Share News

Oh No… The Bypass! అమ్మో.. బైపాస్‌!

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:12 AM

Oh No… The Bypass! . సాలూరు బైపాస్‌ రహదారిలో నిత్యం ఎంతోమంది ప్రమాదాల బారిన పడి మృత్యువాతపడుతున్నారు. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదు.

Oh No… The Bypass! అమ్మో.. బైపాస్‌!
సాలూరు బైపాస్‌ రోడ్డు

  • తరచూ ఘటనలు.. పలువురి మృత్యువాత

  • క్షతగాత్రులై ఆసుపత్రిపాలవుతున్న వారెందరో..

  • కానరాని విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటు

  • ప్రతిపాదనలకే పరిమితమవుతున్న అధికారులు

సాలూరు, జనవరి31(ఆంధ్రజ్యోతి):

- గత ఏడాది మార్చి 23న సాలూరు మండలం నెలిపర్తి పంచాయతీ వంగరగుడ్డివలసకి చెందిన భార్యాభర్తలు సాలూరు బైపాస్‌ రోడ్డులో బైక్‌పై వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం వారిని ఢీకొంది. దీంతో ఆ దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు.

- రెండు నెలల కిందట పట్టణానికి చెందిన రైతు తన కొడుకుతో కలిసి అదే దారిలో బైక్‌పై పొలానికి వెళ్తుండగా.. జీగిరాం కూడలి సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో రైతు అక్కడికక్కడే మృతి చెందగా కుమారుడు గాయాలపాలయ్యాడు.

.. ఇలా వారే కాదు.. సాలూరు బైపాస్‌ రహదారిలో నిత్యం ఎంతోమంది ప్రమాదాల బారిన పడి మృత్యువాతపడుతున్నారు. మరికొందరు క్షతగాత్రులవుతున్నారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సంబంధిత అధికారులు మాత్రం స్పందించడం లేదు. కనీసం ఆ మార్గంలోని ప్రధాన కూడళ్లలో విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం లేదు. మొత్తంగా సాలూరు బైపాస్‌ రోడ్డు ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. తరచూ రాత్రి వేళల్లో ఈ ప్రాంతంలో ప్రమాదాలు సంభవిస్తుండడంతో ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగించాలంటేనే బెంబే లెత్తిపోతున్నారు.

ఇదీ పరిస్థితి..

సాలూరు పట్టణంలో ప్రత్యామ్నాంగా సుమారు రూ.45 కోట్లతో ఆరు కిలోమీటర్లు మేర బైపాస్‌ రోడ్డును నిర్మించారు. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాలకు చెందిన వందలాది వాహనాలు ఈ రోడ్డు మీదుగా నిత్యం రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే ఈ మార్గంలో ఉన్న డంపింగ్‌ యార్డ్‌లో చెత్తలను కాల్చడం వల్ల బైపాస్‌ రహదారిని పొగ కమ్మేస్తోంది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి ప్రమాదాలకు గురవుతున్నారు. మరోవైపు జీగిరాం, దుగ్ధసాగరం కూడళ్లలో విద్యుత్‌ దీపాలు లేవు. ఎక్కడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయలేదు. వాటి కోసం ఏడాది కిందట ప్రతిపాదనలు పంపించారు. కానీ ఇప్పటి వరకు పనులు చేపట్టలేదు. పురపాలక, పోలీసు శాఖల అధికారులు ప్రమాద స్థలాలను పరిశీలించారు. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ విషయాన్ని పాలకవర్గం దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎటువంటి చర్యల్లేవు. దీంతో చీకటి పడితే చాలు.. బైపాస్‌ రోడ్డులో ఎవరో ఒకరు ప్రమాదాలకు గురువుతున్నారు. మరోవైపు ఈ రోడ్డుకిరువైపులా ఆక్రమణలు పెరిగి పోతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు, వాహనదారులు కోరుతున్నారు.

పనులు చేపడతాం..

సాలూరులో బైపాస్‌ రోడ్డులో విద్యుత్‌ దీపాలు, సీసీ కెమెరాల ఏర్పాటుకు సంబంధించి గతంలోనే మున్సిపల్‌ పాలక వర్గం తీర్మానం చేసింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించాం. నిధులు వచ్చిన వెంటనే పనులు చేపడతాం.

- రత్నకుమార్‌,మున్సిపల్‌ కమిషనర్‌,సాలూరు

Updated Date - Feb 01 , 2026 | 12:12 AM