అటు నిరంతరం..ఇటు అవాంతరం
ABN , Publish Date - Jan 08 , 2026 | 11:58 PM
తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ కాలువ ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుంటే, కుడి కాలువలో మాత్రం సాగునీటి సరఫరా నిలిచిపోయింది.
- ‘తోటపల్లి’ ఎడమ కాలువ ద్వారా నిత్యం సాగునీరు
- కుడి కాలువలో మాత్రం సరఫరాకు ఆటంకం
- షట్టర్లు మొరాయించడంతోనే ఈ పరిస్థితి
- కానరాని మరమ్మతులు
- రబీలో రైతులకు తప్పని కష్టాలు
గరుగుబిల్లి, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): తోటపల్లి పాత రెగ్యులేటర్ పరిధిలోని ఎడమ కాలువ ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుంటే, కుడి కాలువలో మాత్రం సాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఎడమ కాలువ పరిధిలోని ప్రధాన షట్టరు మొరాయించడంతో అది కిందకు దిగడం లేదు. దీంతో సాగునీటి ప్రవాహానికి అడ్డుకట్ట పడడం లేదు. ఖరీఫ్ సీజన్ నుంచి నేటి వరకు కూడా ఈ కాలువ ద్వారా సాగునీరు నిరంతరం ప్రవహిస్తోంది. కుడి కాలువ విషయానికి వస్తే దీనిపై ఉన్న ప్రధాన షట్టరు దెబ్బతినడంతో అది పూర్తిగా కిందకు జారిపోయింది. దీంతో నీటి సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. షట్టరును పైకి లేపేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ఫలితంగా రబీలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు.
ఇదీ పరిస్థితి..
ఎడమ, కుడి కాలువల పరిధిలోని ప్రధాన షట్టర్లు నిత్యం మొరాయిస్తున్నాయి. గత కొంత కాలంగా వాటిని బాగు చేయడం లేదు. ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి సుమారు 36 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా అవుతుంది. అయితే ప్రధాన షట్టరు కిందకు దిగకపోవడంతో గత మూడు నెలలుగా కాలువ నుంచి సాగునీరు సరఫరా అవుతుంది. ఖరీఫ్‌లో ఏ మాదిరిగా నీరు వచ్చేదో ఇప్పుడు రబీలో కూడా అదే విధంగా ప్రవహిస్తోంది. నిత్యం సాగునీరు సరఫరా అవుతుండడంతో వీరఘట్టం, గరుగుబిల్లి, పాలకొండ ప్రాంతాల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పొలాల్లోకి నిత్యం నీరు వచ్చి చేరుతుండడంతో పంటల నిర్వహణకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అవసరం ఉన్న సమయంలో సాగునీరు అందదు.. లేని సమయంలో పుష్కలంగా అందుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

తోటపల్లి కుడి కాలువలో నిలిచిన సాగునీటి సరఫరా
- కుడి కాలువకు సంబంధించి సుమారు 9 వేల ఎకరాలకు సాగునీరు సరఫరా కావాల్సి ఉంది. ఇటీవల వరకూ ప్రధాన షట్టరు బాగా పనిచేసేది. నీరు అవసరం అయినప్పుడు షట్టర్‌ను అధికారులు పైకి ఎత్తేవారు. అవసరం లేకుంటే షట్టర్‌ను కిందకు దించేవారు. అయితే, ప్రస్తుతం షట్టర్ గేర్‌రాడ్డు అరిగిపోవడంతో అది ఒక్కసారిగా కిందకు జారింది. దీంతో గరుగుబిల్లి మండలం సుంకి నుంచి వంగర మండలం కొత్తవలస వరకు సాగునీరు సరఫరా కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షట్టర్‌ను పైకి ఎత్తేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం ఉండడం లేదు. పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువల అభివృద్ధిపై అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదనే విమర్శలు ఉన్నాయి. కాలువల పరిధిలో గుర్రపు డెక్క తొలగింపుతో పాటు గండ్లు పూడ్చడం వంటి పనులను ఆయా ప్రాంతాలకు చెందిన రైతులే స్వచ్ఛందంగా నిర్వహించుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి సాగునీటి సరఫరాకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
చర్యలు చేపడతాం..
పాత రెగ్యులేటర్ పరిధిలోని రెండు కాలువల ప్రధాన షట్టర్ల మరమ్మతులకు అవసరమైన చర్యలు చేపడుతున్నాం. పనుల నిర్వహణకు టెండర్లను పిలిచాం. నిధులు మంజూరు కాగానే పనులు చేపట్టి సాగునీటి సరఫరాకు ఆటంకం లేకుండా చూస్తాం.
-డీవీ రమణ, ప్రాజెక్టు ఏఈ, వీరఘట్టం