Okay Then… Not Now! అప్పుడు ఓకే.. ఇప్పుడు నో!
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:44 PM
Okay Then… Not Now! స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ఎవరి వారు బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు ఆశావాహులు పార్టీ అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం స్థానిక ఎన్నికలపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని నాడు పిలుపునిచ్చిన ఆ పార్టీ నేడు వద్దంటోంది.
చర్చనీయాంశమైన ఆ పార్టీ తీరు
పార్వతీపురం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. ఎవరి వారు బరిలో నిలిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మరోవైపు ఆశావాహులు పార్టీ అధిష్ఠానం ఆశీస్సుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వైసీపీ మాత్రం స్థానిక ఎన్నికలపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. పంచాయతీలను ఏకగ్రీవం చేసుకోవాలని నాడు పిలుపునిచ్చిన ఆ పార్టీ నేడు వద్దంటోంది. స్థానిక ఎన్నికల్లో పంచాయతీలు ఏకగ్రీవమైతే ఆయా నియోజకవర్గాల ఇన్‌చార్జిలకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఆ పార్టీ అధినేత జగన్ స్పష్టం చేశారు. దీంతో జిల్లా వైసీపీ నేతలు జిల్లాలోని అన్ని పంచాయతీల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏకగ్రీవం చేసుకుంటే ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాలతో ‘పంచాయతీలను అభివృద్ధి చేసుకోవచ్చు. ఎన్నికలకు వెళ్లి అనవసరంగా విభేదాలు సృష్టించుకోవద్దు. ’ అని నాడు చెప్పిన జగన్.. నేడు వద్దని చెప్పడంతో జిల్లావాసులు పెదవి విరుస్తున్నారు. ఇదేం దోరణి అంటూ మండిపడుతున్నారు. కేవలం ఆ పార్టీ రాజకీయ లబ్ధి కోసమే అప్పట్లో అలా ప్రచారం చేశారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
గత స్థానిక ఎన్నికల్లో ఇలా..
గత స్థానిక ఎన్నికల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో 49 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. అప్పట్లో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఉన్న పాలకొండ నియోజకవర్గంలోని సీతంపేట మండలంలో 15 పంచాయతీలు, భామినిలో నాలుగు, వీరఘట్టంలో తొమ్మిది, పాలకొండ మండలంలో ఆరు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మొత్తంగా సుమారు 83 పంచాయతీల్లో సర్పంచ్‌లతో పాటు వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొన్నిచోట్ల వార్డు మెంబర్లకు ఎన్నికలు జరగ్గా.. సర్పంచ్‌ల స్థానాలు మాత్రం ఏకగ్రీవమయ్యాయి. అయితే ఇటువంటి గ్రామాలకు గత వైసీపీ ప్రభుత్వం ప్రకటించిన విధంగా జనాభా ప్రాతిపదికన రూ.5లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ప్రోత్సాహకంగా అందించింది. అయితే వైసీపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తాజా ఎన్నికల్లో జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఆ పార్టీ నేతలు పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పటికే కూటమిలో చాలా మంది బరిలో నిలిచేందుకు సన్నద్ధమవుతున్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి కూటమి పార్టీల్లోకి వచ్చిన వారు సైతం సర్పంచ్‌లుగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఏదేమైనా ఈ సారి స్థానిక పోరు హోరాహోరీగా జరగ్గా.. కూటమి నేతలు జిల్లాలో ఎన్ని పంచాయతీలను ఏకగ్రీవం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.