Share News

Oh No… aadali అమ్మో..ఆడలి!

ABN , Publish Date - Jan 22 , 2026 | 11:18 PM

Oh No… aadali సీతంపేట ఐటీడీఏ పరిధిలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన ఆడలి వ్యూపాయింట్‌ మార్గం ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. దీంతో పర్యాటకులు హడలెత్తిపోతున్నారు.

Oh No… aadali అమ్మో..ఆడలి!
ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో ప్రమాదకరంగా ఉన్న మలుపు

  • ఏడాదిన్నరలో ఐదుగురు మృతి

  • పదుల సంఖ్యలో క్షతగాత్రులు

  • రక్షణ గోడలున్నా.. మలుపుల వద్ద తరచూ ప్రమాదాలు

సీతంపేట రూరల్‌, జనవరి22(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఐటీడీఏ పరిధిలో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దిన ఆడలి వ్యూపాయింట్‌ మార్గం ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. దీంతో పర్యాటకులు హడలెత్తిపోతున్నారు. ఏడాదిన్నరలో ఐదుగురు మృతి చెందగా.. పదుల సంఖ్యలో సందర్శకులు క్షతగాత్రులుగా మారారు. ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న మలుపుల వద్ద రక్షణ గోడలు నిర్మించినా మృత్యు గోష ఆగడం లేదు. కేవలం తిరుగు ప్రయాణంలో మాత్రమే తరచూ ప్రమాదాలు జరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

ప్రమాదాలు ఇలా...

- వాస్తవంగా 2024లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఆడలి వ్యూపాయింట్‌ను ఎంతో ఘనంగా ప్రారంభించారు. కాగా వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో సుమారు ఐదు వరకు ప్రమాదకర మలుపులు ఉన్నాయి. గడచిన ఏడాదిన్నర కాలంలో ఎక్కువ శాతం ప్రమాదాలు బిడిందిగూడ, వెల్లంగూడ మలుపులు వద్ద మాత్రమే సంభవించాయి. ఈ రెండు మలుపుల్లోనే ఆటో, ద్విచక్ర వాహన ప్రమాదాలు జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 60మందికి పైగా గాయాలపాలయ్యారు.

- 2024, నవంబరు 24న వ్యూపాయింట్‌ మార్గంలో పాలకొండ పట్టణానికి చెందిన భారతి మృతిచెందగా భర్త,పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. బైక్‌పై కొండ దిగుతుండగా మలుపు వద్ద అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యారు. తిరుగు ప్రయాణంలో మరో మలుపు వద్ద ఓ ఆటోను వెనుక నుంచి వస్తున్న మరో ఆటో ఢీకొన్న ప్రమాదంలో కురింపేట గ్రామానికి చెందిన బొడ్డు యశోదమ్మ, వెల్లంగూడ గ్రామానికి చెందిన సవర రెల్లయ్యలు మత్యువాతపడ్డారు. 2025లో సీతంపేట గ్రామానికి చెందిన జి.వేణుమాధవ్‌ వెల్లంగూడ మలుపువద్ద ద్విచక్ర వాహనం అదుప ుతప్పి బండరాయిని ఢీకొని మృతిచెందాడు. ఈప్రమాదాల్లో అనేక మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇదిలా ఉండగా ఈ మార్గంలో వెలుగులోకి రాని ప్రమాదాలు చాలా వరకు ఉన్నాయి.

రక్షణ గోడలు ఉన్నా..

ప్రమాదాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు వ్యూ పాయింట్‌కు వెళ్లే మార్గంలో ఉన్న ఐదు ప్రమాదకర మలుపుల వద్ద గత ఏడాదిలో రూ.1.20కోట్లతో రక్షణగోడలను నిర్మించారు. దీంతో ఇటీవల కాలంలో ప్రమాదాలు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. అయితే ఈనెల 18న మెళియాపుట్టి మండలం వసుంధర గ్రామానికి చెందిన ఒక కుటుంబం ఆటోలో ఆడలి వ్యూపాయింట్‌ను చూసేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో బిడిందిగూడ జంక్షన్‌ వద్ద ఉన్న మలుపు వద్ద ఆటో అదుపుతప్పి ఎదురుగా ఉన్న రక్షణగోడను బలంగా ఢికొంది. ఈ ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతిచెందగా మిగిలిన ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

అవగాహన కల్పిస్తున్నా..

గిరిశిఖర ప్రాంతాలు, ఘాట్‌రోడ్లలో ప్రయాణించే పర్యాటకులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఆడలీ వ్యూ పాయింట్‌కు వెళ్లే మార్గంలో అనేక చోట్ల ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. బైక్‌పై పైకి వెళ్లాలంటే హెల్మెట్‌ తప్పనిసరి అనే నిబంధనను సైతం అమలుచేస్తున్నారు. అయినప్పటికీ ఈ మార్గంలో ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఇన్‌చార్జి పీవో ఏమన్నారంటే..

‘ఆడలి వ్యూపాయింట్‌కు వెళ్లే మార్గంలో పర్యాటకుల రక్షణ కోసం ప్రొటక్షన్‌ వాల్స్‌ నిర్మించాం. ప్రమాదకర మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశాం. గిరిశిఖర ప్రాంతం కావడంతో పర్యాటకులు కూడా చాలా జాగ్రత్తగా వాహనాల్లో ప్రయాణించాలని సూచించాం. ఆ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులతో పాటు సందర్శకులకు కూడా రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తున్నాం.’ అని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ తెలిపారు.

Updated Date - Jan 22 , 2026 | 11:18 PM