Oh My God… A Storm! అమ్మో.. తుఫాన్
ABN , Publish Date - Nov 17 , 2026 | 12:18 AM
Oh My God… A Storm! జిల్లాలో అన్నదాతలను తుఫాన్ భయం వెంటాడుతోంది. ఆర్నబ్, మురసు తుఫాన్ల నష్టాల నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో తుఫాన్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రానికి అక్వాన్ తుఫాన్‌గా మారింది. ఇది మన్యం జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం
రైతుల గుండెల్లో గుబులు
చేతికందొచ్చిన వరి పంటను కాపాడుకునేందుకు అవస్థలు
పాలకొండ/మక్కువ/వీరఘట్టం/పార్వతీపురం రూల్, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్నదాతలను తుఫాన్ భయం వెంటాడుతోంది. ఆర్నబ్, మురసు తుఫాన్ల నష్టాల నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో తుఫాన్ వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం సాయంత్రానికి అక్వాన్ తుఫాన్‌గా మారింది. ఇది మన్యం జిల్లాపై ప్రభావం చూపే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 48 గంటల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చేతికందొచ్చిన వరి పంటను ఎలా కాపాడుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ ప్రారంభం నుంచి రైతులు అష్టకష్టాలు పడి వరి సాగు చేపట్టారు. సుమారు 80 వేల హెక్టార్లలో పంట చివరి దశకు వచ్చింది. కోతలు చేపట్టేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. కాగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో తేలికపాటి రకాలైన వరి పంట కోతలు పూర్తయ్యాయి. వరి పనాలను కుప్పలుగా పంట పొలాల్లోనే ఉంచారు. యంత్రాల ద్వారా కోతలు పూర్తిచేసిన వారు కూడా పంటను కల్లాల్లోనే ఉంచారు. పలు గ్రామాల్లో ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. కొన్నిచోట్ల మినుము, పెసర, కట్టెజనుం, ఇతర వాణిజ్య పంటల విత్తనాలను పంటపొలాల్లో జల్లుతున్నారు. అయితే ఈ తరుణంలోనే తుఫాన్ ప్రకటన రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిస్తే పంటలు బాగా దెబ్బతినే అవకాశం ఉందని అన్నదాతలు వాపోతున్నారు. మక్కువ మండలంలో 11,200 ఎకరాల్లో వరి సాగు చేపట్టారు. అయితే తుఫాన్ నేపథ్యంలో డి.శిర్లాం, తూరుమామిడి, కోన, గోపాల పరం తదితర గ్రామాల్లో రైతులు కోతలు ప్రారంభించారు. మరోవైపు వ్యవసాయాధికారులు కూడా అన్నదాతలను అప్రమత్తం చేస్తున్నారు. పంటల సంరక్షణ చర్యలను సూచిస్తున్నారు. పార్వతీపురం మండలంలోని చొక్కాపువానివలస, ములగ తదితర ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభించారు. మరికొందరు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటూ పంట సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.