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర రూ.29 పెంచడం ఎంతవరకు సమంజసం. మూడు నెలల కిందటే రూ.60 పెంచారు. ఇలా పెంచిస్తే పేదల పరిస్థితి ఏమిటి? తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలి.
- కె.రామలక్ష్మి, పార్వతీపురం