ఉపాధి పని నుంచి ఇంటికి వెళుతూ...
ABN , Publish Date - Apr 25 , 2026 | 12:21 AM
సంతోషపురం గ్రామానికి చెందిన బొత్స విజయ (52) ద్విచక్ర వాహనం డీకొన్న ఘటనలో శుక్రవారం మృతి చెందింది.
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళ మృతి
గరుగుబిల్లి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): సంతోషపురం గ్రామానికి చెందిన బొత్స విజయ (52) ద్విచక్ర వాహనం డీకొన్న ఘటనలో శుక్రవారం మృతి చెందింది. సంతోషపురం నుంచి తోటచెరువు ప్రాంతంలో ఉపాధి పనులకు వెళ్లిన విజయ.. తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఖడ్గవలస నుంచి పార్వతీపురం వైపు వెళుతున్న ద్విచక్ర వాహనదారుడు వెనుక నుంచి ఆమెను ఢీకొన్నాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు ఆమెను పార్వతీపురం కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన సేవల నిమిత్తం విజయనగరం ఆసుపత్రికి రిఫర్ చేశారు. అయితే ఆమెను ఆసుపత్రిలో చేర్చేటప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. భర్త శివయ్య ఫిర్యాదు మేరకు గరుగుబిల్లి ఎస్‌ఐ ఫకృద్ధీన్ కేసు నమోదు చేశారు. మృతురాలికి భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
దాహం తీర్చుకునేందుకు వెళ్లి..
నేలబావిలో జారిపడి వృద్ధుడి మృతి
రామభద్రపురం, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): దాహార్తిని తీర్చుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నేలబావిలో జారిపడి ఒక వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తారాపురానికి చెందిన పిల్ల లక్ష్మణ (77) శుక్రవారం ఉదయం పొలం పనికి వెళ్లి చాకిరేవు పొలంలో సామంతులు కొత్తయ్యకు చెందిన నేలబావిలో నీరు తాగడానికి దిగుతూ ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. మృతుడి కుమారుడు వెంకటరమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు హెచ్‌సీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు.