Share News

Transformers అమ్మో.. ట్రాన్స్‌ఫార్మర్లు

ABN , Publish Date - Jun 20 , 2026 | 12:26 AM

Oh No... Transformers in Trouble! జిల్లాలో పలుచోట్ల ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాద కరంగా దర్శనమిస్తున్నాయి. వాటి చుట్టూ ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి.

 Transformers అమ్మో.. ట్రాన్స్‌ఫార్మర్లు
వీరఘట్టంలో ట్రాన్స్‌ఫార్మర్‌ఇలా..

  • ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి

  • ఆందోళనలో ప్రజలు

  • అవసరమైన చోట ఏర్పాటు చేస్తాం : విద్యుత్‌శాఖ ఎస్‌ఈ

జియ్యమ్మవలస, జూన్‌19(ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రమాద కరంగా దర్శనమిస్తున్నాయి. వాటి చుట్టూ ఎలాంటి రక్షణ కంచెలు లేకపోవడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి. 15 మండలాల పరిధిలో 2,55,132 గృహ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. 20,272 వ్యవసాయ, 516 పరిశ్రమలు, 21,284 వ్యాపార, వాణిజ్య , 9,668 వరకూ ఇతర విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. 36 చోట సబ్‌స్టేషన్లు ఉన్నాయి. వాటి పరిధిలో 11,218 ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. అయితే రద్దీ ప్రదేశాల్లో, జనావాసాల మధ్య, ప్రధాన రహదారులకు ఆనుకుని, పాఠశాలలు, ఆసుపత్రుల సమీపంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. కంచెలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇప్పటికే పలు చోట్ల దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2023, మే 12న భామిని మండలం కాట్రగడ్డ వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌ తాకి నాలుగు ఏనుగులు ఒకేసారి మరణించాయి. కొమరాడ మండలం అర్తాం - కళ్లికోట గ్రామాల మధ్య పొలాల్లో ఒక ఏనుగు విద్యుదాఘాతంతో మృత్యువాత పడింది. పంట పొలాలు, రహదారులు, పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోకు ఆనుకుని ఉన్న ట్రాన్స్‌ఫార్మర్ల కారణంగా ఎంతో మంది మృతి చెందారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. దీనిపై విద్యుత్‌శాఖ ఎస్‌ఈ పెద్దింటి త్రినాథరావును వివరణ కోరగా.. ‘జిల్లాలో ఉన్న అన్ని ట్రాన్స్‌ఫార్మర్ల చుట్టూ కంచెలు నిర్మించడమంటే అది ఖర్చుతో కూడుకున్న పని. కానీ అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్‌ చుట్టూ కంచెలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నాం.’ అని తెలిపారు.

Updated Date - Jun 20 , 2026 | 12:26 AM