Share News

Oh no… Chinna! అయ్యో..చిన్నా!

ABN , Publish Date - Mar 20 , 2026 | 11:37 PM

Oh no… Chinna! : తోటి స్నేహితులతో కలిసి అప్పటివరకు ఆడిపాడిన విద్యార్థి ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. బాత్‌రూం గోడ కూలడంతో ఊపిరివదిలాడు.

Oh no… Chinna! అయ్యో..చిన్నా!
ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ

  • శోకసంద్రంలో తల్లిదండ్రులు

కొమరాడ, మార్చి20(ఆంధ్రజ్యోతి): తోటి స్నేహితులతో కలిసి అప్పటివరకు ఆడిపాడిన విద్యార్థి ఒక్కసారిగా విగతజీవిగా మారాడు. బాత్‌రూం గోడ కూలడంతో ఊపిరివదిలాడు. ఇంటి పెరట్లో ఉన్న బాత్‌రూం గోడే తమ బిడ్డ పాలిట మృత్యువుగా మారడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. వివరాల్లోకి వెళ్తే..

ఒడిశా రాష్ట్రం అలమండకు చెందిన బిడ్డిక కొండ, జ్యోతి దంపతులు గత నాలుగేళ్ల నుంచి కొమరాడ మండలం అర్తాం గ్రామంలోని ఓ అద్దె ఇంటిలో ఉంటున్నారు. వారికి ఇద్దరు సంతానం. కుమారుడు బిడ్డిక హేమంత్‌ (9) స్థానిక పాఠశాలలో మూడో తరగతి చదువుతన్నాడు. వారి కుమార్తె అదే బడిలో రెండో తరగతి చదువుతోంది. కొండ తాపీమేస్ర్తి కాగా జ్యోతి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఒంటిపూట బడులు కావడంతో రోజూలానే స్కూల్‌కు వెళ్లిన హేమంత్‌ మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చాడు. కాసేపటి తర్వాత తోటి స్నేహితులతో కలిసి ఇంటి పెరట్లో ఆడుకున్నాడు. అయితే గురువారం రాత్రి కురిసిన వర్షానికి నానిపోయి ఉన్న బాత్‌రూం గోడ ఒక్కసారిగా బాలుడిపై పడింది. ఈ ఘటనతో షాక్‌కు గురైన తోటి స్నేహితులు గట్టిగా కేకలు వేస్తూ.. విద్యార్థి తల్లికి ఈ విషయం చెప్పారు. దీంతో ఆమె వెంటనే ఇంటి పెరట్లోకి వెళ్లగా.. కూలిన గోడ కింద ఉన్న కుమారుడిని చూసి కన్నీరుమున్నీరైంది. స్థానికుల సాయంతో హేమంత్‌ను బయటికి తీశారు. కొనఊపిరితో ఉన్న బాలుడ్ని పట్టుకుని హుటాహుటిన పార్వతీ పురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలివెళ్లారు. అయితే వైద్యులు చికిత్స అందించినప్పటికీ లాభం లేకపోయింది. తలకు బలమైన గాయం కావడంతో పరిస్థితి విషమించి.. విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. విగతజీవిగా పడి ఉన్న కుమారుడిని చూసి గుండెలవిసేలా రోదించారు. బాలుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ జగదీష్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Mar 20 , 2026 | 11:37 PM