Oh My.. What Fierce Winds! వామ్మో.. ఇవేం గాలులు
ABN , Publish Date - May 26 , 2026 | 11:51 PM
Oh My.. What Fierce Winds! జిల్లాలో మళ్లీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల కిందట వీచిన గాలులకు మన్యంలో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఫ్లెక్సీలు, బోర్డులు విద్యుత్ వైర్లపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది.
అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం
నేలకూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
వాహన రాకపోకలకు ఇబ్బందులు
నిలిచిన విద్యుత్ సరఫరా
అంధకారంలో గ్రామాలు
మామిడి, అరటి, చెరకు పంటలకు తీవ్ర నష్టం
పార్వతీపురం/పార్వతీపురం టౌన్/జియ్యమ్మవలస/కురుపాం రూరల్/సాలూరు/సీతానగరం (బలిజిపేట)/వీరఘట్టం/మక్కువ రూరల్, మే26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. నాలుగు రోజుల కిందట వీచిన గాలులకు మన్యంలో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఫ్లెక్సీలు, బోర్డులు విద్యుత్ వైర్లపై పడడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పల్లెలు చీకట్లోనే మగ్గాయి. జీడి, మామిడి, ఇతర రబీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తాజాగా మంగళవారం అదే పరిస్థితి ఏర్పడింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడి, ఉక్కపోత అధికంగా ఉండగా.. ఆ తర్వాత వాతావరణం మారింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఆ తర్వాత జిల్లాలో గాలివాన కురిసింది. ప్రధానంగా ఈదురుగాలుల తీవ్రతకు జియ్యమ్మవలస మండలం పెదమేరంగి కూడలికి సమీపంలో ప్రధాన రహదారిపై భారీ చెట్టు నేలకొరిగింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్రఅంతరాయం ఏర్పడింది. చెట్టును తొలగించేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. మరోవైపు బీజే పురం గ్రామంలో చర్చి సీలింగ్ కూలిపోయింది. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో మండలం అంతా ఒక్కసారిగా అంధకారం నెలకొంది. పలు చోట్ల అరటి, మామిడి, చెరకు, తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎండ తీవ్రత, ఉక్కపోతతో కొద్ది రోజులుగా అల్లాడిపోయిన ప్రజలకు మాత్రం ఈ గాలివాన కాస్త ఉపశమనం కలిగించింది.
- కురుపాం మండలం కిచ్చాడ పంచాయతీలో 15 నిమిషాల పాటు వీచిన భీకర గాలులకు 25 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాల్లో కరెంట్ స్తంభాలు కూలడంతో రైతులు పోలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. గాలుల కారణంగా కిచ్చాడ గ్రామంలోని ఓ ఇంటిపై చెట్టు కూలింది. పోతురాజు గుడిపై రేకులు గాలికి ఎగిరిపోయాయి. రామకృష్ణాపురంలో రోడ్డుకు అడ్డంగా విద్యుత్ స్తంభం విరిగిపడింది. అంతే గాకుండా పలు దుకాణాలు గాలికి ఎగిరి.. పక్కనున్న పొలాల్లో పడ్డాయి.
- పార్వతీపురం పట్టణంలో ఈదురుగాలుతో తేలకపాటి వర్షం కురిసింది. సుమారు 30 నిమిషాలపాటు వీచిన గాలులకు ప్రధాన రహదారిలోని డివైడర్ల మధ్యలో ఉన్న చెట్టు కూలాయి. దీంతో అటుగా వెళ్లే వాహనచోదకులు, పాదచారులకు ఇబ్బందులు తప్పలేదు. మున్సిపల్ ప్రజారోగ్యశాఖ సిబ్బంది వాటిని అక్కడ నుంచి తొలగించడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తలేదు.
- గాలివాన కారణంగా సాలూరు మండలంలోని బొడ్డవలస కూడలిలో భారీ చెట్టు కూలింది.దీంతో సాలూరు -మామిడిపల్లి రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సాలూరు రూరల్ ఎస్‌ఐ రవీంద్రరాజు తన సిబ్బందితో వెంటనే అక్కడకు చేరుకుని.. యంత్రాల సాయంతో చెట్టును తొలగించారు. ఆ తర్వాత యథావిధిగా వాహన రాకపోకలు సాగడంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.
- బలిజిపేటలోని ప్రధాన కూడలి, పెదపెంకి రహదారిలో చెట్లు నేలకొరిగాయి. దీంతో రాకపోకలు స్తంభించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ సింహాచలం తన సిబ్బందితో అక్కడకు వెళ్లి ఆయా మార్గాల్లో చెట్లును తొలగించారు.
- వీరఘట్టం మండలం వెంకంపేట జంక్షన్ వద్ద మర్రిచెట్టు కూలింది. దీంతో పార్వతీ పురం-పాలకొండ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్‌ఐ షన్ముఖరావు వెంటనే అక్కడకు చేరుకుని యంత్రాల సాయంతో చెట్టును తొలగించారు. దీంతో వాహన రాకపోకలు సాగాయి.
- మక్కువలో మంగళవారం సాయంత్రం సుమారు అరగంట పాటు ఈదురుగాలులతో వర్షం కురిసింది. స్థానిక రెల్లివీధి వద్ద రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు నేలకూలింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాగా ఇదే వీధిలోని పలు ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. పైకప్పులు లేకపోవడంతో వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరి నిత్యావసరాలు తడిసిపో యాయి. కళ్లెదుటే ఇళ్లు జలమయం కావడంతో బాధితులు కన్నీరుమున్నీరుగా విలపించారు. సువర్ణముఖి నది వంతెనకు సమీపంలోనూ ఓ చెట్టు, విద్యుత్ స్తంభం నేలకూలాయి. దీంతో గ్రామంలో కరెంట్ సరఫరా నిలిచిపోయింది. ఎస్‌ఐ ఎం.వెంకటరమణ, విద్యుత్ సిబ్బంది తదితరులు స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. దుగ్గేరు రోడ్డులో అడ్డంగా పడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించి రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా చేశారు.
విద్యుత్ స్తంభం పడి యువకుడికి గాయాలు
జియ్యమ్మవలస మండలం చినమేరంగిలో విద్యుత్ స్తంభం మీద పడడంతో పట్లాసింగి రాంబాబు అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులు వీస్తున్న సమయంలో వీధి చివరన ఉన్న ఆయనపై పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం ఒక్కసారిగా కూలింది. దీంతో రాంబాబు తల, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన స్థానికులు క్షతగాత్రుడిని చినమేరంగి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. పరిస్థితి మెరుగవకపోవడంతో అక్కడి నుంచి పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.