Share News

బాబ్బాబూ.. ఓటేసి పోరూ!

ABN , Publish Date - Oct 30 , 2026 | 11:54 PM

సాధారణ రోజుల్లో కనీసం పలకరించని నేతలు.. ఇప్పుడు వలస ఓటర్లకు వరుసగా ఫోన్లు చేస్తున్నారు.

బాబ్బాబూ.. ఓటేసి పోరూ!

-ఎన్నికల వేళ.. ఆత్మీయ పలకరింపులు

-వలస ఓటర్లకు నాయకుల ఫోన్లు.

-ఊరికి రావాలంటూ బతిమాలింపులు

-కుటుంబ యోగక్షేమాల పేరుతో ఓట్ల వేట

-రానుపోను ఖర్చులు భరించేందుకు సిద్ధం

రాజాం, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): సాధారణ రోజుల్లో కనీసం పలకరించని నేతలు.. ఇప్పుడు వలస ఓటర్లకు వరుసగా ఫోన్లు చేస్తున్నారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడుగుతూ ఆత్మీయతను ప్రదర్శిస్తున్నారు. పండుగకు ఊరికి వచ్చిన వారిని ఎన్నికల వరకు ఉండాలని, ఓటు వేసి వెళ్లాలని బతిమాలుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తుండటంతో గ్రామాల్లో వలస ఓటర్లను రప్పించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.

జిల్లాలోని అనేక గ్రామాల నుంచి ఉపాధి కోసం హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాలకు వలస వెళ్లినవారు అధికంగా ఉన్నారు. వీరిలో చాలామంది భవన నిర్మాణ రంగంలో కూలీలుగా పనిచేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో వీరి ఓట్లు కీలకం కావడంతో గ్రామస్థాయి నాయకులు వారి ఫోన్‌ నంబర్లు సేకరించి మరీ సంప్రదిస్తున్నారు.

‘ఈసారి మన కుటుంబానికి అవకాశం వచ్చింది. అందరూ ఊరికి వస్తేనే గెలుస్తాం.. మన కులానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు.. అవసరమైతే ప్రయాణ ఖర్చులన్నీ మేమే భరిస్తాం’ అంటూ అభ్యర్థులు, వారి అనుచరులు విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరైతే వలస ప్రాంతాలకు వెళ్లి మరీ ఓటర్లను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికలప్పుడే గుర్తొస్తున్నారు

గ్రామాల్లో వృద్ధ తల్లిదండ్రుల వద్ద పిల్లలను ఉంచి దంపతులు ఉపాధి కోసం వలస వెళుతుంటారు. సాధారణ రోజుల్లో వారి కుటుంబాల బాగోగులను పట్టించుకునేవారు అరుదు. అలాంటిది ఇప్పుడు ఎన్నికల వేళ మాత్రం ఆప్యాయంగా పలకరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. బలహీన వర్గాలు, వెనుకబడిన తరగతుల వారిని కూడా నేతలు ప్రత్యేకంగా సంప్రదిస్తున్నారు. దసరా పండుగకు ఊరికి వచ్చినవారిని ఎన్నికల వరకు ఉండాలని కోరుతుండటమే ఇందుకు నిదర్శనం.

Updated Date - Oct 30 , 2026 | 11:54 PM