Oh No… Malaria! అమ్మో .. మలేరియా!
ABN , Publish Date - May 12 , 2026 | 12:01 AM
Oh No… Malaria! సీతంపేట ఏజెన్సీని మలేరియా వణికిస్తోంది. ఇటీవల కాలంలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం 360 వరకు ఓపీ నమోదైంది. వీరిలో అధికశాతం మంది జ్వర బాధితులే ఉన్నారు.
చిన్నారులను పీడిస్తున్న జ్వరాలు
సీతంపేట ఆసుపత్రి కిటకిట
సీతంపేట రూరల్, మే 11(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీని మలేరియా వణికిస్తోంది. ఇటీవల కాలంలో అధికంగా పాజిటివ్ కేసులు నమోదవుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సీతంపేట ఏరియా ఆసుపత్రిలో సోమవారం 360 వరకు ఓపీ నమోదైంది. వీరిలో అధికశాతం మంది జ్వర బాధితులే ఉన్నారు. సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించిన రోగుల్లో ఎక్కువ మంది చిన్నారులు కూడా ఉన్నారు. కాగా పలువురు రోగులకు మలేరియా(ర్యాపిడ్ డయాగ్నొస్టిక్) నిర్ధారణ పరీక్షలు చేయగా.. 11 కేసులు పాజిటివ్‌గా నమోదయ్యాయి. ఈ నెల ప్రారంభం నుంచి చూస్తే ఏరియా ఆసుపత్రిలో ఆర్‌డీటి కిట్‌ల ద్వారా నిర్వహించిన పరీక్షల్లో 60వరకు మలేరియా పాజిటివ్ కేసులు నమోదైనట్లు నివేదికలు చెబుతున్నాయి. కాగా మలేరియా పాజిటివ్ కేసుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాల కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు వైద్య సిబ్బంది చెబుతున్నారు.
జ్వరపీడితులు ఇలా...
చలి జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో గిరిజన చిన్నారులు ఎక్కువ మంది సోమవారం సీతంపేట ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించారు. గిరిశిఖర గ్రామం వంబరెల్లికి చెందిన చిన్నారి సవర సుచిత్ర, అంటికొండకి చెందిన సవర జాన్, జొనగ గ్రామానికి చెందిన సవర హరిణి, హారికలతో పాటు లంబగూడకి చెందిన సవర జాన్, సవర అక్షతో పాటు వారి తల్లి సవర సులోమి కూడ జ్వరంతో బాధపడుతోంది. వీరి ముగ్గురిలో సవర సులోమి, జాన్‌లు మలేరియాతో ఇబ్బంది పడుతున్నారు. దీనిపై ఆసుపత్రి ఇన్‌చార్జి పర్యవేక్షకుడు డీవీ శ్రీనివాస్‌ను వివరణ కోరగా.. జ్వరంతో ఆసుపత్రికి రోగులకు మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామన్నారు. జ్వరపీడితులకు ఆర్‌డీటీ కిట్స్ ద్వారా చేస్తున్న రక్తపరీక్షల్లో మలేరియా పాజిటివ్ వచ్చిన కేసులకు తగు చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు.