Share News

On the way... coming and going వెళ్తూ.. వస్తూ

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:02 AM

On the way... coming and going విద్యార్థులు వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాల, కళాశాలలకు వెళ్తున్న సమయమిది. అలాగే ఖరీఫ్‌ పనులకు రైతులు సిద్ధమవుతున్న వేళ కూడా ఇదే. ఈ ఇరు వర్గాలకూ వివిధ ధ్రువపత్రాలు అవసరం. కుల, ఆదాయం, నివాసం, ఓబీసీ వంటి ధ్రువీకరణ పత్రాల కోసం కొద్దిరోజులుగా విద్యార్థులు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.

On the way... coming and going వెళ్తూ.. వస్తూ
మార్పు చేసిన స్టేషనరీ పేపరు

వెళ్తూ.. వస్తూ

స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు

ధ్రువ పత్రాలు అందక విద్యార్థుల పాట్లు

1బీల కోసం రైతుల అవస్థలు

పూర్తిస్థాయిలో స్టేషనరీ రాకపోవడమే కారణం

విద్యార్థులు వేసవి సెలవుల అనంతరం తిరిగి పాఠశాల, కళాశాలలకు వెళ్తున్న సమయమిది. అలాగే ఖరీఫ్‌ పనులకు రైతులు సిద్ధమవుతున్న వేళ కూడా ఇదే. ఈ ఇరు వర్గాలకూ వివిధ ధ్రువపత్రాలు అవసరం. కుల, ఆదాయం, నివాసం, ఓబీసీ వంటి ధ్రువీకరణ పత్రాల కోసం కొద్దిరోజులుగా విద్యార్థులు స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రైతులు 1బీ కోసం కూడా ప్రదక్షిణ చేస్తున్నారు. పదే పదే వచ్చి వెళ్తున్నారు. పని కాక విసుగు చెందుతున్నారు. స్వర్ణ గ్రామ, వార్డు కార్యాలయాలకు కొత్త స్టేషనరీ పూర్తి స్థాయిలో రాకపోవడమే ఈ పరిస్థితికి కారణం.

విజయనగరం కలెక్టరేట్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి):

స్వర్ణ గ్రామం- స్వర్ణ వార్డు కార్యాలయాలతో పాటు మీసేవ కేంద్రాల ద్వారా అందజేసే ధ్రువ పత్రాలకు సంబంధించి స్టేషనరీలను(బాండు పేపర్లు) ప్రభుత్వం ఈనెల 10 నుంచి మార్పు చేసింది. గతంలో గ్రామ -వార్డు సచివాలయాల శాఖగా ఉన్న పేరును స్వర్ణగ్రామం-స్వర్ణవార్డు శాఖగా రాష్ట్ర ప్రభుత్వం మార్పు చేసిన సంగతి తెలిసిందే. ఆ మేరకు కొత్త స్టేషనరీపై మాత్రమే ధ్రువ పత్రాలు అందజేయాలని ప్రభుత్వం ఽఆదేశించింది. అయితే మార్పు చేసిన స్టేషనరీని స్వర్ణ గ్రామ.. వార్డు కార్యాలయాలకు, మీసేవ కేంద్రాలకు పూర్తిస్తాయిలో ఇవ్వాల్సి ఉంది. ఈనెల 8,9 తేదీల్లో జిల్లాలోని మీసేవ కేంద్రాలకు, స్వర్ణ గ్రామ, వార్డులకు కొత్తస్టేషనరీ అందజేసింది కానీ అరకొరే. దీంతో ప్రజలు వివిధ ధ్రువీకరణ పత్రాలు అందక అవస్థలు పడుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా మొత్తం 530 స్వర్ణ గ్రామం, 96 స్వర్ణ వార్డులు ఉన్నాయి. అలాగే జిల్లాలో 151 మీసేవ కేంద్రాలు పనిచేస్తున్నాయి. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులకు 52 వేల పేపర్లు అందజేయగా, మీసేవ కేంద్రాలకు 19 వేల పేపర్లు పంపిణీ చేశారు. వాస్తవానికి ప్రతి రోజు 626 స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డులకు 5వేల పేపర్లు చొప్పున స్టేషనరీ అవసరం. అదే మీసేవ కేంద్రాల్లో అయితే రోజుకు 1500 పేపర్లు అవసరం పడుతుందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కొత్త విద్యా సంవత్సరం మొదలు కావడం వల్ల విద్యార్థులంతా కుల, ఆదాయ, నివాస, ఓబీసీ వంటి ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ప్రతి విద్యార్థికీ ఇవి అత్యవసరం. అలాగే రైతులు ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి పంట రుణాల రెవెన్యూవల్‌ కోసం తహసీల్దార్‌ డిజిటల్‌ సిగ్నేచర్‌ చేసిన 1బీలు అవసరం. వీటిని అందజేస్తేనే బ్యాంకులు రుణాలను రెన్యూవల్‌ చేస్తాయి. ఖరీఫ్‌ సీజన్‌కు జూన్‌, జూలై నెలల్లో మాత్రమే రెన్యూవల్‌ జరుగుతుంది. ఈ సమయంలో రైతులందరూ 1బీలు పొందడానికి స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు, మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. స్టేషనరీ అందుబాటులో ఉంటే ధ్రువపత్రాలు ఇస్తున్నారు. లేదంటే మరో రోజు రావాలని సూచిస్తున్నారు.

పెద్దలకు తప్పడం లేదాయె..

60 సంవత్సరాల వయసు పూర్తయిన వారు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవడానికి తప్పకుండా కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఉండాలి. వీటి కోసం మీసేవ, స్వర్ణవార్డు - స్వర్ణ గ్రామం కార్యాలయాలకు వెళ్తున్నారు. వీరు కూడా మళ్లీ మళ్లీ వెళ్లాల్సి రావడంతో అలసిపోతున్నారు. కేంద్రాల నిర్వహకులు, సిబ్బంది సమాధానం చెప్పలేకపోతున్నారు.

గత వైసీపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసింది. అప్పటి వరకూ మీసేవ కేంద్రాల ద్వారా ఇచ్చే ధ్రువ పత్రాలు(స్టేషనరీ)ను మార్పు చేసి అప్పటి సీఎం జగన్‌ ఫొటోతో ఉన్న పేపర్లపై ధ్రువ పత్రాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఆ స్టేషనరీలను మార్పు చేసి కొత్త స్టేషనరీ మంజూరు చేసింది. తాజాగా మరోసారి ఈ స్టేషనరీ పేపర్లలో మార్పు జరిగింది. రైతులకు, విద్యార్ధులకు అవసరమైన కీలక సమయంలో కొత్త స్టేషనరీ పూర్తిస్థాయిలో రాక వారు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు.

Updated Date - Jun 20 , 2026 | 12:02 AM