Share News

Old age is not for the mind.వృద్ధాప్యం మనసుకు కాదు

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:43 PM

Old age is not for the mind. వారంతా వయసుకే వృద్ధులు.. మనసులో మాత్రం యుక్త వయస్కులు కూడా సరిపోరు. జీవితాన్ని ఆస్వాదించాలని.. సర్దుకుపోతూ ముందుకెళ్లాలని.. ఉన్నదాంతో అనందపడాలని.. తృప్తిగా వీడ్కోలు పలకాలని చెబుతుంటే విన్నవారంతా నిశ్చేష్టులవుతున్నారు. రాజాం వృద్ధాశ్రమంలో ఉన్న వారే కాకుండా అనేక మంది ఇళ్ల వద్ద ఉండే వృద్ధులు కూడా యువతతో పోటీ పడుతున్నారు.

Old age is not for the mind.వృద్ధాప్యం మనసుకు కాదు
కటకం పైడితల్లి

వృద్ధాప్యం మనసుకు కాదు

ఆత్మ విశ్వాసంతో జీవిస్తున్న వృద్ధులు

ఎవరి ఆసరా లేకుండా పనులు చేసుకుంటూ..

నేడు ప్రపంచ వృద్ధుల దినోత్సవం

- నా అన్నవారు లేరు. వయసు 80 సంవత్సరాలు. ఎవరి మీద ఆధారపడను. నా పని నేను చేసుకుంటేనే సంతృప్తి కలుగుతుంది. చిన్న చిన్న రుగ్మతలు తప్ప.. ఇబ్బందులేవీ లేవు. ఆత్మాభిమానంతో బతకడమే ఇష్టం. నెలవారీ వచ్చే రూ.4 వేల పింఛన్‌ మొత్తంతో బతుకుతున్నాను. ఇప్పటికీ నా పని నేనే చేసుకుంటాను.

- కటకం పైడితల్లి, వృద్ధాశ్రమం, రాజాం

- అందరూ ఉండి అనాథగా మిగిలితే బాధగా ఉంటుంది. అయితే వృద్ధాప్యంలో కుటుంబ సభ్యులకు భారంగా ఉండదలుచుకోలేదు. ఎవరికీ భారం కాకూడదని భావించాను. అందుకే వృద్ధాశ్రమంలో ఉంటున్నాను. నా కాళ్లపై నేను నిలబడడమే నాకు ఇష్టం. పింఛన్‌ మొత్తంతో ఆత్మవిశ్వాసంతో బతుకుతున్నాను.

- రామలక్ష్మి, వృద్ధాశ్రమం, రాజాం

రాజాం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వారంతా వయసుకే వృద్ధులు.. మనసులో మాత్రం యుక్త వయస్కులు కూడా సరిపోరు. జీవితాన్ని ఆస్వాదించాలని.. సర్దుకుపోతూ ముందుకెళ్లాలని.. ఉన్నదాంతో అనందపడాలని.. తృప్తిగా వీడ్కోలు పలకాలని చెబుతుంటే విన్నవారంతా నిశ్చేష్టులవుతున్నారు. రాజాం వృద్ధాశ్రమంలో ఉన్న వారే కాకుండా అనేక మంది ఇళ్ల వద్ద ఉండే వృద్ధులు కూడా యువతతో పోటీ పడుతున్నారు. ఎవరి పని వారే చేసుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు. గురువారం ప్రపంచ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ పలువురిని బుధవారం పలకరించగా చాలా కలివిడిగా... ఆనందంగా మనసు విప్పి మాట్లాడారు. మానసిక ప్రశాంతత, సరైన జీవన విధానం అలవరచుకుంటే వృద్ధాప్యంలో కూడా హాయిగా జీవించవచ్చునని మానసిక నిపుణులు చెబుతుంటారు. అటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారు ఎక్కడో కాదు ఇక్కడే ఉన్నామంటూ వారంతా చెబుతున్నారు. ఏడు పదుల వయసుదాటినా పనిచేసే తత్వం తగ్గలేదు. మాటలో విశ్వాసం సడలలేదు.

ఏడు పదులు దాటినా చలాకీగా..

రాజాం వస్త్రపురి కాలనీలో ఉంటున్న నడుపూరి జగన్నాథం వయసు 73 సంవత్సరాలు. భర్త సుమారు 15 ఏళ్ల కిందట మరణించారు. ఇద్దరు పిల్లలు వేర్వేరుగా ఉంటున్నారు. కానీ జగన్నాథం మాత్రం ఆత్మాభిమానంతో తన పని తానే చేసుకుంటోంది. ప్రభుత్వం అందించే రూ.4 వేలు పింఛన్‌తో సంతృప్తిగా బతుకుతోంది. ఏడు పదుల వయసులో కూడా చలాకీగా ఉంటూ జీవనం సాగిస్తోంది. పిల్లలకు భారం కూడదు..వారి దాంపత్యంలో ఇబ్బందులు రాకూడదనే తాను ఒంటరిగా జీవిస్తున్నాని చెబుతోంది.

ఉన్నదాంతో సంతృప్తిగా..

వస్త్రపురికాలనీలో నివాసం ఉంటున్న కాలెపు సూర్యకాంతం భర్త కొన్నాళ్ల కిందట చనిపోయాడు. ప్రస్తుతం ఒంటరిగానే నివాసం ఉంటుంది. ప్రభుత్వం అందించే రూ.4 వేల వితంతు పింఛన్‌ ఆమెకు దిక్కు. కుమారుడు ఉన్నా కానీ వలసబాట పట్టాడు. ఒంటరిననే ఆవేదన ఆమెలో కనిపించదు. ఉన్నదాంతో సంతృప్తి పడుతూ జీవనం సాగిస్తోంది. తన పని తాను చేసుకోవడంలోనే ఆనందం కలుగుతుందని అంటోంది.

వృద్ధులకు అండగా

రాజాంలోని వృద్ధాశ్రమం అనాథ వృద్ధులకు అండగా ఉంటోంది. ప్రస్తుతం అక్కడ 20 మంది వరకు ఉంటున్నారు. నిర్వాహకుడు శ్రీనివాసరావు వారికి మూడుపూటల భోజనంతో పాటు దుస్తులు, మందులు అందిస్తున్నారు. రాజాం పరిసర మండలాలకు చెందిన వృద్ధులు వచ్చి ఈ ఆశ్రమంలో ఉంటున్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:43 PM