Share News

On the Way Back from a Wedding… వివాహానికి వెళ్లొస్తూ..

ABN , Publish Date - May 06 , 2026 | 11:39 PM

On the Way Back from a Wedding… వారంతా ఒకే గ్రామస్థులు.. ఒకే వాహనంలో సరదాగా వివాహ కార్యక్రమానికి బయల్దేరారు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంగా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ వారితో కలిసి భోజనాలు చేశారు. కాసేపటి తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఘాట్‌రోడ్డులో వారు ఊహించని ఘటన చోటుచేసుకుంది. వారంతా మాటల్లో మునిగిపోయారు. మరో రెండు నిమిషాల్లో ఇళ్ల చేరుతారనగా.. ఒక్కసారిగా వాహనం లోయలో బోల్తాపడింది.

On the Way Back from a Wedding… వివాహానికి వెళ్లొస్తూ..
లోయలో బోల్తా పడిన పికప్‌ వ్యాన్‌

  • 18 మందికి తీవ్రగాయాలు

  • రిమ్స్‌కు ఎనిమిది మంది రెఫర్‌

  • గిరిజనుల ప్రాణాలు కాపాడిన చెట్లు

సీతంపేట రూరల్‌, మే6(ఆంధ్రజ్యోతి): వారంతా ఒకే గ్రామస్థులు.. ఒకే వాహనంలో సరదాగా వివాహ కార్యక్రమానికి బయల్దేరారు. కబుర్లు చెప్పుకుంటూ ముందుకు సాగారు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంగా వివాహ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమ వారితో కలిసి భోజనాలు చేశారు. కాసేపటి తర్వాత తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఘాట్‌రోడ్డులో వారు ఊహించని ఘటన చోటుచేసుకుంది. వారంతా మాటల్లో మునిగిపోయారు. మరో రెండు నిమిషాల్లో ఇళ్ల చేరుతారనగా.. ఒక్కసారిగా వాహనం లోయలో బోల్తాపడింది. సవరపాడు గ్రామ సమీపంలోని ఘాట్‌రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో 18 మంది గిరిజనులకు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఎనిమిది మందిని మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బెన్నరాయి గ్రామానికి చెందిన 42 మంది గిరిజనులు పుట్టిగాం గ్రామంలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి పికప్‌వ్యాన్‌లో బుధవారం బయలుదేరి వెళ్లారు. ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి ఎంతో హుషారుగా చేరుకున్నారు. అక్కడ తమ వారితో సంతోషంగా గడిపారు. మధ్యాహ్నం భోజనాలు చేసి తమ స్వగ్రామానికి తిరిగి పయనమయ్యారు. అయితే సవరపాడు సమీపంలో ఉన్న ఘాట్‌రోడ్డుకు చేరుకునే సరికి వాహనం అదుపు తప్పింది. బండిలో ఎక్కువ మంది ఉండడంతో ఘాట్‌రోడ్డు ఎక్కలేక వెనక్కి ఒరిగింది. దీంతో పక్కనే ఉన్న లోయలోకి బోల్తాకొట్దింది.

ఆ చెట్లే లేకుంటే..

వాహనం లోయలోకి బోల్తాపడింది. అయితే దిగువ ప్రాంతంలో చెట్లు అధికంగా ఉన్నాయి. అవే వాహనం మరింత లోతున పడకుండా ఆపాయి. కేవలం పది అడుగుల వరకు వెళ్లి వాహనం ఆగిపోయింది. చెట్లు అడ్డం లేకుంటే భారీ ప్రాణనష్టం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. తమను చెట్లే కాపాడాయని క్షతగాత్రులు తెలిపారు. ఈ ఆకస్మిక ఘటనతో గిరిజనులు షాక్‌కు గురయ్యారు. కనురెప్పపాటులో జరిగిన ప్రమాదం నుంచి తేరుకోలేకపోయారు. తీవ్ర గాయాలతో కదలలేకపోయారు. మొత్తంగా వారి ఆర్తనాదాలతో లోయ ప్రాంతం మార్మోగింది. పెద్ద శబ్దం విని సవరపాడు వాసులు అక్కడకు చేరుకున్నారు. లోయలో వాహనం పడడం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ లోగా స్థానికులు లోయలోకి దిగి క్షతగాత్రులను బయటకు తీశారు. 108, ప్రైవేట్‌ వాహనాల్లో సీతంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితులు కుటుంబసభ్యులతో సీతంపేట ఏరియా ఆసుపత్రి కిక్కిరిసింది. సవర సురభి, బిడ్డిక ప్రకాష్‌, సవర శ్రావణ్‌కుమార్‌, బిడ్డిక కీర్తి, కూరంగి సంజన, భూగమ్మ, ఆరిక తట్టయ్య, నీలమ్మ, నందిని, మంపిలతో పాటు మరికొంత మంది స్వల్పగాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పాలకొండ సీఐ ప్రసాదరావు, ఎస్‌ఐ వై.అమ్మన్నరావు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు. దీనిపై ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రిఫెర్‌ కేసులివీ..

పికప్‌ వ్యాన్‌ బొల్తాపడిన ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఎనిమిది మందిని సీతంపేట ఏరియా ఆసుపత్రి వైద్యులు మెరుగైన వైద్యసేవల కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫెర్‌ చేశారు. తీవ్రంగా గాయపడిన సవర తోటయ్య, సింగన్న, గంగమ్మి, బిడ్డిక పులమయి, గుడిమి, దమయంతి, సుభద్రలను హుటాహుటిన ఐటీడీఏ అంబులెన్స్‌లలో శ్రీకాకుళం తరలించారు.

Updated Date - May 06 , 2026 | 11:39 PM