Om Namashivaya ఓం నమశ్శివాయ
ABN , Publish Date - Feb 14 , 2026 | 11:26 PM
Om Namashivaya మహా శివరాత్రి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఉదయం నుంచి పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. పుణ్యగిరి, రామతీర్థంలోని శివాలయాలు, ధర్మవరం సన్యాసేశ్వర ఆలయం, సారిపల్లిలోని దిబ్బేశ్వరస్వామి ఆలయం, రేగిడి మండలం సంగాం, మెంటాడ మండలం జయంతి, విజయనగరం పశుపతి నాథేశ్వర స్వామి, గజపతినగరం మండలం గంగచోళ్ల పెంటలోని పురాతన శివాలయం తదితర క్షేత్రాలను భక్తులు అధికంగా సందర్శించనున్నారు.
ఓం నమశ్శివాయ
నేడు మహాశివరాత్రి
శైవక్షేత్రాల్లో భారీ ఏర్పాట్లు
ప్రత్యేక బస్సులు నడుపుతున్న ఆర్టీసీ
విజయనగరం/ కల్చరల్, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మహా శివరాత్రి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఉదయం నుంచి పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. పుణ్యగిరి, రామతీర్థంలోని శివాలయాలు, ధర్మవరం సన్యాసేశ్వర ఆలయం, సారిపల్లిలోని దిబ్బేశ్వరస్వామి ఆలయం, రేగిడి మండలం సంగాం, మెంటాడ మండలం జయంతి, విజయనగరం పశుపతి నాథేశ్వర స్వామి, గజపతినగరం మండలం గంగచోళ్ల పెంటలోని పురాతన శివాలయం తదితర క్షేత్రాలను భక్తులు అధికంగా సందర్శించనున్నారు. శివరాత్రి పూజలకు ఆలయ కమిటీలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. క్యూలైన్లు సిద్ధం చేశాయి. విజయనగరంలోని ప్రముఖ ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. కలెక్టర్ రామసుందర్‌రెడ్డి, ఎస్పీ దామోదర్ కూడా ముందుగానే ఆయా ఆలయాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్రమత్తం చేశారు. జిల్లా కేంద్రం నుంచి ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను కూడా నడుపుతున్నారు. శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో అయోధ్యమైదానంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించనున్నారు. శివరాత్రిని పురస్కరించుకుని ఆయా శైవ క్షేత్రాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
ప్రత్యేక బస్సులు నడుపుతున్నాం
జిల్లా ప్రజారవాణాధికారి వరలక్ష్మీ
విజయనగరం రింగురోడ్డు, ఫిబ్రవరి 14(ఆంధ్రజ్యోతి): మహాశివరాత్రి జాతర సందర్భంగా విజయనగరం, ఎస్.కోట డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజారవాణాధికారి వరలక్ష్మీ తెలిపారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఈ బస్సులు నడుస్తాయన్నారు. విజయనగరం నుంచి రామతీర్థాలకు 40 ప్రత్యేక బస్సులు, శ్రీకాకుళం-రణస్థలం మీదుగా శ్రీకాకుళం-1 డిపో నుంచి పది బస్సులు, శ్రీకాకుళం-2 డిపో నుంచి 10 బస్సులు, పాలకొండ డిపో నుంచి 10 బస్సులు చోప్పున రామతీర్థం జాతరకు కేటాయించామన్నారు. ఎస్.కోట డిపో నుంచి పుణ్యగిరికి 20 బస్సులు కేటాయించినట్లు తెలిపారు.