Share News

New Path… సరికొత్త ‘బాట’లో..

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:37 PM

On a Brand-New Path… జిల్లాలో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. సరికొత్త ‘బాట’ పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో చాలాచోట్ల రహదారుల నిర్మాణం పూర్తవడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 New Path… సరికొత్త ‘బాట’లో..
స్కాట్‌దొరవలస- డెప్పిగూడ రహదారి ఇలా..

  • ప్రభుత్వ చొరవతో జోరుగా రహదారుల నిర్మాణం

  • హర్షం వ్యక్తం చేస్తున్న జిల్లావాసులు

పాలకొండ, ఫిబ్రవరి4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పల్లెల రూపురేఖలు మారుతున్నాయి. సరికొత్త ‘బాట’ పడుతున్నాయి. కూటమి ప్రభుత్వం చొరవతో చాలాచోట్ల రహదారుల నిర్మాణం పూర్తవడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై దృష్టి సారించ లేదు. కనీసం మరమ్మతులకు కూడా నిధులు మంజూరు చేయలేదు. దీంతో గిరిజన, మైదాన ప్రాంతవాసులు నానా అవస్థలు పడేవారు. అడుగుకో గోతులతో గ్రామీణ రహదారులన్నీ అధ్వానంగా మారాయి. దీంతో అంబులెన్స్‌లతో పాటు బైక్‌లు కూడా వెళ్లలేని దుస్థితి. అత్యవసర వేళల్లో వైద్య సేవలు పొందేందుకు ప్రజలు నానా అవస్థలు పడేవారు. గిరిజనులకు డోలీ మోతలు తప్పేవికావు. వర్షాకాలంలో అయితే వారి బాధలు రెట్టింపు అయ్యేవి. బురద రహదారుల్లో రాకపోకలు సాగించలేకపోయేవారు. అయితే కూటమి ప్రభుత్వం అధికా రంలోకి వచ్చాక.. ఆయా సమస్యలపై దృష్టి సారించింది. అడవితల్లి బాట, పల్లె పండుగ పేరుతో నూతన రహదారుల నిర్మాణం, మరమ్మతులకు చర్యలు చేపడుతోంది. మరోవైపు నాబార్డు పీఎం జన్మన్‌ నిధులతో మరిన్ని రోడ్ల మెరుగకు నిధులు కేటాయిస్తుంది. ఈ పనులన్నీ పూర్తయితే గ్రామీణ రహదారులు ఎంతగానో మెరుగుపడతాయి. ప్రజలకు రవాణా కష్టాలు తప్పుతాయి. పల్లెపల్లెకు కనక్టివిటీ పెరుగుతుంది. రైతులు తమ పంటలను సక్రమంగా పట్టణ ప్రాంతాలకు తరలించి అమ్మకాలు చేపట్టే వీలు కలుగుతుంది. వాహనదారులకు ప్రయాణ ఇక్కట్లు తొలగిపోతాయి.

ఇదీ పరిస్థితి..

- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర వ్యవధిలోనే కోట్లాది రూపాయలు వెచ్చించి రహదారి పనులు చేపట్టింది. ఒక్క పాలకొండ పీఆర్‌ డివిజన్‌ పరిధిలోని పంచాయ తీరాజ్‌, పీఐయూ శాఖల ద్వారా పల్లె పండుగ-1లో ఎన్నో రోడ్లు నిర్మించింది. ప్రధానంగా పాలకొండ, జియ్యమ్మవలస, కురపాం, సీతంపేట, భామిని, వీరఘట్టం మండలాలకు 107 రహదారులు మంజూరవగా.. రూ. 20.48 కోట్లు కేటాయించారు. అయితే ఇప్పటివరకు 66 రహదారుల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 36 పనులు ప్రోగ్రస్‌లో ఉన్నాయి. ఐదు రోడ్ల పనులు ప్రారంభం కావాల్సి ఉంది. ఇప్పటివరకు పూర్తయిన పనులకు సంబంధించి సుమారు రూ.ఆరు కోట్ల మేర బిల్లులు చెల్లించారు. పల్లె పండుగ -2 కింద మరో 281 రహదారులకు రూ.25.95 కోట్ల మేర ప్రభుత్వం మంజూరు చేసింది.

- పాలకొండ మండలంలోని మారుమూలన ఉన్న ఓని పంచాయతీ పరిధిలో స్కాట్‌దొరవలస, డెప్పిగూడ హేమలేట్‌ గ్రామాలుగా ఉన్నాయి. అవి ఇప్పటివరకు రహదారి సౌకర్యానికి నోచుకోలేదు. అయితే కూటమి ప్రభుత్వం గుడివాడ, ఓని నుంచి స్కాట్‌దొరవలస మీదుగా 1.3 కిలోమీటర్లు మేర డెప్పిగూడ వరకు బీటీ రహదారిని మంజూరు చేసింది. రూ. కోటి 10 లక్షలతో బీటీ రోడ్డు వేయడంతో అక్కడి గిరిజనులకు రవాణా కష్టాలు తొలిగాయి.

- పాలకొండ పీఆర్‌ డివిజన్‌ పరిధిలో ప్రస్తుతం పీఎం జన్మన్‌ కింద 17 రహదారులు మంజూ రయ్యాయి. పనుల కోసం రూ.35.70 కోట్లు కేటాయించారు. వాటిల్లో 15 రోడ్లు వివిధ దశల్లో ఉన్నాయి. నాబార్డు నిధులతో ఐదు పనులు మంజూరవగా.. రూ.6.64 కోట్లు కేటాయించారు.

రుణపడి ఉంటాం..

ఓని పంచాయతీ పరిధిలో ఉన్న మా గ్రామం ఏర్పడి ఎన్నో దశాబ్దాలైంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు నూతన రహదారి ఏర్పాటు చేసింది. తామంతా ఈ ప్రభుత్వానికి రుణపడి ఉంటాం.

- భుజంగరావు, స్కాట్‌దొరవలస

=======================

ప్రయాణ కష్టాలు తీరాయి

మా గ్రామ రహదారి అధ్వానంగా ఉండేది. పాలకొండకు చేరాలంటే నానా అవస్థలు పడేవాళ్లం. వర్షాకాలంలో అయితే రోగులకు డోలీలు కట్టి మైదాన ప్రాంతాలకు తరలించాల్సి వచ్చేది. ప్రస్తుతం రహదారి నిర్మాణం పూర్తవడంతో మాకు ప్రయాణ కష్టాలు తీరాయి.

- నారాయుడు, డెప్పిగూడ

==========================

నిర్మాణానికి చర్యలు

రాష్ట్ర ప్రభుత్వం అడవితల్లి బాట, పల్లె పండుగ 1, 2 కింద పాలకొండ పీఆర్‌ డివిజన్‌కు నిధులు మంజూరు చేసింది. వాటితో ముమ్మరంగా రహదారి పనులు చేపడుతున్నాం. గిరిజన, మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కూడా నాబార్డు, పీఎం జన్మన్‌ నిధులు మంజూరయ్యాయి. అందుబాటులో ఉన్న నిధులతో రహదారుల నిర్మాణంతో పాటు విస్తరణ పనులు చేపడుతున్నాం.

- రవికుమార్‌, పీఆర్‌ ఈఈ., పాలకొండ

Updated Date - Feb 04 , 2026 | 11:37 PM