Oh snake! అమ్మో పాము!
ABN , Publish Date - Feb 04 , 2026 | 11:50 PM
Oh snake! జిల్లాలో పాముకాటు బాధితులు పెరుగుతున్నారు. ప్రధానంగా రక్తపింజర కాట్లతోనే ప్రజలు ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నారు. రాజాంలో రెండు నెలల కిందట ఓ బాలుడు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతుండగా రక్తపింజర కాటేసింది.
అమ్మో పాము!
జిల్లాలో పెరుగుతున్న పాముకాట్లు
రబీ పనులు ప్రారంభం
రక్తపింజరితో జాగ్రత్త అంటున్న నిపుణులు
రాజాం, ఫిబ్రవరి4 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో పాముకాటు బాధితులు పెరుగుతున్నారు. ప్రధానంగా రక్తపింజర కాట్లతోనే ప్రజలు ప్రాణాపాయాన్ని ఎదుర్కొంటున్నారు. రాజాంలో రెండు నెలల కిందట ఓ బాలుడు సైకిల్‌పై ట్యూషన్‌కు వెళుతుండగా రక్తపింజర కాటేసింది. కుటుంబసభ్యులు సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రికి వారానికి 7 నుంచి 10 పాముకాటు కేసులే వస్తుంటాయి. గత ఏడాది 717 కేసులు నమోదయ్యాయి. అందులో సగానికిపైగా విష సర్పాల బారినపడిన వారే. జిల్లాలో ఏటా 2 వేల మంది వరకూ పాముకాటుకు గురవుతున్నారు. జిల్లాలో ఎక్కువగా కట్లపాము, రక్తపింజరి, నాగుపాములే ప్రాణాలు తీస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో భాగంగా రైతులు, కూలీలు ఎక్కువగా పాముకాట్లకు గురవుతున్నారు. అందులోనూ ఎక్కువగా గిరిజనులు, రైతులే బాధితులు. ప్రస్తుతం రబీ పనుల్లో భాగంగా రాత్రిపూట రైతులు ఎక్కువగా పొలాలకు వెళుతుంటారు. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.
వెంటనే వైద్యం అందించాలి
పాముకాటు వేసిన వెంటనే తగిన సమయంలో వైద్యసేవలందక ఎక్కువ మంది ప్రాణాలు వదులుతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటు వైద్యంపై ఆధారపడుతున్నారు. తద్వారా ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని చేజేతులా జారవిడుస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవేలెంట్ యాంటీ వినమ్’ శాస్త్రీయంగా నిరూపితమైన మందు. స్థానికంగా ఉండే పీహెచ్‌సీల్లో యాంటీ వినమ్ అందుబాటులో ఉంచుతున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ చాలా పీహెచ్‌సీల్లో ఉండడం లేదన్న విమర్శ ఉంది. సీహెచ్‌సీలతో పాటు ఏరియా ఆస్పత్రిల్లో యాంటీవినమ్ అందుబాటులో ఉన్నప్పటికీ..అది మొదటి 5-10 డోసులకే పరిమితమవుతోంది. తరువాత బాధితులను జిల్లా కేంద్రాస్పత్రికి తరలించాల్సి వస్తోంది. చికిత్స ఆలస్యం కావడం, విషం తీవ్రత బట్టి డోసుల మోతాదు మారుతూ ఉంటుంది.
పూర్తి డోసులు అవసరం
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అవసరానికి తగ్గట్టు డోసులు అందుబాటులో ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు పాముకాటు బాధితులు ప్రాణాపాయం నుంచి తప్పించుకుంటున్నప్పటికీ పూర్తిస్థాయి డోసులు పడక దీర్ఘకాలిక వ్యాధులకు గురవుతున్నారు. ముఖ్యంగా పక్షవాతం, మెదడులో రక్తం గడ్డకట్టడం, అంధత్వం తలెత్తడం, నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో పాటు గుండె, కాలేయం పనితీరుపై ప్రభావం పడుతోంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడుగంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వినమ్ డోసులను అందించగలిగితే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ఆపై దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేయవచ్చు.
ఇవి చేయాలి
పాముకాటు బారినపడకుండా ఉండాలంటే వాటి అవాసయోగ్యం కాకుండా ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి పరిసరాల్లో వస్తువులు, ధాన్యం రాశులు, సంచులు తదితర వాటిలో మురుగు లేకుండా చూసుకోవాలి. పిల్లలను పుట్టలు, గుట్టలు దగ్గర ఆటలు ఆడకుండా చూసుకోవాలి. రాత్రి సమయంలో టార్చ్‌లైట్లను వినియోగించాలి
వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలి
పాముకాటు వేస్తే వెంటనే యాంటీవినమ్ డోసు వేయాలి. తక్షణం ఆస్పత్రులకు తీసుకెళ్లాలి. నాటు వైద్యం అత్యంత ప్రమాదకరం. ఆలస్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. అన్నింటికీ మించి బాధితుడు ధైర్యంతో ఉండాలి. పాముకాటు వేసిన వెంటనే విష పాకకుండా అడ్డుకట్ట వేయాలి. తాడుతో గాయం వద్ద కట్టు వేయాలి. పాముకాటు వేసిన మూడు గంటల్లో ఇంజక్షన్ అందిస్తే ప్రాణాపాయం ఉండదు. ప్రభుత్వాస్పత్రిలో యాంటీ వినమ్ డోసులు అందుబాటులో ఉంటాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి.
కరణం హరిబాబు, ఆసుపత్రి సూపరింటెండెంట్, రాజాం ఏరియా ఆసుపత్రి
--------------